బాలయ్య సంక్రాంతి సినిమాలు.. ఎన్ని హిట్టు, ఎన్ని ఫట్టు?
గతేడాది సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన బాలయ్య.. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తాడని అభిమానులు భావిస్తున్నాయి.
By: Tupaki Desk | 25 Nov 2024 11:30 PM GMTనందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం "డాకు మహారాజ్". బాబీ కొల్లు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. జనవరి 12న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే డేట్ కూడా అనౌన్స్ చేశారు. గతేడాది సంక్రాంతికి 'వీర సింహా రెడ్డి' సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన బాలయ్య.. ఈసారి కూడా అదే రిపీట్ చేస్తాడని అభిమానులు భావిస్తున్నాయి.
గతంలో బాలకృష్ణ నటించిన చాలా సినిమాలు ఇదే సీజన్ లో రిలీజ్ అయ్యాయి. ఇప్పటి వరకూ ఆయన 108 సినిమాల్లో నటిస్తే, వాటిలో 22 చిత్రాలు సంక్రాంతి పండుగకే థియేటర్లలోకి వచ్చాయి. అందులో ఎక్కువ శాతం సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలే సాధించాయి. అందుకే బాలయ్యకు సంక్రాంతి హీరో అనే పేరు వచ్చింది. ఇప్పుడు తన 109వ సినిమాతో మరోసారి ఫెస్టివల్ బరిలో దిగుతుడం, నటసింహం ఈ మధ్య మంచి ఫామ్ లో ఉండటంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి.
బాలకృష్ణ కెరీర్ ప్రారంభంలో నటించిన 'వేములవాడ భీమకవి' (1975) సినిమా సంక్రాంతికి రిలీజైంది. ఆ తర్వాత 'దాన వీర శూర కర్ణ' (1977 ), 'అనురాగ దేవత' (1982) చిత్రాలు విడుదలయ్యాయి. కాకపోతే వీటిల్లో ఆయన తండ్రి ఎన్టీఆర్ మెయిన్ హీరో. బాలయ్య సోలో హీరోగా మారిన తర్వాత 'డిస్కో కింగ్' (1984) మూవీతో తొలిసారిగా పొంగల్ సీజన్ లో వచ్చారు. ఇదే క్రమంలో 'ఆత్మబలం', 'భార్గవ రాముడు', 'ఇన్స్పెక్టర్ ప్రతాప్', 'ప్రాణానికి ప్రాణం' సినిమాలు ఆడియన్స్ ముందుకు వచ్చాయి.
90వ దశకంలో బాలయ్య నటించిన 'వంశానికొక్కడు', 'పెద్దన్నయ్య' సినిమాలు సంక్రాంతికి వచ్చి హిట్టు కొట్టాయి. 'సమర సింహారెడ్డి' చిత్రం సూపర్ హిట్టైంది. ఆ తర్వాత 'నరసింహ నాయుడు' (2001) మూవీ బ్లాక్ బస్టర్ అవ్వగా.. 'వంశోద్ధారకుడు', 'సీమ సింహం' సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. 'లక్ష్మీ నరసింహ' (2004) హిట్ స్టేటస్ సాధించగా.. 'ఒక్క మగాడు' (2008), 'పరమవీర చక్ర' (2011) చిత్రాలు బిగ్గెస్ట్ డిజస్టర్లుగా మారాయి.
2016 నుంచి 2019 వరకూ బాలయ్య ప్రతీ ఏడాది సంక్రాంతికి ఒక సినిమా ఉండేలా చూసుకున్నారు. అయితే 'డిక్టేటర్' యావరేజ్ ఫలితాన్ని అందుకోగా.. 'గౌతమి పుత్ర శాతకర్ణి' సీజన్ ను క్యాష్ చేసుకుని హిట్ అనిపించుకుంది. 'జై సింహా' పరాజయం చెందగా.. 'ఎన్టీఆర్ కథానాయకుడు' మూవీ అల్ట్రా డిజాస్టర్ అయింది. ఇక చివరగా 2023 పొంగల్ కి వచ్చిన 'వీర సింహా రెడ్డి' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ క్రమంలో 2025 ఫెస్టివల్ సీజన్ లో 'డాకు మహారాజ్' మూవీ రిలీజ్ కాబోతోంది.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో 'డాకు మహారాజ్' సినిమా రూపొందుతోంది. ఇందులో బాలయ్య విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. బాబీ డియోల్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో.. శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతెలా, ప్రగ్యా జైస్వాల్ మహిళా పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సంక్రాంతికి 'గేమ్ చేంజర్', 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాలను తట్టుకొని బాలకృష్ణ మూవీ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.