2024లో మోక్షు డెబ్యూ..కన్ఫామ్ చేసిన NBK
నటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి థియేటర్లలోకి దసరా పండుగను తెచ్చిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 22 Oct 2023 1:25 PM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి థియేటర్లలోకి దసరా పండుగను తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నటించిన శ్రీలీల, కాజల్ పాత్రలకు పేరొచ్చింది. ఇప్పుడు భగవంత్ కేసర ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఆసక్తిని కలిగిస్తోంది. బాలకృష్ణ చిచ్చాతో విజ్జీపాప శ్రీలీల ఇంటర్వ్యూ ఆద్యంతం రక్తి కట్టించింది.
భగవంత్ కేసరి సినిమాపై చాలా ప్రశ్నలు అడిగిన శ్రీలీల నందమూరి నటవారసుడు మోక్షజ్ఞ గురించి ప్రశ్నించడం ఆసక్తిని కలిగించింది. ఇంతకీ మోక్షజ్ఞ డెబ్యూ ఎప్పుడు ఉంటుంది? అన్నది శ్రీలీల ప్రశ్న. దానికి బాలయ్య నుంచి సూటిగా సమాధానం వచ్చింది.
మోక్షజ్ఞ ఎంట్రీ 2024లో ఉంటుందని నందమూరి బాలకృష్ణ ఈ ఇంటర్వ్యూలో మరోసారి కన్ఫామ్ చేసారు.
రామారావు మనవడిగానో లేక బాలకృష్ణ కొడుకు గానో కాదు .. నందమూరి లెగసీని మోక్షజ్ఞ ముందుకు తీసుకెళ్లాలి.. అని కూడా ఖరాకండిగా చెప్పారు.
మోక్షు ఫ్యూచర్ గురించి నాకు అసలు దిగులే లేదు. ఎందుకంటే నేనే కెరీర్ పరంగా ఖాళీగా లేను. చాలా బిజీ. నేను అన్ స్టాపబుల్ .. నా స్పీడ్ ని ఎవరూ తట్టుకోలేదు. నాకు ఇంకా చాలా స్క్రిప్టులు ఉన్నాయి. నేను నటిస్తూనే ఉంటాను. అద్భుతమైన సబ్జెక్టులు రెడీ చేసాను అని కూడా బాలయ్య బాబు తెలిపారు.
తేడా వస్తే లాగి కొట్టాను:
తన గురించి మోక్షజ్ఞ గురించి మీడియా ఏం రాసినా పట్టించుకోనని కూడా బాలయ్య బాబు అన్నారు. సోషల్ మీడియా వెద*ల్ని ఎవరినీ లెక్క చేయను. ఎవరు ఏం రాసినా అసలు పట్టించుకోను... అని బాలయ్య బాబు అన్నారు. ఇతరుల గురించి ఆలోచించే సమయం తనకు ఉండదని తెలిపారు.
నేను పర్ఫెక్షనిస్టును.. నా పని నేను చేసుకుపోతుంటానని సెట్ లో ఇతరులు అలానే ఉండాలనుకుంటానని అన్నారు. తేడా వస్తే లాగి కొట్టాను తిట్టాను.. పర్ఫెక్ట్ గా చేయాలనే అలా చేసానని అన్నారు.
బోయపాటి, పూరి, గోపిచంద్ మలినేని ఎవరితో ముందుగా సినిమా చేయాలనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు .. సమాధానం దాటవేసిన బాలయ్య బాబు ఎవరి ప్రత్యేకత వారికి ఉంటుందని తెలిపారు. ఇక బోయపాటిపై తన అభిమానాన్ని బాలయ్య మరోసారి చాటుకున్నారు. తన బాడీ లాంగ్వేజ్ ని స్పీడ్ ని క్యాచ్ చేసే దర్శకుడు బోయపాటి అని అన్నారు. ``బోయపాటి నేను ఒకరోజు కూచుంటాం.. సబ్జెక్ట్ రోజులోనే ఓకే అయిపోతుంది. మళ్లీ కలవం. ఒకరోజులోనే నా బాడీ లాంగ్వేజ్ ని పట్టేస్తాడు. కథేంటో దానికి తగ్గట్టు తన పని తాను చేసేస్తాడు.. లెజెండ్ చేసాడు. తర్వాత అఖండ చేసాం. మా డ్యూటీ మేం చేసుకుపోతుంటాం.. అని కూడా బాలకృష్ణ అన్నారు.
మరిన్ని సంగతులు మాట్లాడుతూ.. నా సినిమాలు పంచభక్ష పరమాన్నంలా ఉండాలి. డ్యాన్స్ , నటన, యాక్షన్, పాథాస్ అన్నీ ఉండాలని బాలయ్య అన్నారు. భగవంత్ కేసరిలో కాజల్ సైక్రియాటిస్టుగా చాలా బాగా చేసింది. తన పాత్ర కేవలం కామెడీ మాత్రమే కాదు.. చాలా కీలకమైనది... అని తెలిపారు. శ్రీలీలకు , కాజల్ కు తేడా ఏంటి? అని ప్రశ్నిస్తే.. స్వీట్ కి లవబుల్ కి తేడా ఏంటో చెప్పాలని కూడా అన్నారు. విజ్జీ పాప ముందు చిన్నపిల్లాడిలా బాలయ్య బాబు ఎంతో కలిసిపోయి మాట్లాడడం ఆశ్చర్యపరిచింది.