Begin typing your search above and press return to search.

బాలయ్య సినీ స్వర్ణోత్సవం... ఈ విశేషాలు మీకు తెలుసా..?

నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి.

By:  Tupaki Desk   |   30 Aug 2024 8:29 AM GMT
బాలయ్య సినీ స్వర్ణోత్సవం... ఈ విశేషాలు మీకు తెలుసా..?
X

నందమూరి బాలకృష్ణ నట ప్రస్థానానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1974 ఆగష్టు 30న తాతమ్మ కల సినిమాతో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ దాదాపు దశాబ్ద కాలంగా సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వచ్చారు. హీరోగా బాలకృష్ణ తొలి సినిమా సాహసమే జీవితం. 1984 లో ఆ సినిమా వచ్చింది. అప్పటి నుంచి ఆయన లీడ్ రోల్ సినిమాలతో ఫ్యాన్స్ ని తెలుగు ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.

బాలకృష్ణ నటించిన తాతమ్మ కల సినిమాను ఎన్టీఆర్ డైరెక్ట్ చేశారు. తండ్రి దర్శకత్వంలో తెరంగేట్రం చేశారు బాలయ్య. ఆ మహానటుడి ఆశీస్సులతో వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు కాబట్టే తిరుగులేని క్రేజ్ తో నందమూరి నట వారసత్వాన్ని కొనసాగించారు బాలకృష్ణ. ఈ తరం నటులలో నవరసాలను పండించగలిగే హీరో ఎవరంటే అందరు చెప్పే పేరు బాలకృష్ణ. ఎలాంటి పాత్ర చేసినా ఎలాంటి కథ ఎంచుకున్నా పాత్రకు నిండుతనం తెస్తారు బాలకృష్ణ. పౌరాణికం, సాంఘికం, జానపదం, బయోపిక్, సైన్స్ ఫిక్షన్ ఇలా అన్ని జానర్లను ఆయన టచ్ చేశారు.

బాలకృష్ణ మొదటి సినిమా తాతమ్మ కల కాగా.. హీరోగా నటించిన సినిమా సాహసమే జీవితం. 25వ చిత్రంగా నిప్పులాంటి మనిషి చేశారు. 50వ సినిమాగా నారీ నారీ నడుమ మురారి సినిమా వచ్చింది. బాలకృష్ణ 75వ సినిమా కృష్ణ బాబు చేశారు. 100వ సినిమాగా గౌతమి పుత్ర శాతకర్ణి తో అలరించారు.

ఇప్పుడంటే ఇయర్ లో ఒకటి రెండు సినిమాలు చేస్తున్నారు కానీ బాలయ్య 1987 లో ఏకంగా 8 సినిమాలు రిలీజ్ చేశారు. ఆ సినిమాలన్నీ కూడా సక్సెస్ అందుకున్నాయి. ప్రతి నటుడికి కొన్ని డ్రీం రోల్స్ ఉంటాయి.. అలానే బాలకృష్ణకు కూడా చంఘీజ్ ఖాన్ సినిమా చేయాలని బాగా ఉంది. అంతేకాదు గోన గన్నా రెడ్డి, రామానుజాచార్య పాత్రల్లో కూడా నటించాలని అనుకున్నారు. ఐతే వాటిలో ఏది ఇప్పటివరకు చేయలేదు. తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా కోసం బాలకృష్ణ అటు నటుడిగా నిర్మాతగా తన మార్క్ చూపించారు. ఇలా తండ్రి బయోపిక్ లో నటించి నిర్మించిన యాక్టర్ గా బాలకృష్ణ రికార్డు సృష్టించారు.

బాలకృష్ణ సీనియర్ డైరెక్టర్ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో అత్యధికంగా 13 సినిమాలు చేశారు. అంతేకాదు ఎక్కువ సినిమాల్లో డ్యుయల్ రోల్ చేసిన హీరో కూడా బాలకృష్ణ అనే చెబుతారు. దాదాపు 17 సినిమాల్లో బాలయ్య డ్యుయల్ రోల్ లో నటించారు. ఐతే కెరీర్ లో ఫస్ట్ టైం అధినాయకుడు సినిమాలో ట్రిపుల్ రోల్ కూడా చేశారు బాలకృష్ణ.

బాలకృష్ణ సినిమా అంటే డ్యుయల్ రోల్, ఫ్లాష్ బ్యాక్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంటాయి. బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ చేసే ప్రతి సినిమాలో ఈ ఫార్ములా అప్లై చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు. నర్తనశాల సినిమాను డైరెక్ట్ చేయాలని బాలయ్య అనుకున్నారు. ఒకసారి దానికోసం అంతా సెట్ చేసుకున్నా కూడా ఎందుకో వర్క్ అవుట్ అవ్వలేదు. బాలకృష్ణ నటించిన పైసా వసూల్ సినిమా కోసం మామ ఏక్ పెగ్ లా పాట పాడారు. ఆ పాట నందమూరి ఫ్యాన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది.

ఇన్నాళ్లు సిల్వర్ స్క్రీన్ మీద అలరించిన బాలయ్య బాబు ఈమధ్యనే డిజిటల్ ఫ్లాట్ ఫాం మీదకు వచ్చారు. ఆహా ఓటీటీలో అన్ స్టాపబుల్ షో హోస్ట్ గా బాలయ్య అదరగొట్టారు. ఓటీటీ స్పెషల్ చిట్ చాట్ లో అన్ స్టాపబుల్ సెపరేట్ రికార్డ్ క్రియేట్ చేసి బాలయ్య స్టామినా ఏంటో చూపించింది.

బాలకృష్ణ నటించిన నరసింహ నాయుడు, సింహా, లెజెండ్ సినిమాలకు నంది అవార్డులు వచ్చాయి. లెజెండ్ సినిమాకు సైమా అవార్డ్ కూడా అందుకున్నారు బాలయ్య. ఇక కెరీర్ లో ఆరు ఫిల్మ్ ఫేర్ అవార్డులను అందుకున్నారు బాలకృష్ణ. బాలకృష్ణ ఆదిత్య 369 కు సీక్వెల్ గా ఆదిత్య 999 కథ సిద్ధం చేశారు. త్వరలోనే ఆ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.

50 ఏళ్ల సినీ ప్రస్థానంలో తెలుగు ప్రేక్షకులకు ఎన్నో అద్భుతమైన సినిమాలు.. మరపురాని అనుభూతులు అందించారు బాలకృష్ణ. ఈ సినీ స్వర్ణోత్సవం సందర్భంగా టాలీవుడ్ ఆయన్ను ఘనంగా సత్కరించబోతుంది. హైదరాబాద్ లో సెప్టెంబర్ 1న భారీ స్థాయిలో ఈవెంట్ ప్లాన్ చేశారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీస్ అంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలుస్తుంది.