Begin typing your search above and press return to search.

బాలయ్య పద్మ భూషణుడు అవుతాడా ?

నందమూరి బాలకృష్ణ ఎవరూ సాధించలేని ఫీట్ ని సాధించారు.

By:  Tupaki Desk   |   31 Aug 2024 3:43 AM GMT
బాలయ్య పద్మ భూషణుడు అవుతాడా ?
X

నందమూరి బాలకృష్ణ ఎవరూ సాధించలేని ఫీట్ ని సాధించారు. ఆయన తన సినీ జీవితాన్ని ఒక అర్ధ శతాబ్దం పాటు వెండి తెర మీద చాలా అందంగా పండించుకున్నారు. ఆది కూడా రాజ మార్గాన. అంటే హీరోగానే. ఇంకా హీరోగానే కొనసాగుతూ స్వర్ణోత్సవ సంబరాలకు సిద్ధం అవుతున్నారు.

ఆయనకు బాలకృష్ణుడు అన్న పేరు ఎందుకు పెట్టారో కానీ ఆయన ఎప్పటికీ బాలక్రిష్ణుడే. ఆయన వయసు అలాగే ఆగిపోయింది. ఆయన మనసు అలాగే ఉంది. ఆయనలోని హీరో పాతికేళ్ల దగ్గరే ఉన్నారు. ఇక టాలీవుడ్ మాత్రమే కాదు బాలీవుడ్ లో సైతం ఎవరూ ఇలా హీరోగా యాభై ఏళ్ళు పూర్తి చేసుకున్న దాఖలాలు లేవు.

అలా భారతీయ సినీ పరిశ్రమలో చూస్తే ఏకైక హీరో బాలయ్య అని చెప్పాలి. ఆయన తండ్రి చాటు బిడ్డగా సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ అంటే నటనలో మేరు నగధీరుడు. ఎవరెస్ట్ శిఖర సమానుడు. ఆయన వారసుడు బాలయ్య అన్న ట్యాగ్ మోయడమే ఎంతో కష్టం. ఆ అంచనాల నడుమ బాలయ్య సోలో హీరోగా 1984లో ఎంట్రీ ఇచ్చారు.

ఆయన సోలో హీరోగా చేసిన మొదటి మూడు సినిమాలు పెద్దగా జనాలను ఆకట్టుకోలేదు. దాంతో ఎన్టీఆర్ వారసుడుగా బాలయ్య తగడు అన్న నెగిటివ్ కామెంట్స్ వినిపించాయి. మరో వైపు చూస్తే బాలయ్యకు సరైన తీరున

గైడ్ చేసే వారు లేరు. తండ్రి రాజకీయ రంగంలో ఉండడం సీఎం కావడంతో రాజకీయంగా ఆయనను విభేదించేవారు సైతం బాలయ్య సినిమాలను వ్యతిరేకించేవారు. అలా బాలయ్యకు ఏ పాపం అంటకుండానే సినీ రంగంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

అది కూడా మొదట్లోనే. ఒక వైపు చిరంజీవి సుప్రీం హీరోగా ఎదుగురూ సత్తా చాటుతున్న సందర్భం. మరో వైపు సుమన్ అర్జున్ లాంటి హీరోలు మార్షల్ ఆర్ట్స్ తో రియల్ హీరోయిజాన్ని చూపిస్తున్న టైం. దాంతో బాలయ్య సినీ గమనం ఆరంభంలో ఏమీ అనుకున్నట్లుగా సాగలేదు. చాలా మంది స్టార్ కిడ్స్ ని భారీ కాంబోని సెట్ చేసి మరీ అన్ని వాణిజ్య విలువలూ చూసుకుంటూ అన్ని లెక్కలూ పక్కాగా వేసుకుంటూ రిలీజ్ చేసిన తీరు బాలయ్యది కాదు.

ఆయన కష్టం ఆయనదే. తొలి నాళ్లలో ఆయనకు ఉన్న అనుభవంతోనే అలా నిలదొక్కుతున్నారు. మంగమ్మగారి మనవడు మూవీతో బాలయ్య స్టార్ డం స్టార్ట్ అయింది. ఆ తరువాత ఆయన వెనక్కి చూసుకోలేదు. సినిమాలు ఫ్లాప్ అయినా బాలయ్య మాత్రం హీరోగా ఎపుడూ సక్సెస్ అవుతూ వచ్చారు.

ఇక బాలయ్యలో ఉన్న మరో గుణం ఆయన నిర్మాతల హీరో. వారి కష్టాలతో ఆయన పాలు పంచుకుని తగిన విధంగా సపోర్ట్ చేసేవారు. దాంతో పాటు డైరెక్టర్స్ హీరో కూడా. ఒకసారి స్క్రిప్ట్ వింటే ఇక వేలూ కాలూ పెట్టే రకం కాదు. ఇవన్నీ బాలయ్యను సినీ పరిశ్రమలో మరింతగా రాణించేలా చేశాయి.

బాలయ్యకు ఎస్ అనడమే వచ్చు అంటారు. ఆయన వద్దకు ఎలాంటి పాత్రని తెచ్చినా చేద్దామనే చెబుతారు. అందుకే ఆయన ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేశారు. ఆయన ఆహార్యం కూడా దానికి సరిపోయింది. ఇపుడు ఉన్న హీరోలలో అన్ని జానర్లలో కూడా నటించి మెప్పించిన సత్తా కలిగిన హీరో గా బాలయ్యకే పేరు ఉంది.

ఎన్నో వైవిధ్యమైన పాత్రలలో నటించిన బాలయ్య సేవా రంగంలోనూ పాతికేళ్ళుగా బసవతారకం ఆసుపత్రి చైర్మన్ గా కొనసాగుతున్నారు. ఇక రాజకీయ రంగంలోనూ హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నారు మరి అన్ని రంగాలలో రాణిస్తున్న బాలయ్య అరుదైన ఫీట్ గా సినీ నటనా స్వర్ణోత్సవాలు జరుపుకుంటున్న వేళ ఆయన అభిమానులకు కలిగే ఒకే ఒక్క సందేహం. సినీ పరిశ్రమకు తెలుగు వారికి తనదైన తీరులో సేవ చేస్తున్న బాలయ్య పద్మ పురస్కారానికి అర్హుడు కారా అని.

ఈసారి అయినా ఆయనకు పద్మ భూషణ్ వంటి పౌర పురస్కారం కేంద్రం ప్రకటిస్తుందేమో అని ఆశగా చూస్తున్నారు. మరో నాలుగు నెలలలో గణతంత్ర వేడుకలు జరగనున్నాయి. దానికి ముందు రోజున పద్మ అవార్డీలను ప్రకటిస్తారు. ఈసారి సినీ లెజెండ్ బాలయ్య పేరు కచ్చితంగా ఉంటుందని అంతా భావిస్తున్నారు. నందమూరి ఫ్యామిలీకి పద్మా పురస్కారాలలో అన్యాయం జరిగింది అన్న నింద లేకుండా ఉండాలంటే ఈసారి బాలయ్య పద్మ భూషణుడు కావాల్సిందే అని అంటున్నారు.