Begin typing your search above and press return to search.

కొమరం పులి నిర్మాతకు బండ్ల గణేష్ పవర్ఫుల్ కౌంటర్!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హఠాత్తుగా చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

By:  Tupaki Desk   |   5 Feb 2025 12:27 PM GMT
కొమరం పులి నిర్మాతకు బండ్ల గణేష్ పవర్ఫుల్ కౌంటర్!
X

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హఠాత్తుగా చోటు చేసుకున్న ఒక సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీనియర్ నిర్మాత, ఫైనాన్షియర్ శింగనమల రమేష్ బాబు చాలా కాలం తర్వాత మీడియా ముందుకు వచ్చారు. పది సంవత్సరాలకు పైగా సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న ఆయన.. ఇంత అకస్మాత్తుగా ప్రెస్‌మీట్ పెట్టడం అందరిలో ఆసక్తిని రేపింది. తన సినీ ప్రయాణం, ఎదుర్కొన్న కష్టసుఖాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించేందుకు వచ్చిన రమేష్ బాబు.. తన కోల్పోయిన నష్టాల గురించి చెప్పడం సంచలనంగా మారింది.

ఒకప్పుడు మహేష్ బాబు ‘ఖలేజా’, పవన్ కళ్యాణ్ ‘కొమరం పులి’ సినిమాలు నిర్మించిన రమేష్ బాబు, ఈ రెండు సినిమాల వల్ల తనకు 100 కోట్లు నష్టం వచ్చిందని, ఆ సమయంలో హీరోలు కనీసం ఒక మాటా మాట్లాడలేదని పరోక్షంగా వాపోయారు. తాను పడిన నష్టాన్ని ఎవ్వరూ పట్టించుకోలేదని ఆయన చేసిన కామెంట్స్ పవన్, మహేష్ ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చాయి.

దీనిపై ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద చర్చే నడుస్తోంది. నిర్మాతగా తాను ఎదుర్కొన్న కష్టాలను వివరించిన రమేష్ బాబు, ఇప్పుడైనా తనకు న్యాయం జరగాలని భావించారని కొందరు అంటుంటే, ఇది గతాన్ని తిరిగి తవ్వడం కాదా? అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే, ఈ వివాదంపై మరో ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ స్పందించడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.

సోషల్ మీడియా వేదికగా ఆయన దీని గురించి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. 'రమేష్ గారు మీరు సరిగ్గా సినిమాను ప్లాన్ చేసుకోలేకపోవడం మీ తప్పు, మీ కోసం పవన్ కళ్యాణ్ గారు మూడు సంవత్సరాల పాటు ఏ చిత్రం చేయకుండా కొన్ని వందల కాల్షీట్స్ వేస్ట్ చేసుకున్నారు. ప్రత్యక్ష సాక్షి నేను. దయచేసి ఈ విషయాన్ని రాద్ధాంతం చేసుకోకండి ఇది కరెక్ట్ కాదు' అని తన స్టేట్‌మెంట్‌తో మరింత ఆసక్తిని రేకెత్తించారు.

అప్పట్లో ఈ రెండు సినిమాలు జాప్యం కావడానికి నిర్మాతల ఆర్థిక ఇబ్బందులే కారణమని చెప్పేవారు. అయితే రమేష్ బాబు మాటలతో పవన్, మహేష్ ను పరోక్షంగా టార్గెట్ చేసినట్లు అభిప్రాయాలు వస్తున్నాయి. కానీ, బండ్ల గణేష్ సీరియస్‌గా స్పందించడం పవన్ ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని పెంచుతోంది. దర్శకుడు ఎస్.జె. సూర్య కూడా దీనిపై స్పందించవచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే, త్రివిక్రమ్, మహేష్ బాబు మాత్రం ఈ వ్యవహారంపై మౌనం పాటించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

ఇదంతా కలిపి పవన్ – మహేష్ ఫ్యాన్స్ మధ్య పెద్ద చర్చకు దారి తీస్తోంది. ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో రమేష్ బాబు కామెంట్స్‌పై పవన్, మహేష్ అభిమానులు తమదైన స్టైల్‌లో రియాక్ట్ అవుతున్నారు. ఇక శింగనమల రమేష్ బాబు తన భవిష్యత్ ప్రాజెక్టుల గురించి చెప్పినా, ఇప్పుడు ఫోకస్ మాత్రం గత నష్టాలపై పడింది. ఈ వివాదం ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో తెలియదు కానీ, ఇండస్ట్రీలో లాంగ్ గ్యాప్ తర్వాత బయటికి వచ్చిన రమేష్ బాబు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారుతున్నాయి.