Begin typing your search above and press return to search.

మెగా హీరో సినిమాలో జై బాలయ్య!

అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

By:  Tupaki Desk   |   22 July 2024 8:53 AM GMT
మెగా హీరో సినిమాలో జై బాలయ్య!
X

టాలీవుడ్ యంగ్ హీరో అల్లు శిరీష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ‌డ్డీ’. యాక్షన్ ప్యాక్డ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒక టెడ్డీ బేర్ కీలక పాత్ర పోషిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ అయింది. ఈ నేపథ్యంలో ఇప్ప‌టికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్, ట్రైలర్, సాంగ్స్.. సినిమాపై అందరిలో ఆసక్తిని కలిగించాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

‘బ‌డ్డీ’ మూవీలో నట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ రిఫ‌రెన్స్ ఉంటుందట. ఓ యాక్ష‌న్ సీక్వెన్స్ లో 'జై బాలయ్య' అనే స్లోగ‌న్ వినిపిస్తుందట. 'భ‌గ‌వంత్ కేస‌రి' థీమ్ మ్యూజిక్ తో వచ్చే ఈ సన్నివేశం ప్రేక్ష‌కుల‌ను స‌ర్ ప్రైజ్ చేస్తుందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. మెగా ఫ్యామిలీ హీరో సినిమాలో నంద‌మూరి హీరో రిఫరెన్స్ ఉండటం ఇరు వర్గాల అభిమానులను ఆకర్షిస్తోంది. ఇదే నిజమైతే ‘జై బాల‌య్య’ స్లోగ‌న్స్ తో థియేట‌ర్లు దద్దరిల్లిపోవడం గ్యారంటీ అని కామెంట్స్ చేస్తున్నారు.

మెగా ఫ్యామిలీతో బాలకృష్ణకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. నిర్మాత అల్లు అరవింద్ ఆహా ఓటీటీ వేదికగా 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే' అనే టాక్ షోతో బాలయ్యను హోస్టుగా పరిచయం చేసారు. ఆయనలోని మరో కోణాన్ని జనాలకు తెలిసేలా చేసారు. ఆ తర్వాత అల్లు అర్జున్, బాలకృష్ణ కలిసి పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకున్నారు. అల్లు శిరీష్ చివరి సినిమా 'ఊర్వశివో రాక్షసివో' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు బాలయ్య చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ క్రమంలో శిరీష్ తన ‘బ‌డ్డీ’ సినిమాలో జై బాల‌య్య అంటూ ఆయన మీదున్న అభిమానాన్ని చాటుకోబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

నిజానికి 'జై బాలయ్య' అనే స్లోగన్ ఒకప్పుడు ట్రోలింగ్ కోసం ఎక్కువగా ఉపయోగించినప్పటికీ, ఇప్పుడు మాత్రం ప్రేక్షకులకు అదొక ఎమోషన్ గా మారిపోయింది. ఎక్కడైనా, సందర్భం ఏదైనా ఆ స్లోగన్ వినపడితే చాలు ఆటోమేటిక్ గా అక్కడున్న వారంతా జై కొడుతున్నారు. నిన్నటికి నిన్న 'రాయన్' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని జై బాలయ్య అంటూ అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. తాజాగా ఆహా ఓటీటీలో అనౌన్స్ చేసిన 'బాలు గాని టాకీస్' సినిమా పోస్టర్ మీద 'జై బాలయ్య' అని ఉండటాన్ని గమనించవచ్చు.

ఇక ‘బ‌డ్డీ’ విషయానికొస్తే.. అల్లు శిరీష్ కాస్త గ్యాప్ తీసుకొని చేసిన సినిమా ఇది. కథంతా ఓ టెడ్డీ బేర్ చుట్టూ సాగుతుందని తెలుస్తోంది. ఇందులో పైలట్ ఆదిత్య రామ్‌ పాత్రలో శిరీష్ కనిపించనున్నారు. టెడ్డీ బేర్ తో కలిసి ఆయన చేసే విన్యాసాలు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ భావిస్తోంది. కచ్చితంగా సక్సెస్ సాధిస్తుందని ధీమాగా ఉన్నారు. ఇందులో గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అజ్మల్ అమీర్ కీలక పాత్ర పోషించగా.. అలీ, ముఖేష్ కుమార్ ఇతర పాత్రలు పోషించారు.

'బడ్డీ' చిత్రానికి శామ్ ఆంటోన్ దర్శకత్వం వహిస్తున్నారు. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. హిప్ హాప్ తమిజ సంగీతం సమకూరుస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ అందించగా.. రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆగస్టు 2న ఈ సినిమాని గ్రాండ్ గా రిలీజ్ చెయ్యడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మరి అల్లు శిరీష్ ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.