బాలయ్య మాస్ కాంబో కోసం ఆ ముగ్గురు
అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందన్న ప్రచారం సాగింది.
By: Tupaki Desk | 5 Feb 2025 9:10 AM GMTనందమూరి బాలకృష్ణ వరుస విజయాలతో దూసుకెళ్తూ.. తన కెరీర్‌లో మరో హిట్ ప్రాజెక్ట్‌ను లైన్‌లో పెట్టేశారు. యంగ్ మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరోసారి బాలయ్య సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వీరి కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘వీర సింహా రెడ్డి’ పెద్ద హిట్ అవ్వడంతో మళ్లీ ఈ క్రేజీ కాంబో రిపీట్ అవుతోంది. అయితే ఇప్పటి వరకు ఈ ప్రాజెక్ట్‌ను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుందన్న ప్రచారం సాగింది.
కానీ తాజా సమాచారం ప్రకారం, అసలు నిర్మాత ఎవరు అన్న విషయం గురించి స్పష్టత వచ్చింది. ఇటీవల బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ సినిమాతో సంక్రాంతి బరిలో నిలిచి భారీ హిట్ కొట్టారు. ఆ తర్వాత ‘అఖండ 2’ సెట్స్‌పైకి వెళ్లిన బాలయ్య, దీనిని త్వరగా పూర్తి చేసి కొత్త ప్రాజెక్ట్‌లను లైన్‌లో పెట్టాలని చూస్తున్నారు. బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో మళ్లీ హ్యాట్రిక్ కోసం ‘అఖండ 2’ను పూర్తి చేయబోతున్నారు.
మరోవైపు.. గోపీచంద్ మలినేనితో చేయబోయే సినిమాకు సంబంధించిన పనులు ముందుకు సాగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోయే సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై కాదు. సాహు గారపాటి, సుధాకర్ చెరుకూరి, సతీష్ కిలారు ఈ ముగ్గురు కలిసి సినిమాను నిర్మించనున్నారు. ఇప్పటికే నిర్మాతల మధ్య చర్చలు ముగిసినట్టు టాక్.
ముగ్గురు కలిసి ఒక న్యూ బ్యానర్ ను రెడీ చేస్తున్నట్లు టాక్. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌తో ‘జాట్’ సినిమా చేస్తుండగా, ఆ ప్రాజెక్ట్ పూర్తయ్యాక బాలయ్య సినిమాకు సమయం కేటాయించనున్నారు. బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌పై టాలీవుడ్‌లో మంచి హైప్ ఉంది. ‘క్రాక్’, ‘వీర సింహా రెడ్డి’ వంటి మాస్ ఎంటర్‌టైనర్స్‌తో సక్సెస్‌ను అందుకున్న గోపీచంద్ మలినేని, బాలయ్య కోసం మరో భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్లాన్ చేస్తున్నాడు.
వీరి కాంబోకు ఇప్పటికే బిగ్ బిజినెస్ హ్యాపెనింగ్ అవుతోందని సమాచారం. ఈ సినిమా అధికారికంగా అనౌన్స్ అయితే, టైటిల్, కథపై క్లారిటీ రానుంది. బాలకృష్ణ మాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా ఈ ప్రాజెక్ట్‌ను డిజైన్ చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి సంగీతం ఎస్.ఎస్. తమన్ అందించనున్నారని టాక్. మొత్తానికి బాలకృష్ణ మరోసారి గోపీచంద్ మలినేనితో మాస్ మసాలా హిట్ కొట్టేందుకు సిద్ధమవుతున్నారు.