అఘోరా ఎంట్రీకి ఏర్పాట్లు
హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో హ్యాట్రిక్ కు ట్రై చేస్తున్నాడు.
By: Tupaki Desk | 27 Jan 2025 6:30 PM GMTహ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మరో హ్యాట్రిక్ కు ట్రై చేస్తున్నాడు. మొన్న సంక్రాంతికి డాకు మహారాజ్ సినిమాతో భారీ విజయం అందుకున్న బాలయ్య ప్రస్తుతం బోయపాటితో కలిసి అఖండ2 సినిమా చేస్తున్నాడు. బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాకు సీక్వెల్ గా అఖండ2 తాండవం తెరకెక్కుతుంది.
ఇప్పటికే బోయపాటి- బాలయ్య కాంబినేషన్ లో సింహా, లెజెండ్, అఖండ సినిమాలు రాగా ఆ మూడు సినిమాలూ ఒకదాన్ని మించి మరొకటి హిట్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో వీరి కాంబోలో రానున్న అఖండ2 తాండవంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సంయుక్త మీనన్ కీలక పాత్రలో నటిస్తుంది.
ఆల్రెడీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న అఖండ2 తాండవం ఇప్పుడు రెగ్యులర్ షూటింగ్ కు రెడీ అవుతోంది. తాజా సమాచారం ప్రకారం అఖండ2 షూటింగ్ వచ్చే నెల రెండో వారం నుంచి మొదలవనున్నట్టు తెలుస్తోంది. బాలయ్యపై రామోజీ ఫిల్మ్ సిటీలో అఘోరా పాత్రకు సంబంధించిన ఎంట్రీ సీన్లను తెరకెక్కించనున్నారట.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో దానికి సంబంధించిన సెట్స్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు బోయపాటి అఖండ2 కోసం నటీనటులను ఎంపిక చేయడంలో బిజీగా ఉన్నాడు. పలు కీలక పాత్రల కోసం ఇతర భాషల నటులను తీసుకోవాలని బోయపాటి ఫిక్స్ అయ్యాడట. ఇతర భాషల నటులను తీసుకోవడం వల్ల పాన్ ఇండియా స్థాయిలో సినిమాకు అన్ని భాషల్లో హైప్ పెరుగుతుంది.
14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట, గోపీ ఆచంట భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమన్- బాలయ్య కాంబోపై మంచి హైప్ ఏర్పడింది. బాలయ్య కోసం తమన్ ఇస్తున్న మ్యూజిక్ కు అందరూ ఫిదా అవుతున్నారు. గతంలో అఖండ రిలీజ్ టైమ్ లో తమన్ మ్యూజిక్ కు స్పీకర్లు పగిలిపోయిన వైనం చూశాం. ఇప్పుడు అఖండ2 కోసం తమన్ ఏ స్థాయిలో మ్యూజిక్ ఇస్తాడో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు.