Begin typing your search above and press return to search.

'బలగం' మొగిలయ్యకు అస్వస్థత.. ఆదుకోవాలని కోరిన భార్య

అయితే ఆ పాట పాడిన గాయకుడు మొగిలయ్య.. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగోలేదు.

By:  Tupaki Desk   |   5 Jun 2024 9:54 AM GMT
బలగం మొగిలయ్యకు అస్వస్థత.. ఆదుకోవాలని కోరిన భార్య
X

జబర్దస్త్ కమెడియన్ వేణు దర్శకుడిగా మారి తెరకెక్కించిన బలగం మూవీలోని క్లైమాక్స్ లో వచ్చే సాంగ్ గుర్తుందా? 'తోడుగా మా తోడుండి' అంటూ సాగే ఆ పాట.. దాదాపు సినిమా చూసిన అందరినీ ఏడిపించేసింది. కొందరు తమ కుటుంబాల్లో జరిగిన వాటిని గుర్తు తెచ్తుకుని మరీ ఎమోషనల్ అయ్యారు. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా ఎలాంటి హిట్ అయిందో తెలిసిందే. మూవీ మొత్తానికి ఆ పాట ప్రధాన హైలెట్ గా నిలిచింది.

అయితే ఆ పాట పాడిన గాయకుడు మొగిలయ్య.. ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు బాగోలేదు. ఎప్పటి నుంచో అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ప్రస్తుతం తెలంగాణలోని వరంగల్ లో ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో మొగిలయ్య భార్య కొమురమ్మ తన భర్త వైద్యానికి సహాయం చేయాలని ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. చికిత్సకు అవసరమైన డబ్బులు లేవని, దయచేసి తమను ఆదుకోవాలని కోరుతోంది.

వరంగల్‌ జిల్లాకు చెందిన మొగిలయ్య.. బుర్రకథలు చెబుతూ జీవిస్తుండేవారు. తమ తాతల నుంచి సంప్రదాయంగా వచ్చిన కళతో బతుకుతుండేవారు. తెలంగాణలోని పలు ప్రాంతాలకు వెళ్లి బుర్రకథలు చెప్పేవారు. అప్పటి ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇల్లు పైకప్పు కూడా కూలిపోవడం వల్ల గుడారంలా వేసుకుని బతుకుతున్నారు. కొన్ని నెలల క్రితం మొగిలయ్య అనూహ్యంగా కరోనా బారినపడ్డారు.

ఆ తర్వాత ఆయన రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో అప్పటి నుంచి వివిధ ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చదువుకోకపోయినా మొగిలయ్య, కొమురమ్మ.. పరిస్థితిని బట్టి అప్పటికప్పుడు పాటలు క్రియేట్ చేసి బాగా పాడుతారు. అలా ఆ దంపతుల బుర్ర కథ విన్న వేణు.. వారికి ఛాన్స్ ఇచ్చారు. అటు థియేటర్లలో.. ఇటు ఓటీటీలో బలగం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మొగిలయ్య దంపతులకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది.

కానీ ఎప్పటికప్పుడు మొగిలయ్య ఆరోగ్య పరిస్థితి మాత్రం దిగజారుతోంది. ఇప్పటికే అనేక ఆపరేషన్లు జరిగాయి. గుండె సంబంధిత సమస్య కూడా వచ్చింది. దీంతో అప్పటి కేసీఆర్ ప్రభుత్వంతో పాటు బలగం మేకర్స్ కూడా మొగిలయ్యకు ఆర్థిక సహాయం చేశారు. దిల్ రాజు, వేణు రూ.లక్ష చొప్పున అందించారు. మళ్లీ ఇప్పుడు మొగిలయ్య ఆస్పత్రి పాలయ్యారు. దీంతో తమను ఆదుకోవాలని కొమురమ్మ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటోంది.