Begin typing your search above and press return to search.

యాభయ్యేళ్ళ బాలయ్య సినీ ప్రస్థానం లో ఎన్నో విశేషాలు

ఎన్టీఆర్ కుమారుడిగా 14 ఏళ్ల వయసులో తాతమ్మ కల చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేశారు నందమూరి బాలకృష్ణ.

By:  Tupaki Desk   |   1 Sep 2024 7:26 AM GMT
యాభయ్యేళ్ళ బాలయ్య సినీ ప్రస్థానం లో ఎన్నో విశేషాలు
X

ఎన్టీఆర్ కుమారుడిగా 14 ఏళ్ల వయసులో తాతమ్మ కల చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేశారు నందమూరి బాలకృష్ణ. అప్పటికి ఆయన తొమ్మిదవ తరగతి చదువుతున్నారు. ఎన్టీయార్ తన నటవారసుడిగా హరిక్రిష్ణను కొన్ని సినిమాలలో అనాటికే నటింపచేసి ఉన్నారు. బాలయ్యలో ఆసక్తిని గమనించి ఒక చాన్స్ ఇచ్చారు.

అయితే ఈ సినిమాలో బాలయ్యదే అత్యంతా కీలక పాత్ర. ఆయన పాత్రతోనే సినిమా నడుస్తుంది. భానుమతి ఎన్టీఆర్ సహా ఎంతో మంది ఉద్ధండులతో బాలయ్య తొలి సినిమాలో నటించారు. ఆయన బాల నటుడిగా రంగ ప్రవేశం చేసినా ఆయనకు ఎపుడూ లేడీ వాయిస్ తో పాటలు పాడించలేదు. తొలి సినిమాలోనే మాధవపెద్ది రమేష్ పాడారు. తాతమ్మ కలలో బాలయ్యకు రెండు పాటలు ఉంటాయి. ఆయన బాగానే తొలి సినిమాలో తన నటనను చూపించారు.

ఇక బాలయ్య సినీ కెరీర్ అలా మొదలై 1975లో రాం రహీం అనే సినిమాలో నటించారు. అందులో అన్న హరిక్రిష్ణతో కలసి నటించారు. అలా ఇద్దరు క్రిష్ణులను కలిపి తీసిన ఈ సినిమా బాగానే ఆడింది. అదే ఏడాది

అన్నదమ్ముల అనుబంధం మూవీ వచ్చింది. అప్పటికి బాలయ్యకు 15 ఏళ్ళు. ఆ మూవీలో బాలయ్యకు నాటికే ప్రముఖ గాయకుడిగా పేరు ఉన్న ఎస్పీబీ పాటలు పాడారు. హీరోయిన్ గా జయమాలిని ఈ సినిమాలో జోడీ కట్టింది.

ఇక 1976లో వేములవాడ భీమకవి మూవీలో బాలయ్య టైటిల్ రోల్ ప్లే చేశారు. ఇందులో పాటలు పద్యాలు అన్నీ కూడా మాధవపెద్ది రమేష్ పాడారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ రాజుగా కనిపిస్తారు. సత్యనారాయణ ఇతర పాత్రధారులు ఎంతో మంది ఉన్నా బాలయ్య హీరోగా వచ్చిన తొలి మూవీ ఇదే అని చెప్పాలి. అదే విధంగా 1977లో దానవీర శూర కర్ణ మూవీ వచ్చింది. ఇందులో బాలయ్య అభిమన్యుడిగా అదరగొట్టారు. హీరోయిన్ గా దీప నటించారు. ఆయనకు ఒక డ్యూయెట్ కూడా పెట్టారు. ఈ సినిమాలో బాలయ్య మంచి నట ప్రదర్శన చేశారు.

ఇక అదే జోరులో బాలయ్య ఫుల్ లెంగ్త్ రోల్ లో 1978లో వచ్చిన అక్బర్ సలీం అనార్కలి మూవీ కూడా మంచి పాటలతో అలరిస్తుంది. ఈ మూవీలో స్పెషాలిటీ ఏంటి అంటే బాలయ్యకు బాలీవుడ్ లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ మొత్తం పాటలు పాడడం. ఇది టాలీవుడ్ లో ఎన్టీఆర్ కి బాలయ్యకు తప్ప మరే హీరోకి దక్కని అరుదైన గౌరవం.

అలాగే 1979లో బాలయ్య శ్రీ తిరుపతి వెంకటేస్వర మహత్యం అనే సినిమాలో నారదుడిగా నటించి మెప్పించారు. అదే ఏడాది శ్రీ మధ్విరాటపర్వంలో మరోసారి అభిమన్యుడి పాత్రలో కనిపించారు. 1980 నాటికి తండ్రితో కలసి రౌడీ రాముడు కొంటె క్రిష్ణుడు మూవీతో బాలయ్య ఇరవయ్యేళ్ల వయసులో టీనేజ్ హీరో గా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ తో కలసి ఎలాంటి జంకూ లేకుండా నటించి మెప్పించారు.

అదే విధంగా 1981లో అనురాగదేవతలో ముఖ్య పాత్ర పోషించిన బాలయ్య 1982లో సింహం నవ్విందిలో హీరోగా నటించారు. ఎన్టీయార్ కీలక పాత్రలో కనిపించారు. ఇలా ఎన్టీఆర్ తో కలసి 11 సినిమాల్లో నటించడం ద్వారా బాలయ్య ఒక ప్రపంచ రికార్డు క్రియేట్ చేశారు. ఏ తండ్రీ కొడుకూ ఇన్ని సినిమాల్లో కలసి నటించలేదు.

ఇక బాలయ్యకు ఎస్పీబీ, మహమ్మద్ రఫీతో మాధవపెద్ది రమేష్ తో పాటు వి రామకృష్ణ కేజే ఏసుదాసు, మనో వంటి ఎంతో మంది గాయకులు ప్లే బ్యాక్ పాడారు. బాలయ్యకు పైసా వసూల్ మూవీలో ఏకంగా ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ ఒక పాట పాడడం విశేషం. బాలయ్య కూడా ఇదే సినిమాలో తన గొంతు విప్పి తన పాత్రకు పాడుకున్నారు

అలాగే అలనాటి ఎస్ రాజేశ్వరరావు నుంచి మొదలుపెడితే పెండ్యాల నాగేశ్వరరావు, బాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ సి రామచంద్ర, కేవీ మహదేవన్ వంటి ఉద్ధండులు అందరూ బాలయ్య సినిమాలకు సంగీతం అందించారు. అలాగే తరువాత కాలంలో చక్రవర్తి, కోటీ, మణిశర్మ, చక్రి, కీరవాణి, దేవీశ్రీ ప్రసాద్, తమన్ ఇలా ప్రతీ మ్యూజిక్ డైరెక్టర్ బాలయ్య బాడీ లాంగ్వేజ్ ని పట్టుకుని అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఇక బాలయ్యతో ఎంతో మంది హీరోయిన్లు నటించారు. బాలయ్య ఆనాటి తరంలో రేలంగి నుంచి ఈనాటి తరంలో ఉన్న నటుల దాకా ఎంతో మందితో వెండి తెరను పంచుకున్నారు. నిజంగా ఒక నటుడి యాభై ఏళ్ళ ప్రస్తానం అంటే తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక భాగం అందులో ఉందని అర్ధం అవుతుంది.