ఈసారి అంతకు మించి వివాదం.. మళ్లీ వాళ్లే టార్గెట్!
ఒక మతానికి చెందిన వారు తమను కించ పరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి, తమ జాతి మొత్తంను ఇందులో తప్పుగా చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
By: Tupaki Desk | 6 March 2024 7:49 AM GMTగత ఏడాది చిన్న చిత్రంగా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం 'ది కేరళ స్టోరీ'. ఆ సినిమా విడుదల సమయంలో తీవ్ర వివాదాలు చోటు చేసుకున్నాయి. ఒక మతానికి చెందిన వారు తమను కించ పరిచే విధంగా సన్నివేశాలు ఉన్నాయి, తమ జాతి మొత్తంను ఇందులో తప్పుగా చూపించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
థియేట్రికల్ రిలీజ్ సమయంలో జరిగిన రచ్చ కారణంగా అసలు ది కేరళ స్టోరీ లో ఏం ఉందనే ఆసక్తి అందరిలో కలిగి.. జనాలు థియేటర్ల వైపు అడుగులు వేసేలా చేసింది. అదే టీం ఇప్పుడు బస్తర్ : ది నక్సల్ స్టోరీ పేరుతో మరో సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సుదీప్తో సేన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో అదా శర్మ ముఖ్య పాత్రలో నటించింది.
2010 లో ఛతీస్ గడ్ లో జరిగిన మావోయిస్ట్ ఆపరేషన్ లో 75 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్లు మృతి చెందారు. ఆ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. 75 మంది సీఆర్ఫీఎఫ్ జవాన్ లు మృతి చెందిన సమయంలోనే ఢిల్లీకి చెందిన ఒక యూనివర్శిటీలో సంబరాలు చేసుకున్నారనే వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారంను రేపాయి.
ఒక మతానికి చెందిన వారు మావోయిస్ట్ ఆపరేషన్ లో సీఆర్ఫీఎఫ్ జవాన్ ల మృతికి సంబరాలు చేసుకోవడంతో తీవ్ర వివాదం చెలరేగింది. ఆ సంఘటనకు సంబంధించిన కథ తో బస్తర్ సినిమా రూపొందినట్లుగా ఇప్పటికే మేకర్స్ నుంచి ప్రకటన వచ్చింది.
కేరళ స్టోరీ సినిమాలో చూపించినట్లుగానే ఈ సినిమాలో కూడా ఒక మతాన్ని తప్పుగా చూపిస్తూ ఉన్నారంటూ సదరు మతస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇలాంటి సినిమాలను సమర్ధిస్తుంది అంటూ సదరు మత నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేరళ స్టోరీ సమయంలో మాదిరిగా కాకుండా ఈసారి అంతకు మించి గొడవలు జరిపే విధంగా ఆ మతస్తులు ప్లాన్ చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాను విడుదల అవ్వనిచ్చేది లేదు అంటున్నారు. రాజకీయాల కోసం ఇలాంటి సినిమాలు చేస్తున్నారంటూ వారు గొడవ చేస్తున్నారు. మార్చి 15న విడుదల అవ్వబోతున్న బస్తర్ కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యేను చూడాలి.