'డాకు మహారాజ్' - ఓ పనైపోయింది!
నందమూరి బాలకృష్ణ మరోసారి తన మాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులని మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు.
By: Tupaki Desk | 4 Dec 2024 10:05 AM GMTనందమూరి బాలకృష్ణ మరోసారి తన మాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులని మెప్పించేందుకు సిద్ధమవుతున్నారు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆయన లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’ షూటింగ్ గత కొన్నిరోజులుగా శరవేగంతో కొనసాగుతోంది. అయితే అనుకున్న సమయానికి వర్క్ ఫినిష్ చేస్తారా లేదా అని అనుమానాలు కలుగుతున్న టైమ్ లో ఫైనల్ గా టీమ్ పని పూర్తి చేసింది.
మొత్తానికి డాకు మహరాజ్ షూటింగ్ పూర్తయింది. బాబీ కొల్లి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న భారీ స్థాయిలో విడుదల కానుంది. ‘డాకు మహారాజ్’ సినిమా మొదట అనౌన్స్ చేసినప్పటినుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. టైటిల్ టీజర్‌తో ఆ అంచనాలు మరో స్థాయికి చేరాయి. బాలకృష్ణ కొత్త లుక్, యాక్షన్ సీక్వెన్సెస్ ప్రేక్షకులని కట్టిపడేశాయి.
ప్రతీ ఫ్రేమ్ లోనూ గ్రాండ్ విజువల్స్ కనిపించి, ఈ సినిమా థియేటర్లలో ఓ మర్చిపోలేని అనుభవాన్ని అందిస్తుందనే నమ్మకాన్ని అందించింది. బాబీ కొల్లి బాలకృష్ణను కొత్త కోణంలో చూపించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఇప్పటివరకు బాలకృష్ణ నటించిన చిత్రాల్లో ఇది అత్యధిక బడ్జెట్‌తో రూపొందించబడిన సినిమా. తమన్ అందించిన సంగీతం, విజయ్ కార్తీక్ కన్నన్ ఛాయాగ్రహణం సినిమాకు అదనపు ఆకర్షణగా నిలుస్తాయని తెలుస్తోంది.
బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలో నటించారు. సినీ పరిశ్రమలో అత్యుత్తమ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేయడంతో, ‘డాకు మహారాజ్’కు ఉన్న హైప్ మరింత పెరిగింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై రూపొందించిన ఈ సినిమా పక్కా మాస్ బొమ్మా అనేలా కామెంట్స్ వినిపిస్తున్నాయి. సంక్రాంతి విడుదల నేపథ్యంలో భారీ ఓపెనింగ్స్ అందుకుంటుందని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు.
ఇక చిత్ర బృందం విడుదల తేదీ విషయంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు అని మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. జెట్ స్పీడ్ లోనే షూటింగ్ పనులు ముగిశాయి. ఇక షూటింగ్ చివరి నిమిషాల్లో బాలకృష్ణ, బాబీ ఉన్న స్టిల్‌ను విడుదల చేశారు. ఆ లుక్ లో బాలయ్య పవర్ఫుల్ గా కనిపిస్తున్నారు. ‘డాకు మహారాజ్’ పాత్రకు ఆయన పర్ఫెక్ట్ అని నెటిజన్లు కూడా కామెంట్ చేస్తున్నారు. పోస్టర్ తోనే మంచి వైబ్ క్రియేట్ చేస్తున్న బాలయ్య వెండితెరపై ఇంకా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో అని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు.