బెదురులంక 2012
By: Tupaki Desk | 25 Aug 2023 7:07 AM GMT'బెదురులంక 2012' మూవీ రివ్యూ
నటీనటులు: కార్తికేయ-నేహా శెట్టి-అజయ్ ఘోష్-శ్రీకాంత్ అయ్యంగార్-గోపరాజు రమణ-వెన్నెల కిషోర్-జబర్దస్త్ రామ్ ప్రసాద్-గెటప్ శీను-సత్య-రాజ్ కుమార్ కసిరెడ్డి-ఎల్బీ శ్రీరామ్ తదితరులు
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సాయిప్రకాష్ ఉమ్మడిసింగు-సన్నీ కూరపాటి
నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని
రచన-దర్శకత్వం: క్లాక్స్
'ఆర్ఎక్స్ 100' సంచలన విజయంతో మంచి గుర్తింపు సంపాదించిన యువ కథానాయకుడు కార్తికేయ.. ఆ తర్వాత చాలా సినిమాలు చేసినా ఆశించిన విజయం దక్కలేదు. ఇప్పుడతను 'బెదురులంక 2012' అనే వైవిధ్యమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రేజీ ప్రోమోలతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ చిత్రం ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
బెదురులంక అనే ఊర్లో పెద్దమనిషిగా చలామణి అయ్యే భూషణం (అజయ్ ఘోష్).. 2012లో యుగాంతం వస్తుందన్న ప్రచారాన్ని వాడుకుని ఊరి జనాల్ని దోచేయడానికి ప్లాన్ వేస్తాడు. అందుకోసం బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్) అనే దొంగ బాబాని.. డానియల్ (రామ్ ప్రసాద్) ఫేక్ పాస్టర్ ని వాడుకుంటాడు. వీరి మాటల్ని నమ్మి ఊరి జనం తమ బంగారం అంతా వాళ్లకు ఇచ్చేసి వాళ్లు చెప్పే పూజలు.. ప్రార్థనల్లో మునిగి తేలుతుంటారు. కానీ సిటీలో ఉద్యోగం చేసి ఊరికి వచ్చిన శివ (కార్తికేయ) మాత్రం వీరి మాటల్ని అస్సలు నమ్మడు. ప్రెసిడెంట్ అండ చూసుకుని రెచ్చిపోతున్న ఈ ముగ్గురినీ ఎదిరిస్తాడు. దీంతో అతను ఊరు వదిలి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే తను ప్రేమించిన ప్రెసిడెంట్ కూతురు చిత్ర (నేహా శెట్టి)కు కూడా దూరమవుతాడు. మరి శివ తిరిగి బెదురులంకకు వచ్చాడా.. యుగాంతం పేరు చెప్పి ఊరిని దోచేస్తున్న ఈ ముగ్గురికీ బుద్ధి చెప్పాడా.. చిత్రను దక్కించుకున్నాడా.. అన్న ప్రశ్నలకు తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం-విశ్లేషణ:
కొన్ని సినిమాలు చాలా ఆసక్తికరంగా మొదలై.. ప్రథమార్ధం వరకు ఎంగేజ్ చేసి.. ఆ తర్వాత గాడి తప్పుతుంటాయి. ముగింపు బాలేనపుడు ముందు ఉన్న ఇంప్రెషన్ కూడా పోతుంది. ఇంకో రకం సినిమాలేమో సాధారణంగా మొదలై.. సగం వరకు ఇబ్బందికరంగా సాగుతాయి. కానీ మధ్యలో ఊపందుకుని ముగింపులో మెప్పిస్తాయి. అప్పుడు ముందు జరిగిన తప్పులను కూడా మన్నించేయొచ్చని అనిపిస్తుంది. 'బెదురులంక 2012' రెండో కోవకు చెందిన సినిమానే. యుగాంతం వార్తలను చూసి భయపడే ఒక మారుమూల పల్లెటూరి నేపథ్యంలో సాగే ఒక విభిన్న ప్రయత్నం 'బెదురులంక'. ఒక దశ వరకు మామూలుగా సాగే ఈ సినిమా ప్రయాణం.. ఉన్నట్లుండి క్రేజీ రైడ్ లాగా మారుతుంది. ఒక ముప్పావుగంట ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తుతూ కడుపుబ్బ నవ్వించే 'బెదురులంక' పైసా వసూల్ అనిపిస్తుంది. కానీ ఈ క్రేజీ రైడ్ మొదలయ్యే వరకు మాత్రం కొంచెం సహనంతో ఉండాలి.
