Begin typing your search above and press return to search.

చిరంజీవి - మోహన్ బాబుల లెజెండ్ వివాదంపై బాలకృష్ణ సెటైర్లు..!

ఈ సందర్భంగా గతంలో వజ్రోత్సవాల సమయంలో చిరంజీవి మోహన్ బాబుల మధ్య గొడవ జరిగిన వివాదం గురించి పరోక్షంగా ప్రస్తావించారు.

By:  Tupaki Desk   |   8 Jan 2025 8:21 AM GMT
చిరంజీవి - మోహన్ బాబుల లెజెండ్ వివాదంపై బాలకృష్ణ సెటైర్లు..!
X

నందమూరి బాలకృష్ణ హోస్టుగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' టాక్ షో ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆహా ఓటీటీ వేదికగా ప్రస్తుతం ఈ షో నాలుగో సీజన్ నడుస్తోంది. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. లేటెస్ట్ ఎపిసోడ్ లో 'డాకు మహారాజ్' చిత్ర బృందం పాల్గొంది. ప్రతీవారం తన సినిమాల్లోని ఏదొక గెటప్ తో వచ్చే బాలయ్య.. ఈసారి 'లెజెండ్' క్యారక్టర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా గతంలో వజ్రోత్సవాల సమయంలో చిరంజీవి మోహన్ బాబుల మధ్య గొడవ జరిగిన వివాదం గురించి పరోక్షంగా ప్రస్తావించారు.

'లెజెండ్' అనే టైటిల్ పెట్టడానికి కారణమేంటి అని ఓ అభిమాని ప్రశ్నించగా.. "కట్టె కొట్టె తెచ్చే.. అంతే. దీనికి పెద్దగా వివరణ చెప్పను" అని బాలయ్య అన్నారు. "ఒకానొక సమయంలో ఇండస్ట్రీలో ఒక చిన్న గొడవ జరిగింది. నేను లోతుల్లోకి వెళ్లను కానీ, అసలు లెజెండ్ అంటే ఏంటి? అని ఎవరో హీరోలు పోట్లాడుకున్నారు. లెజెండ్ ఎవరంటూ వాళ్ళు వాళ్ళు కొట్టుకు చచ్చారు. నేను ఇన్ని సినిమాలు చేశా.. అన్ని సినిమాలు చేశా అంటూ వాదించుకున్నారు" అని చెప్పారు. లెజెండ్ అంటే అర్థం ఎవడికి తెలుసు. ఎక్కడికి వెళ్ళినా లెజెండా లెజెండా అంటుంటారు.. అది లెజెండా కాదు, లెజెండ్ అని చెబుతుంటానన్నారు బాలకృష్ణ.

"నేను 50 సంవత్సరాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు చేశాను. గ్రామీణ నేపథ్యం ఉన్న సినిమాలు, జానపద, పౌరాణిక చిత్రాలు, సైన్స్ ఫిక్షన్ చిత్రాలు, యాక్షన్ సినిమాలు.. ఇలా మనం అడుగుపెట్టని నేపథ్యం లేదు. వీటన్నింటినీ ప్రజలు విజయవంతం చేసి, శాశ్వితంగా తమ గుండెల్లో నన్ను ఒక లెజెండ్ గా నిలబెట్టారు. తెలుగు ప్రేక్షక దేవుళ్ళకు, అభిమానులకు లెజెండ్ అంటే ఏంటో నేను చెప్పక్కర్లేదు. మీరే చెబుతారు" అని బాలకృష్ణ అన్నారు. సింహాగా, లెజెండ్ గా, అఖండగా, వీర సింహా రెడ్డిగా, భగవంత్ కేసరిగా చూశారు.. మీరు నన్ను త్వరలోనే డాకూ మహారాజ్ గా చూడబోతున్నారని చెప్పుకొచ్చారు.

కొన్నేళ్ల క్రితం జరిగిన తెలుగు సినీ పరిశ్రమ వజ్రోత్సవాల సెలబ్రేషన్స్ లో లెజెండ్ గురించి మోహన్ బాబు, చిరంజీవి మధ్య గొడవ జరిగింది. 500కు పైగా సినిమాల్లో ఎన్నో విభిన్నమైన పాత్రలు పోషించానని, రాజ్యసభ సభ్యుడిగా, విద్యాసంస్థల అధినేతగా ఉన్న తనను లెజెండ్ గా ఎందుకు గుర్తించలేదని మోహన్ బాబు ప్రశ్నించారు. గిరిబాబు లాంటి మరికొందరు సీనియర్ నటులకు లెజెండరీ అవార్డ్ ఎందుకు ఇవ్వలేదని సభా ముఖంగా అడిగారు. దీనికి చిరంజీవి ఘాటుగా స్పందిస్తూ.. తనకు లెజెండరీ స్టేటస్ వచ్చిందని చెప్పేంతవరకు ఆ అవార్డును తీసుకోనని చెప్పారు. అయితే ఆనాడు లెజెండ్ విషయంలో చిరు - మోహన్ బాబుల మధ్య జరిగిన వివాదాన్నే బాలయ్య ఇప్పుడు తన షోలో పేర్లు చెప్పకుండా ప్రస్తావించారు.

ఇకపోతే ఇటీవల అక్కినేని అవార్డ్ అందుకున్న చిరంజీవి.. ఆ సందర్భంగా వజ్రోత్సవాల వివాదాన్ని గుర్తు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎవరైనా ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. కానీ నేను నా సినీ ప్రస్థానంలో మొద‌ట బ‌య‌టే గెలిచాన‌ని ఇప్పుడు ఇంట గెలిచాన‌ని చిరు అన్నారు. కొంత కాలం క్రితమే ఇంట గెలిచే అవకాశం సినీ వజ్రోత్సవాల్లో వచ్చింది. నాకు లెజెండరీ అవార్డు వచ్చినందుకు ధన్యుడిగా అయున‌ట్లు భావించా.. కానీ దాన్ని కొందరు హర్షించలేదు. దాంతో ఆ అవార్డు తీసుకోవడం సముచితం అనిపించలేదు. ఆరోజు లెజెండరీ అవార్డును క్యాప్సుల్ బాక్సులో వేశా. పద్మవిభూషణ్‌ సహా ఎన్ని అవార్డులు వ‌చ్చినా ఆ అసంతృప్తి మాత్రం అలానే మిగిలే ఉంది. కానీ ఇప్పుడు 'అక్కినేని అవార్డ్' రావ‌డంతో నా సినీ జీవితానికి ప‌రిపూర్ణ‌త చేకూరిన‌ట్లైంద‌ని మెగాస్టార్ ఎమోషనల్ గా మాట్లాడారు.