'ఆదిత్య 369' మళ్లీ రీ-రిలీజ్.. అప్పట్లో బడ్జెట్, కలెక్షన్స్ ఎంత?
ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత, ఈ మహత్తరమైన చిత్రం మరోసారి ప్రేక్షకులను తన మాయలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది.
By: Tupaki Desk | 18 March 2025 3:28 PM ISTనందమూరి బాలకృష్ణ కెరీర్‌లో గొప్ప చిత్రాల్లో ఒకటిగా నిలిచిన ఆదిత్య 369 మరోసారి తెరపై సందడి చేయబోతోంది. తెలుగు సినిమా చరిత్రలో తొలిసారిగా సైన్స్ ఫిక్షన్ జానర్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. బాలకృష్ణ విభిన్న పాత్రల్లో చేసిన అద్భుతమైన నటన, సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వ ప్రతిభ, ఇళయరాజా సంగీతం.. అన్నీ కలిసి ఈ సినిమాను క్లాసిక్‌గా నిలిపాయి. ఇప్పుడు 33 ఏళ్ల తర్వాత, ఈ మహత్తరమైన చిత్రం మరోసారి ప్రేక్షకులను తన మాయలోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతోంది.

గతంలోనే సినిమాను రీ రిలీజ్ చేయలని అనుకున్నారు. కానీ కుదరలేదు. ఇక ఇప్పుడు ఈ సినిమాను 4K రీమాస్టర్ చేసి, 5.1 సౌండ్‌తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆదిత్య 369 రీ-రిలీజ్ ఏప్రిల్ 11న గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నారు. ఎప్పటికీ ప్రాముఖ్యత కోల్పోని ఓ టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో వచ్చిన తొలి భారతీయ చిత్రం కావడం దీని ప్రత్యేకత. అప్పట్లో దీనికి వీసీఆస్, క్యాసెట్ మార్కెట్‌లో విపరీతమైన డిమాండ్ ఉండేది.
ఇప్పుడు 4K రీ-రిలీజ్ వల్ల నేటి ప్రేక్షకులు కూడా ఈ సినిమా మేజిక్‌ని మరోసారి ఆస్వాదించగలరు. బాలయ్య టైమ్ మిషన్ ద్వారా పాత రాజవంశానికి వెళ్ళే సీన్స్ ఇప్పటికీ తెలుగు సినీ అభిమానులకు హైలైట్. బడ్జెట్ పరంగా, విజువల్ ఎఫెక్ట్స్ పరంగా ఈ సినిమా అప్పట్లో సరికొత్త మార్గాన్ని సృష్టించింది. అప్పట్లో సినిమాను 1.30కోట్లకి నిర్మించారు నిర్మాత కృష్ణ ప్రసాద్. అప్పట్లో బాలయ్య కెరీర్ లోనే ఇది బిగ్ బడ్జెట్ మూవీ.
ఇక చాలా తక్కువ మార్జిన్ తోనే నిర్మాత సినిమాను అమ్మేయగా డిస్ట్రిబ్యూటర్స్ కు మంచి లాభాలను అందించింది. ఇక ఇప్పుడు రీ రిలీజ్ లో మరింత గ్రాండ్ గానే విడుదల చేయనున్నారు. ఈ రిలీజ్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం మాత్రం కొత్త తరానికి ఆదిత్య 369 విలువను తెలియజేయడమే. బాలయ్య ఈ చిత్రానికి సీక్వెల్ ప్లాన్ చేస్తూ, త్వరలో దీనిపై ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఇంతకుముందే ఆయన ఒక ఇంటర్వ్యూలో ఆదిత్య 999 అనే టైటిల్ లాక్ చేసినట్లు హింట్ ఇచ్చారు. ఇదే కనుక సెట్టయితే అయితే, తెలుగులో మరో సైన్స్ ఫిక్షన్ మైల్‌స్టోన్ రాబోతుందని చెప్పొచ్చు.
ఇక శ్రీదేవి మూవీస్ బ్యానర్ ఈ రీ-రిలీజ్ కోసం ప్రమోషన్ ప్లాన్ చేస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ నుంచి మరో ఇంట్రెస్టింగ్ మూవీ సారంగపాణి జాతకం కూడా ఏప్రిల్ 18న విడుదలకు సిద్ధంగా ఉంది. ఏదేమైనా, బాలకృష్ణ అభిమానులకు ఇది చక్కటి ట్రీట్ కానుంది. 90ల నాటి గొప్ప సినిమాను, ఇప్పుడు మరింత ఆధునిక టెక్నాలజీతో పెద్ద తెరపై చూడటానికి ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.