మూఢ నమ్మకాలతో ఉండే పల్లెటూరి జనాలను.. ఇంకొన్ని రోజుల్లో మొత్తం ప్రపంచం అంతం అయిపోతుందని బలంగా నమ్మిస్తే వాళ్ల ప్రవర్తన ఎలా ఉంటుందనే ఆలోచన చుట్టూ సాగే సినిమా 'బెదురులంక'. మిగతా ప్రపంచంతో సంబంధం లేనట్లుగా ఒక నది అవతల విడిగా ఉండే ఊరిని ఈ కథకు నేపథ్యంగా ఎంచుకోవడం తెలివైన ఆలోచన. పైన పటారం లోన లొటారం అన్నట్లుగా ఉండే ఓ పెద్ద మనిషి.. ఒక దొంగ బాబా.. ఒక ఫేక్ పాస్టర్ సాయంతో ఊరి జనాలను యుగాంతం పేరుతో భయపెట్టి లోబరుచుకునే తీరును ఆసక్తికరంగా సాగుతుంది. 2012లో అంటే మరీ పాత రోజులేమీ కావు. యుగాంతం పేరు చెప్పి ఒక ఊరు మొత్తాన్ని మోసం చేయడం సాధ్యమా అనే లాజిక్ తలెత్తకుండా.. కన్సిన్సింగ్ గా అనిపించేలా ఈ ఎపిసోడ్ ను డీల్ చేశాడు దర్శకుడు. ఐతే ప్రథమార్ధంలో పెద్దగా హడావుడి లేకుండా స్తబ్దుగా సాగిపోయే కథనం.. ఏ విశేషం లేకుండా సాగిపోయే కొన్ని సీన్లు బోరింగ్ గా అనిపిస్తాయి. కొన్ని సీన్లు అక్కడక్కడా నవ్వించినా.. ప్రథమార్ధం అయితే మామూలుగానే అనిపిస్తుంది.
'బెదురులంక' ద్వితీయార్ధం కూడా మామూలుగానే మొదలవుతుంది. ఊరి జనమంతా ఒక వైపుంటే.. హీరో వాళ్లకు ఎదురు వెళ్లలేక ఊరు విడిచి వెళ్లిపోయే వరకు 'బెదురులంక'లో పెద్దగా కదలిక కనిపించదు. కానీ హీరో నుంచి కౌంటర్ ఎటాక్ మొదలయ్యాక సినిమా వేగం పుంజుకుంటుంది. ముందుకే కదలకుండా మందగమనంతో సాగుతున్న కథలోకి ఉత్ప్రేరకాల తరహాలో సత్య.. వెన్నెల కిషోర్ లను తీసుకొచ్చాక 'బెదురులంక' వేగం పుంజుకుంటుంది. ఊరికి మిగతా ప్రపంచంతో కనెక్షన్ కట్ చేసి.. నిజంగానే యుగాంతం వచ్చినట్లుగా వాళ్లను భ్రమింపజేస్తూ కంగారెత్తించే సీన్లు భలేగా పేలాయి. ఒకవైపు సత్య.. ఇంకోవైపు సత్య మంచి కామెడీ డోస్ ఇస్తూ కథనానికి ఊపు తీసుకొస్తే.. ఆ తర్వాత మిగతా పాత్రలూ లైన్లోకి వస్తాయి. ముఖ్యంగా రాజ్ కుమార్ కసిరెడ్డి చేసిన కసిరాజు పాత్ర ఒక పావుగంట చేసే హడావుడి మామూలుగా ఉండదు. క్రేజీగా అనిపించే సీన్లు.. డైలాగులు నవ్వులు పండిస్తాయి. కొన్ని చోట్ల అడల్ట్ డోస్ ఎక్కువైనట్లు అనిపించినా యూత్ కు అది పెద్ద సమస్య కాదు. మనిషి రేపటి గురించి భయపడటం మానేస్తే.. తన సహజ స్వభావంతో.. నిజాయితీగా బతికితేనే ఆనందంగా ఉంటాడనే సందేశాన్ని సుగర్ కోటెడ్ స్టయిల్లో చెప్పిన విధానం బాగుంది. హీరో కౌంటర్ ఎటాక్ మొదలుపెట్టిన దగ్గర్నుంచి మొదలయ్యే టెంపో.. చివరి వరకు కొనసాగింది. చివర్లో స్పీడ్ బ్రేకర్ లాగా వచ్చి పడే పాట తప్ప అంతా బాగుంది. ముందే అన్నట్లు తొలి గంటన్నరలో అయితే 'బెదురులంక' ప్రేక్షకులను కొంచెం బెదిరిపోయేలా చేస్తుంది. చివరి ముప్పావుగంటలో మాత్రం నవ్వులు అదుర్స్ అనిపిస్తాయి. కాబట్టి ఛాయిస్ ప్రేక్షకులదే.
