Begin typing your search above and press return to search.

మా మధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ మాత్ర‌మే ఉంటుంది: NBK

ప‌రిశ్ర‌మ‌లో 50 వసంతాలు పూర్తి చేసుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తెలుగు చిత్ర‌సీమ‌ ఘ‌న‌మైన స‌న్మానం చేసుకుంది.

By:  Tupaki Desk   |   2 Sep 2024 5:43 AM GMT
మా మధ్య ఆరోగ్య‌క‌ర‌మైన పోటీ మాత్ర‌మే ఉంటుంది: NBK
X

ప‌రిశ్ర‌మ‌లో 50 వసంతాలు పూర్తి చేసుకున్న నంద‌మూరి బాల‌కృష్ణ‌కు తెలుగు చిత్ర‌సీమ‌ ఘ‌న‌మైన స‌న్మానం చేసుకుంది. హైద‌రాబాద్ నోవాటెల్ లో జ‌రిగిన ఈ భారీ కార్య‌క్ర‌మానికి మెగాస్టార్ చిరంజీవి, విక్ట‌రీ వెంక‌టేష్‌, హీరో శ్రీ‌కాంత్, మంచు విష్ణు, మ‌నోజ్, క‌న్న‌డ శివ‌రాజ్ కుమార్, ఉపేంద్ర, అల్ల‌రి న‌రేష్, అడివి శేష్ స‌హా ఎంద‌రో సినీప్ర‌ముఖులు ఎటెండ‌య్యారు. ఇండ‌స్ట్రీ దిగ్గ‌జ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు, క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులు ఇలా అన్ని వ‌ర్గాలు వేడుక‌కు అటెండ‌య్యాయి.

ఈ వేదిక‌పై మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. బాల‌య్య‌బాబుతో క‌లిసి ఒక సినిమా చేయాల‌నుంద‌ని వ్యాఖ్యానించ‌డం అభిమానుల్లో చర్చ‌గా మారింది. న‌ట‌సింహం నందమూరి బాలకృష్ణ వేదిక‌పై ఎంతో ఎమోష‌న‌ల్ గా మాట్లాడారు. ఆయ‌న మాట్లాడుతూ...``ఈ రోజు ఇంతమంది అభిమానులు, నా తోటి నటీనటులు, నాతో పని చేసిన ప్రతి ఒక్కరికీ హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు జన్మను ఇచ్చిన తల్లి తండ్రులకు, నాకు ఇంతటి అభిమానాన్ని ఇచ్చిన మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకుంటాను. అలాగే నా కుటుంబం అయిన నిర్మాతలు, దర్శకులు, నటులు, కళాకారులు, సాంకేతిక బృందం, నా హాస్పిటల్ బృందం, హిందూపూర్ ప్రజలు, నా అభిమానులు అంద‌రూ కలిసి ఈ వేడుకను ఇంత గొప్ప విజయం సాధించేలా చేసినందుకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దీనికి వెనుక ఉంది నడిపించిన మా అసోసియేషన్, నిర్మాతల మండలి, ఛాంబర్ వ‌ర్గాలు తదితరులకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను నా తండ్రి నుండి నేర్చుకున్నది నటన మాత్రమే కాదు. క్రమశిక్షణ, సమయానుకూలంగా, సంస్కారం. అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారి నుండి అంతే నేర్చుకున్నాను. మేము అందరం చలన చిత్ర పరిశ్రమలో పోటీగా నటిస్తూ ఉన్నప్పటికీ ఒక ఆరోగ్యక‌రమైన పోటీ మాత్రమే ఉంటుంది`` అని అన్నారు.

నా స‌హ‌చ‌రులంతా చెప్పినట్లు నేను సినీ, రాజకీయ, వైద్య సేవ రంగాలలో ఉంటూ ఇలా ఉన్నాను అంటే దానికి కారణం అయిన ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాన‌ని బాల‌య్య బాబు అన్నారు. త‌న స‌తీమ‌ణి వసుంధరకు ధన్యవాదాలు తెలిపారు. ఆస‌క్తిక‌రంగా ప‌రిశ్ర‌మ మూల‌స్థంబాలు అయిన మెగాస్టార్ చిరంజీవి, నట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్ ఒకే ఫ్రేమ్ లో క‌నిపించారు. అయితే ఈ ఫ్రేమ్ లో నాలుగో మూల‌స్థంభం అయిన‌ కింగ్ నాగార్జున మిస్స‌వ్వ‌డం అభిమానుల‌కు లోటుగా అనిపించింది. బాల‌య్య త‌న స్పీచ్‌లో ప్ర‌త్యేకంగా లెజెండరీ అక్కినేని నాగేశ్వ‌ర‌రావుపై అభిమానం చాటుకోవ‌డం అభిమానుల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.