నటసింహం@50 ఏళ్లు..వ్వాటే జర్నీ!
తాజాగా 2024 లో బాలయ్య సినీ ప్రస్థానం మొదలై 50 ఏళ్లు పూర్తవుతుంది. 1974-2024 వరకూ చూసుకుంటే బాలయ్య ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు.
By: Tupaki Desk | 20 Jun 2024 12:07 PM GMTతెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటసింహ బాలకృష్ణ సినీ ప్రస్థానం గురించి చెప్పాల్సిన పనిలేదు. 14 ఏళ్ల వయసులో నటుడిగా తెరంగేట్రం చేసారు. తండ్రి ఎన్టీరామారావుతో కలిసి ఎన్నో సినిమాలు చేసారు. 1974 లో 'తాతమ్మ కల'తో తొలిసారి ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఆ తర్వాత 'రామ్ రహీమ్' నుంచి 'సింహం నవ్వింది' వరకూ ఎన్నో సినిమాల్లో కీలక పాత్రల్లో మెప్పించారు.
అటుపై 1983లో' సాహసమే జీవితం'తో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అక్కడ నుంచి బాలయ్య జర్నీ ఎలా సాగిందో తెలిసిందే. తాజాగా 2024 లో బాలయ్య సినీ ప్రస్థానం మొదలై 50 ఏళ్లు పూర్తవుతుంది. 1974-2024 వరకూ చూసుకుంటే బాలయ్య ఎన్నో చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. ఇప్పటివరకూ 108 సినిమాలు చేసారు. ప్రస్తుతం 109వ చిత్రం ఆన్ సెట్స్ లో ఉంది. 110వ చిత్రం కూడా బోయపాటి శ్రీను తో లాక్ చేసారు.
హీరోగా బాలయ్య కెరీర్ ప్రారంభమైన తర్వాత అన్ని రకాల పాత్రలతోనూ మెప్పించారు. హీరోగా, విలన్ గా వైవిథ్యమైన పాత్రలు పోషించి పరిపూర్ణ నటుడిగా కొనసాగారు. ముఖ్యంగా బాలయ్య ద్విపాత్రాభినయం చేసిన సినిమాలెన్నో. తొలిసారి 'అపూర్వ సహోదరులు' సినిమాతో బాలయ్య డ్యూయల్ రోల్ ప్రస్థానం మొదలైంది. ఆ తర్వాత 'రాముడు-భీముడు', 'బ్రహ్మర్షి విశ్వామిత్ర', 'ఆదిత్య 369', 'మాతో పెట్టుకోకు', 'శ్రీకృష్ణార్జున విజయం', 'పెద్దన్నయ్య', ' సుల్తాన్', 'చెన్న కేశవరెడ్డి', 'అల్లరి పిడుగు' ఇలా చాలా చిత్రాల్లో ద్విపాత్రాభినయంతో అలరించారు.
మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ ని మెప్పించే ఎన్నో సినిమాలు చేసారు. అయితే ఆయనకు మాస్ లో ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఎంతో ప్రత్యేకమైనది. ఆయనలో యాంగర్ బాలయ్యకి ప్రత్యేకమైన ఇమేజ్ ని తీసుకొచ్చింది. ఆ ఇమేజ్ ని బోయపాటి తెలివిగా ఎన్ క్యాష్ చేయగలిగారు. బోయపాటి తెరకెక్కించిన 'సింహ', 'లెజెండ్', 'అఖండ' లాంటి సినిమాలతో తెరపై సరికొత్త బాలయ్యని ఆవిష్కరించారు.
ఒకానొక దశలో రెగ్యులర్ జోనర్ లో సినిమాలు చేయడంతో సరైన ఫలితాలు రాలేదు. సరిగ్గా అదే సమయంలో బాలయ్య లో కొత్త యాంగిల్ బయటకు తెచ్చి బోయపాటి ట్రై చేసి సక్సెస్ అయ్యారు. అప్పటి నుంచి బోయపాటి-బాలయ్య కాంబినేషన్ అంటే ఓ సంచలనంగా మారింది. అందుకే 110వ సినిమా బాధ్యతలు కూడా బోయపాటికి అప్పగించారు.