నటీనటులు:
శివ పాత్రలో కార్తికేయ మెప్పించాడు. తన లుక్స్ ఆ పాత్రకు ఎసెట్. స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఓకే. ఇలాంటి వైవిధ్యమైన కథలకు అతను బాగానే సూటవుతాడు. హీరో కాబట్టి సినిమా అంతా తనే కనిపించాలని చూడకుండా ముఖ్య పాత్రధారుల్లో ఒకడిలా కనిపించాడు కార్తికేయ. కథలో కీలకమైన సన్నివేశాల్లో అతను రాణించాడు. హీరోయిన్ నేహా శెట్టి కనిపించిన కొన్ని సీన్లలో గ్లామర్ విందు చేసింది. ఆమెకు కూడా స్క్రీన్ టైం తక్కువే. ద్వితీయార్ధంలో ఆమె ఉందంటే ఉంది అన్నట్లు కనిపించింది. అజయ్ ఘోష్ అత్యంత కీలకమైన పాత్రలో అదరగొట్టాడు. అతడికిది కెరీర్లో గుర్తుండిపోయే పాత్ర. శ్రీకాంత్ అయ్యంగార్ బ్రహ్మం పాత్రలో బాగా పెర్ఫామ్ చేశాడు. కొన్ని సీన్లలో అతడి నటన ఆశ్చర్యపరుస్తుంది. రామ్ ప్రసాద్ కూడా నవ్వించాడు. వెన్నెల కిషోర్.. సత్య ద్వితీయార్ధంలో మెరుపుల్లా వచ్చి కనిపించినంత సేపూ నవ్వించారు. రాజ్ కుమార్ కసిరాజు పెర్ఫామెన్స్ పెద్ద సర్ప్రైజ్. ద్వితీయార్ధంలో కాసేపు అతను అందరినీ పక్కన నెట్టేశాడు. దర్శకుడు అతణ్ని బాగా వాడుకున్నాడు. మిగతా నటీనటులంతా ఓకే.
సాంకేతిక వర్గం:
మణిశర్మ ఈ సినిమాలో కొత్త సౌండ్స్ ఇచ్చాడు. అతడి మార్కు చూపించకుండా.. కథకు తగ్గట్లుగా ఒక డిఫరెంట్ స్టయిల్లో బ్యాగ్రౌండ్ స్కోర్ చేశాడు మణి. నేపథ్య సంగీతం ఒక కొత్త ఫీల్ ఇస్తుంది. పాటలు ఏమంత గొప్పగా లేవు. హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సాంగ్ ఒకటి బాగుంది. మిగతావన్నీ సోసోగా అనిపిస్తాయి. సాయిప్రకాష్ ఉమ్మడిసింగు.. సన్నీ కూరపాటి అందించిన ఛాయాగ్రహణం బాగుంది. విజువల్స్ ఆద్యంతం ఆకట్టుకుంటాయి. ఆర్ట్ వర్క్ బాగుంది. నిర్మాణ విలువలు సినిమాకు సరిపడా ఉన్నాయి. ఇలాంటి సినిమాలను ప్రొడ్యూస్ చేయడం రిస్కుతో కూడుకున్నదే. ఇందుకు నిర్మాతను అభినందించాల్సిందే. దర్శకుడు క్లాక్స్ అరంగేట్రంలో ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేశాడు. ఇప్పటి యువ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లు కామెడీ పండించగలడని అర్థమవుతుంది. కాకపోతే నరేషన్ కొంచెం స్లో. ప్రథమార్ధంలో కథనాన్ని పరుగులు పెట్టించలేకపోయాడు. పకడ్బందీ స్క్రీన్ ప్లే చేసుకోలేకపోయాడు. కానీ సెకండాఫ్ లో వచ్చే క్రేజీ ఎపిసోడ్ తో రచయితగా.. దర్శకుడిగా అతను మార్కులు కొట్టేశాడు.
చివరగా: బెదురులంక.. లేజీగా మొదలై క్రేజీగా ముగిసింది
రేటింగ్- 2.5/5