కొత్త ఇంటి ప్రవేశానికి బాలయ్య రెడీ!
నటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి బాక్సాఫీస్ విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. అఖండ తర్వాత మరో విజయాన్ని ఆయన తన ఖాతాలో వేసుకున్నారు.
By: Tupaki Desk | 1 Nov 2023 5:04 AM GMTనటసింహా నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి బాక్సాఫీస్ విజయాన్ని ఆస్వాధిస్తున్నారు. అఖండ తర్వాత మరో విజయాన్ని ఆయన తన ఖాతాలో వేసుకున్నారు. ఇదే ఉత్సాహంలో వరుస చిత్రాలకు కమిటవుతున్నారని సమాచారం. 2024లో నందమూరి నటవారసుడు మోక్షజ్ఞను లాంచ్ చేస్తానని ఇదివరకూ ఓ ఇంటర్వ్యూలో బాలకృష్ణ అన్నారు.
అయితే అంతకంటే ముందే ఒక బిగ్ సర్ ప్రైజ్ కి ఆయన సిద్ధమయ్యారు. ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నం.12లోని నందమూరి బాలకృష్ణ విశాలమైన భవంతిలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. కీలకమైన కూడలి పరిసరాల్లో ఇది ఉంది. కానీ ఇప్పుడు ఆయన తన అడ్రెస్ మార్చేందుకు రెడీ అవతున్నారని గుసగుస వినిపిస్తోంది. రకరకాల కారణాలతో బాలకృష్ణ ఇప్పుడు జూబ్లీహిల్స్‌లోని కొత్త ఇంటికి మారనున్నాడని కథనాలొస్తున్నాయి. ఈ కొత్త ఇల్లు జూబ్లీహిల్స్ ప్రాంతంలోని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి సమీపంలో ఉంది. ఫిబ్రవరి 2024లో బాలయ్య గృహ ప్రవేశం చేయనున్నాడని ప్రస్తుతం ఇంటీరియర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సమాచారం.
అయితే నటసింహం ఇంత సడెన్ గా ఇల్లు మారడం వెనక బలమైన కారణాలు ఏవైనా ఉన్నాయా? అంటూ అభిమానుల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం రోడ్ నం.12లోని ఇంటి పరిసరాలు నిరంతర ట్రాఫిక్ తో మరింత రద్దీగా మారాయి. అందుకే ఇల్లు మారుతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. కూడలి పరిసరాల్లోని ట్రాఫిక్ సిగ్నల్ కి బాలయ్య ఇల్లే ఒక ల్యాండ్ మార్క్. ఇప్పుడు అక్కడ రణగొణ ధ్వనులు అంతకంతకు పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు. అందుకే ఇప్పుడు ప్రశాంతంగా ఎలాంటి ట్రాఫిక్ శబ్ధాలు లేని మరో చోటికి మారుతున్నారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఇప్పటికి ఇవన్నీ నిరాధార వార్తలు. నందమూరి కుటుంబం తాము ఇల్లు మారే విషయాన్ని అధికారికంగా ధృవీకరించాల్సి ఉంది.
ఒకవేళ ఈ వార్తలు నిజమే అయితే మెగాస్టార్ చిరంజీవి.. నందమూరి బాలకృష్ణ ఇరుగు పొరుగు వారు అవుతారు. ఇది ఫ్యాన్స్ లో ఉత్కంఠ రేపే విషయం. ఎన్బీకే తదుపరి కేఎస్ రవీంద్ర అలియాస్ బాబి దర్శకత్వంలో ఓ సినిమాకి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఆదిత్య 999 మ్యాక్స్ తో తనయుడు మోక్షజ్ఞను బాలయ్య లాంచ్ చేస్తారని అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. మోక్షజ్ఞ ప్రస్తుతం లుక్ మేకోవర్ పై దృష్టి సారించారు.