బాలయ్య షో చూసి బెట్టింగ్ కాసా.. 83 లక్షలు పోగొట్టుకున్నా : బాధితుడు
తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రోజురోజుకూ తీవ్ర దుమారం రేపుతోంది.
By: Tupaki Desk | 21 March 2025 7:04 PM ISTతెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ వ్యవహారం రోజురోజుకూ తీవ్ర దుమారం రేపుతోంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్ నటీనటులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లపై పోలీసులు కేసులు నమోదు చేసి విచారణ జరుపుతుండగా, తాజాగా ఈ వ్యవహారంలో బాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ పేరు తెరపైకి రావడం టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఓ ఓటీటీ షోలో బెట్టింగ్ యాప్‌ను చూసి తాను బెట్టింగ్ కాసి మోసపోయినట్లు ఒక బాధితుడు మీడియా ముందుకు రావడం సంచలనమైంది.
తాజాగా నెల్లూరుకు చెందిన శ్రీరాంబాబు అనే బాధితుడు మీడియా ముందుకు వచ్చి 'ఓటీటీ' షో చూసి బెట్టింగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని రూ.80 లక్షలు నష్టపోయానని వాపోయాడు. శ్రీరాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. ‘ఆ ఓటీటీలో ప్రసారమవుతున్న షోలో ఒక బెట్టింగ్ యాప్‌ను చూడటం ద్వారా దాని గురించి తెలుసుకున్నాను. అనంతరం ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని బెట్టింగ్ ఆడటం మొదలుపెట్టాడు. మొదట్లో రూ.10 వేలు పెట్టగా రూ.18 వేలు రావడంతో ఉత్సాహంగా ఆడానని, అలా రూ.3 లక్షల వరకు సంపాదించానని చెప్పాడు. అయితే ఆ తర్వాత డబ్బులు పోవడం మొదలయ్యాయని, ఊర్లో, బంధువుల వద్ద అప్పులు చేసి మొత్తం రూ.83 లక్షలు నష్టపోయానని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుల బాధ తట్టుకోలేక ఊరు వదిలి పారిపోయి వచ్చినట్లు కూడా శ్రీరాంబాబు తెలిపాడు.
కనీసం 50 మందికి తాను డబ్బులు ఇవ్వాలని.. బెట్టింగ్ కు బానిస అయ్యి డబ్బులు కోల్పోయానని బాధితుడు శ్రీరాంబాబు వాపోయాడు. అంతకుముందు తనకు ఊళ్లో మంచి పరపతి ఉండేదని.. ఆ దృష్టి తోనే తాను అడగగానే డబ్బులు ఊళ్లో వాళ్లు ఇచ్చారని తెలిపాడు. ఇప్పుడు మోసపోయి తప్పించుకు తిరుగుతున్నట్టు పేర్కొన్నాడు. నష్టపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని తెలిపాడు. దీనిపై ఫిర్యాదు చేసేందుకే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు వచ్చినట్టు వివరించాడు.
ఈ బెట్టింగ్ యాప్స్ ఉదంతం టాలీవుడ్‌లో పెద్ద కుదుపునే కలిగిస్తోంది. మొదట యూట్యూబర్లతో ప్రారంభమైన ఈ కేసుల పరంపర ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోల వరకు చేరింది. ఇప్పటికే విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్ వంటి ప్రముఖులతో పాటు దాదాపు 25 మంది యూట్యూబర్లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఓ వ్యక్తి ఏకంగా ప్రముఖ హీరో బాలయ్య షోపై ఆరోపణలు చేయడం సంచలనమైంది.
తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్ కేసుల్లో న్యాయపరమైన సలహా తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్లు సమాచారం. సైబర్ సెక్యూరిటీ బ్యూరో డీజీ షికాగోయల్ ఒక మీడియా సంస్థకు తెలియజేస్తూ తెలంగాణలో బెట్టింగ్ యాప్‌లపై 2017 నుండి నిషేధం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 800 కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. అంతేకాకుండా బెట్టింగ్ యాప్‌ల కారణంగా మరణించిన వ్యక్తుల వివరాలపై కూడా పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలిపారు.