Begin typing your search above and press return to search.

పిక్ టాక్: బాలయ్యతో 'అల్లు'కున్న అనుబంధం!

'ఆహా' ఓటీటీలో నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్‌' టాక్ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండుసార్లు సందడి చేసిన సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   20 Nov 2024 4:28 PM GMT
పిక్ టాక్: బాలయ్యతో అల్లుకున్న అనుబంధం!
X

'ఆహా' ఓటీటీలో నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్‌' టాక్ షోలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రెండుసార్లు సందడి చేసిన సంగతి తెలిసిందే. 'పుష్ప 1' టైంలో ఒకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న బన్నీ.. 'పుష్ప 2' విడుదలకు ముందు సీజన్-4లోనూ ముఖ్య అథితిగా హాజరయ్యారు. 'ఇద్దరూ ఫైరే' పేరుతో వచ్చిన ఈ ఎపిసోడ్ ఫస్ట్ పార్ట్ లో అల్లు అర్జున్ తో పాటుగా ఆయన తల్లి నిర్మల కూడా కనిపించగా.. సెకండ్ పార్ట్ లో బన్నీ పిల్లలు అయాన్, అర్హ సందడి చేసారు. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

''క్యూట్ కన్వర్జేషన్స్ అండ్ అన్‌స్టాపబుల్‌ వైబ్స్.. అల్లు అర్జున్ పిల్లలు వైల్డ్‌ఫైర్ ఎపిసోడ్ పార్ట్ 2లో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు'' అంటూ 'ఆహా' టీమ్ 'అన్‌ స్టాపబుల్‌' లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఇందులో ఒక ఫొటోలలో బాలయ్య ప్రేమతో అయాన్, అర్హలను దగ్గరకు తీసుకుంటూ కనిపించారు. ఒక పిక్ లో అల్లు అయాన్ మెడను గట్టిగా పట్టుకున్నట్లు బాలకృష్ణ ఫోజ్ ఇచ్చారు. మరో ఫొటోలో బాలయ్య, అయాన్, అర్హలతో బన్నీ సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. ఈ ఫోటోలు చూసి ఇది బాలయ్యతో 'అల్లు'కున్న అనుబంధం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి, అల్లు ఫ్యామిలీల మధ్య ఎన్నో ఏళ్లుగా మంచి అనుబంధం ఉంది. మొదటి తరం నుంచే వీరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. లెజండరీ నటులు నందమూరి తారక రామారావు, అల్లు రామలింగయ్య ఎంతో సాన్నిహిత్యంగా ఉండేవారు. సినిమాల్లో కలిసి నటించడమే కాదు, రియల్ లైఫ్ లోనూ కలిసి మెలిసి ఉండేవారు. వీరి తర్వాతి జనరేషన్ లో బాలకృష్ణ, అల్లు అరవింద్ అదే స్నేహ బంధాన్ని కొనసాగించారు. చిన్నతనంలో మద్రాసులో ఉన్నప్పుడు వీరంతా కలిసే ఆడుకునేవారు. ఈ విషయాన్ని బాలయ్యే స్వయంగా తెలిపారు.

ఇక అల్లు అరవింద్ సారథ్యంలో నడిచే 'ఆహా' ఓటీటీ కోసం బాలకృష్ణ 'అన్ స్టాపబుల్' షో చేస్తున్నారు. అసలు బాలయ్య లాంటి హీరో ఒక టాక్ షోకి హోస్టుగా చేస్తారని ఎవరూ ఊహించనే లేదు. కానీ అల్లు అరవింద్ మాత్రం నిజ జీవితంలో ఎలాంటి ఎమోషన్స్ దాచుకోకుండా, ఉన్నది ఉన్నట్లు చూపించే బాలయ్య అయితేనే హోస్ట్ గా కరెక్ట్ అని భావించారు. అడిగిన వెంటనే బాలయ్య సైతం ఓకే అనడంతో 'అన్ స్టాపబుల్' కార్యరూపం దాల్చింది. కేవలం అల్లు అరవింద్ అడిగారు కాబట్టే ఈ షో చేయడానికి ఒప్పుకున్నానని ఓ సందర్భంలో అన్నారు. ఈ షో ఇప్పటికే మూడు సీజన్లను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకొని, సీజన్ 4లో అడుగుపెట్టింది.

'అన్ స్టాపబుల్' షో ఆహా ఓటీటీ వ్యూయర్ షిప్ పెరగడానికి ఎంతగా ఉపయోగపడిందో, అంతకు మించి బాలకృష్ణకు ఉపయోగపడింది. ఇది ఆయనలోనే మరో కోణాన్ని ఆవిష్కరించింది. కొత్త బాలయ్యని పరిచయం చేసి, దెబ్బకు అందరి థింకింగ్ మార్చేసింది. దీంతో అప్పటి వరకూ బాలకృష్ణ చుట్టూ ఉన్న నెగెటివిటీ అంతా తుడిచిపెట్టుకు పోయింది. ఒకప్పుడు ఆయన్ను ట్రోల్ చేసిన వారితోనే 'జై బాలయ్య' అంటూ జై కొట్టించింది. ఈ షో తర్వాత బాలయ్యతో అల్లు ఫ్యామిలీకి స్నేహబంధం మరింత బలపడినట్లు కనిపిస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ జెనరేషన్ అల్లు కిడ్స్ తోనూ బాలకృష్ణతో మంచి అనుబంధం ఏర్పడుతున్నట్లు తెలుస్తోంది.