దేవర టీం.. డ్రోన్ ఎంత పని చేసింది!
మోద కొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది.
By: Tupaki Desk | 7 May 2024 3:46 AM GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ 'దేవర' మొదటి భాగం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా, అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పెండింగ్ చిత్రీకరణ అల్లూరి జిల్లాలో జరుగుతోంది. అయితే అడవిలో షూటింగ్ చేస్తుండగా చిత్రయూనిట్ పై తేనెటీగల దాడి జరిగిందని తెలుస్తోంది. మొత్తం 18 మందిని ఆస్పత్రిలో చేర్చారు. మోద కొండమ్మ పాదాల వద్ద షూటింగ్ జరుగుతుండగా ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. ఒక ఫైట్ సీన్ చిత్రీకరణలో భాగంగా డ్రోన్ ఎగురవేయగా ఆ శబ్ధానికి తేనెటీగలు ఎగిరాయి. అవి చిత్రయూనిట్ పై దాడి చేసాయని తెలుస్తోంది.
దేవర చిత్రబృందంపై తేనెటీగల దాడిని నెటిజనులు అపోకలిప్టో (హాలీవుడ్ చిత్రం) తేనెటీగల దాడిగా అభివర్ణిస్తున్నారు. అపోకలిప్టో చిత్రంలో శత్రువుల భారి నుంచి తప్పించుకునే క్రమంలో కథానాయకుడు అడవిలోకి వెళ్లాక చాకచక్యంగా వ్యవహరిస్తాడు. తేనెటీగలతో ప్రత్యర్థిపై తెలివిగా దాడి చేయిస్తాడు. ఇక్కడ అలాంటి సన్నివేశం చిత్రీకరించడం లేదు కానీ, తేనెటీగల దాడితో 'దేవర' టీమ్ ఖంగు తిందని చెప్పాలి.
ఎన్టీఆర్ బర్త్ డే గిఫ్ట్?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు బర్త్ డే గిఫ్ట్ ఇస్తాడని అభిమానులు వేచి చూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజున దేవర ఫస్ట్ సింగిల్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఇంతలోనే కొరటాల శివ ఒక ప్రకటన చేయగా దానిపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్‌కి, ఆయన అభిమానులకు, తనకు కూడా 'దేవర' చాలా ప్రత్యేకమైన సినిమా అవుతుందని కొరటాల అన్నారు. తన అభిమానులు గర్వించేలా ఉంటుందని ఎన్టీఆర్ వ్యాఖ్యానించిన తర్వాత కొరటాల వ్యాఖ్యతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ' దేవర' ఫ్రాంఛైజీ నుంచి మొదటి భాగం అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ కపూర్ ఇందులో కథానాయిక. ఈ సినిమాలో తన పాత్ర పేరు తంగం. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కళ్యాణ్ రామ్ సమర్పణలో ఈ చిత్రానికి సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో శ్రీకాంత్, షైన్ టామ్ చాకో కీలక పాత్రలు పోషిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్ కాగా, సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.