Begin typing your search above and press return to search.

NBK 50Y వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆక‌ర్ష‌ణ‌

న‌టసింహా నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేక శైలిని చూపుతున్నారు

By:  Tupaki Desk   |   25 July 2024 1:02 PM GMT
NBK 50Y వేడుక‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆక‌ర్ష‌ణ‌
X

న‌టసింహా నందమూరి బాలకృష్ణ సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనదైన ప్రత్యేక శైలిని చూపుతున్నారు. హిందూపురం నియోజకవర్గం నుంచి మూడోసారి ఎన్నికై తన రాజకీయ చతురతను మరోసారి నిరూపించుకున్నారు. ఒకవైపు హిందూపురం అభివృద్ధి పనులను నిర్వహిస్తూనే మరోవైపు సినిమాలకు కూడా తగిన సమయాన్ని కేటాయిస్తున్నారు. బాలకృష్ణ నిరంతరం పనిచేస్తూ పార్టీ సభ్యులకు, అభిమానులకు ఆదర్శంగా నిలిచారు.

ఇప్పుడు బాల‌య్య బాబు మ‌రో అరుదైన మైలురాయిని అందుకున్నారు. ఆగస్ట్ 30నాటికి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. బాలకృష్ణ మొదటి చిత్రం `తాతమ్మ కల` 30 ఆగష్టు 1974 న విడుదలైంది. ఎన్బీకే తండ్రిగారు, దివంగత లెజెండరీ నటుడు ఎన్టీఆర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రను కూడా పోషించారు. అదే సినిమాలో నందమూరి హరికృష్ణ కూడా నటించారు. ఆగస్ట్ 30కి ఈ సినిమా విడుదలై 50 ఏళ్లు పూర్తి చేసుకోనుంది.

ఇండ‌స్ట్రీలోకి కొత్త నీరు వ‌చ్చి చేరుతున్నా విరామం అన్నదే లేకుండా పోటీబ‌రిలో బాలకృష్ణ ఈ 50 ఏళ్లుగా కథానాయకుడిగా కొనసాగుతూనే ఉన్నారు. ఇది అరుదైన విజయం. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయించింది. ఈ విషయమై ఇండస్ట్రీ పెద్దలు కొందరు తనను సంప్రదించడంతో బాలకృష్ణ అంగీకరించారు. ఇలాంటి అరుదైన ఘనత సాధించిన బాలకృష్ణను సత్కరించేందుకు పరిశ్రమకు ఇది మంచి అవకాశం. సెప్టెంబర్ 1వ తేదీన సన్మాన కార్యక్రమం నిర్వహించనున్నారు.

బాల‌య్య‌- ప‌వ‌న్ ఒకే ఫ్రేమ్‌లోకి?

సెప్టెంబరు 1న గచ్చిబౌలి స్టేడియంలో భారీ స్థాయిలో ఈవెంట్‌ను ప్లాన్ చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు సినీరాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు హాజ‌రుకానున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంలు - పవన్ కళ్యాణ్, భట్టి మల్లు విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రులు, ఇరు రాష్ట్రాల మంత్రులను ఈ కార్య‌క్ర‌మానికి ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇండస్ట్రీ అంతా కూడా హాజరయ్యే అవకాశం ఉంది.

పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా భావిస్తున్నారు. సాధారణంగా సినిమాల విషయంలో మెగా, నందమూరి కుటుంబాలు వృత్తిరీత్యా ప్రత్యర్థులు. కానీ పవన్ కళ్యాణ్ ఇటీవలి ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్, బాలకృష్ణ సన్నిహితులుగా మారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. సినీప‌రిశ్ర‌మ‌లో కీల‌క మార్పుల‌ను తెచ్చే దిశ‌గా వారు అడుగులు వేస్తున్నార‌ని స‌మాచారం. బాల‌య్య 50 ఈవెంట్లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టాలీవుడ్ ఏర్పాటు గురించి కీల‌క ప్ర‌క‌ట‌న చేస్తార‌ని, నంది అవార్డుల గురించి ప్ర‌క‌టిస్తార‌ని అంతా అంచ‌నా వేస్తున్నారు.