బ్రాహ్మణికి మణిరత్నం ఆఫర్.. NBK ఏమన్నారంటే?
అయితే బాలకృష్ణ వారసురాలు బ్రాహ్మణిని కథానాయికను చేసేందుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రయత్నించారు అనే విషయం ఇంతకాలానికి బయటకు తెలిసింది.
By: Tupaki Desk | 4 Jan 2025 4:37 AM GMTచిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, రజనీకాంత్ వంటి అగ్ర కథానాయకులు దశాబ్ధాలుగా వినోదపరిశ్రమను శాసిస్తూనే ఉన్నారు. కానీ ఈ కుటుంబాల నుంచి కథానాయికలుగా ప్రయత్నించిన వారు ఎవరూ లేరు. మెగా కుటుంబం నుంచి నిహారిక మాత్రమే కథానాయికగా ట్రై చేసారు. అయితే రజనీకాంత్ కుమార్తెలు దర్శకులుగా, నిర్మాతలుగా కొనసాగుతున్నారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల నిర్మాత. అయితే నందమూరి బాలకృష్ణ కుమార్తెలు ఉన్నత విద్యావంతులుగా సంస్థానాలను నడిపించే స్థాయికి ఎదిగారు. సినీరంగంతో పరోక్షంగా మాత్రమే సంబంధాలను కొనసాగిస్తున్నారు. బాలయ్య పెద్ద కుమార్తె బ్రాహ్మణి `హెరిటేజ్` ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే బాలకృష్ణ వారసురాలు బ్రాహ్మణిని కథానాయికను చేసేందుకు ప్రముఖ దర్శకుడు మణిరత్నం ప్రయత్నించారు అనే విషయం ఇంతకాలానికి బయటకు తెలిసింది. అది కూడా ఆహా- ఓటీటీ టాక్ షో ద్వారా బయటి ప్రపంచానికి వెల్లడైంది. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే టాక్ షో హోస్ట్ గా ఉన్న బాలయ్య స్వయంగా ఈ విషయాన్ని రివీల్ చేసారు. సీజన్ 4 ఎనిమిదో ఎపిసోడ్‌లో దర్శకుడు బాబీ, మ్యూజిక్ కంపోజర్ థమన్, నిర్మాత నాగ వంశీ అతిథులుగా కనిపించారు. ఎపిసోడ్ సందర్భంగా.. బాలకృష్ణ తన పెద్ద కుమార్తె బ్రాహ్మణి సినీ అవకాశాల గురించి వెల్లడించారు. థమన్ అడిగిన ఓ ప్రశ్నకు బాలకృష్ణ స్పందిస్తూ.. తన కూతుళ్లిద్దరినీ ఎంతో శ్రద్ధగా, ఆప్యాయంగా పెంచానని బాలయ్య పేర్కొన్నాడు. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం ఒకప్పుడు బ్రాహ్మణికి తన సినిమాలో హీరోయిన్‌గా నటించమని ఆఫర్ చేశారని వెల్లడించారు.
ఈ ఆఫర్‌ని బ్రాహ్మణి దృష్టికి తీసుకెళ్లగా.. నటనపై ఆసక్తి లేకపోవడంతో చివరికి ఆఫర్‌ను తిరస్కరించారని అన్నారు. బాలకృష్ణ తన చిన్న కుమార్తె తేజస్విని అద్దం ముందు నటించేదని, ఆమె నటనలో వృత్తిని కొనసాగించగలదనే నమ్మకం కలిగిందని బాలకృష్ణ పేర్కొన్నారు. తేజస్విని ప్రస్తుతం టాక్ షో కోసం క్రియేటివ్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. కుమార్తెలు ఇద్దరూ తమ తమ రంగాల్లో రాణించడం మా కుటుంబానికి గర్వకారణం.. వాళ్లు నా కూతుళ్లని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకోవడం కంటే నాకు ఇంకేం కావాలి అని బాలయ్య ఆనందం వ్యక్తం చేసారు.