Begin typing your search above and press return to search.

తెలంగాణలో బాలకృష్ణ సినీ స్టూడియో?

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ స్టూడియో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు.

By:  Tupaki Desk   |   26 Oct 2024 10:58 AM GMT
తెలంగాణలో బాలకృష్ణ సినీ స్టూడియో?
X

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ స్టూడియో వ్యాపారంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఆయన ఎప్పటి నుంచో ఓ సినీ స్టూడియో నిర్మించాలని అనుకుంటున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఫిలిం స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీకి చెందిన టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యకు రేవంత్ రెడ్డి సర్కార్ బంఫర్ ఆఫర్ ఇచ్చిందని.. సినిమా స్టూడియో నిర్మించుకోడానికి ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని అంటున్నారు.

బాలయ్య సినీ స్టూడియో భూ కేటాయింపుల ప్రతిపాదనలకు రెవెన్యూ శాఖ ఆమోదముద్ర వేసి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి పంపినట్లు సమాచారం. ఈరోజు జరిగే కేబినెట్ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో బాలకృష్ణ సినీ స్టూడియోకు భూమి కేటాయించే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేబినెట్ భేటీ తర్వాత ఈ విషయం మీద క్లారిటీ రావొచ్చు.

సినీ స్టూడియో నిర్మించాల‌ని బాలకృష్ణ చాలాకాలంగా క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో స్టూడియో క‌ట్టుకోవ‌డానికి బాలయ్యకు 500 ఎకరాల స్థ‌లం కూడా కేటాయించార‌ని వార్తలు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత వైజాగ్ లో స్టూడియోలు నిర్మించుకోడానికి స్థలాలు ఇస్తామని అప్పటి సీఎం జగన్ ప్రకటించినప్పటికీ.. బాలయ్య స్టూడియో ప్ర‌తిపాద‌న‌ల గురించి ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. కానీ ఇప్పుడు అనూహ్యంగా తెలంగాణ‌లో స్టూడియో క‌ట్టుకోవ‌డానికి ప్ర‌భుత్వం సస్థలం కేటాయిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

వాస్తవానికి ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలో ఉంది. బాలకృష్ణ హిందూపూర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. దీనికి తోడు సినీ ఇండస్ట్రీ విజయవాడకు తరలి రావాలని సినిమాటిగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య కోరుకుంటే, ఏపీలోనే ఆయనకు స్టూడియోకి స్థ‌లం దొరుకుతుంది. కానీ ఎందుకనో సీనియర్ నటుడు ఆంధ్రాలో కాకుండా, తెలంగాణాలో స్టూడియో కట్టాలని నిర్ణయించుకున్నారని అంటున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

హైదరాబాద్ లో ఇప్పటికే రామోజీ ఫిలింసిటీ, అన్నపూర్ణ స్టూడియో, రామకృష్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, సారధి స్టూడియో లాంటి స్టూడియోలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం అల్లు రామలింగయ్య పేరు మీద నగర శివార్లలో 'అల్లు స్టూడియో'ని నిర్మించారు. 1974లో స్టూడియో నిర్మాణం కోసం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావుకు భూములు ఇచ్చింది. 1976లో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రారంభించబడింది. ఆ తర్వాత ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సమీపంలో రామకృష్ణ సినీ స్టూడియోని నిర్మించారు నందమూరి తారక రామారావు. 'దాన వీర శూర కర్ణ' షూటింగ్‌తో ఎంజీఆర్ చేతుల మీదుగా ఈ స్టూడియో ప్రారంభమైంది.

రామకృష్ణ హార్టికల్చరల్ సినీ స్టూడియో పేరుతో నాచారంలో పెద్ద స్టూడియో నిర్మించారు ఎన్టీఆర్. అక్కడ పౌరాణిక చిత్రాల షూటింగ్‌కు అనువైన సెట్‌లు ఉన్నాయి. అయితే ఈ రెండు స్టూడియోలలో ఎన్టీఆర్, బాలకృష్ణ సినిమా షూటింగ్‌లు మాత్రమే ఎక్కువగా జరిగేవి. 2000 సంవత్సరం తర్వాత ఈ స్టూడియోలలో సినిమా షూటింగ్‌లు జరగడం లేదు. ఇప్పుడు బాలకృష్ణ స్టూడియో నిర్మించే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి ఛైర్మన్‌గా ఉన్న బాలయ్య.. భవిష్యత్ లో వరల్డ్ క్లాస్ స్టూడియో కడతారేమో చూడాలి.