ఫ్రైడే థియేటర్లలో బాక్సాఫీస్ సందడికి బ్రేక్
ప్రేక్షకులకు పెద్దగా తెలియని వారు నటించిన సినిమాలే ఎక్కువగా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి.
By: Tupaki Desk | 9 Oct 2023 5:26 AM GMTప్రతి శుక్రవారం థియేటర్ల వద్ద ఉండే హంగామానే వేరు. కారణం నచ్చిన స్టార్ హీరో సినిమా సందడి చేస్తుంటే దాని కోసం థియేటర్ల వద్ద అభిమానులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. బ్యానర్లు, స్క్రీన్ ముందు పేపర్ కటింగ్స్ చల్లెస్తూ థియేటర్ల వద్ద, లోపల ఓ పండగ వాతావరణం కనిపిస్తూ వుంటుంది. అయితే ఈ ఫ్రైడే బాక్సాఫీస్ వద్ద సందడికి బ్రేక్ పడబోతోంది. కారణం ఇప్పటి వరకు మీడియం రేంజ్ సినిమాలన్ని బాక్సాఫీస్ వద్ద హల్ చల్ చేశాయి. అయితే అందులో ఒకటి అర మాత్రమే సక్సెస్ అనిపించుకున్నాయి.
గత వారం చాలా వరకు భారీ సినిమాల నుంచి మీడియం రేంజ్ సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. కానీ వాటన్నింటిలో సితార ఎంటర్ టైన్‌మెంట్ వారు నిర్మించిన 'మ్యాడ్' మాత్రమే సక్సెస్ అనిపించుకుని కాసుల వర్షం కురిపిస్తోంది. మూడు రోజులకు గానూ 'మ్యాడ్' వరల్డ్ వైడ్‌గా రూ.8.4 కోట్ల గ్రాస్‌ని రాబట్టి ఆశ్చర్యపరిచింది. ఇదిలా ఉంటే వచ్చే శుక్రవారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయి?..ఏ రేంజ్‌లో సందడికి రెడీ అవుతున్నాయనే చర్చ మొదలైంది. అయితే ఈ ఫ్రైడే మాత్రం చెప్పుకోదగ్గ సినిమాలేవీ రావడం లేదు.
ప్రేక్షకులకు పెద్దగా తెలియని వారు నటించిన సినిమాలే ఎక్కువగా ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. తంతిరం చాప్టర్ 1 టేల్స్ ఆఫ్ శివకాశి, మధురపూరి గ్రామం అనే నేను, రాక్షస కావ్యం, ప్రేమ యుద్ధం, ఒక్కడే 1 వెంకన్న ఆన్ డ్యూటీ వంటి సినిమాలు అక్టోబర్ 13 శుక్రవారం రిలీజ్ అవుతున్నాయి. ఇందులో ఏ సినిమాకు కూడా పెద్దగా బజ్ లేదు. అసలు రిలీజ్ అవుతున్నాయనే సమాచారం కూడా ప్రేక్షకుడికి లేదు. తరువాత వారం భారీ సినిమాలు బాక్సాఫీస్‌పై దండయాత్రకు రెడీ అవుతుండటంతో ఊరూ పేరూ లేని సినిమాలు ఈ శుక్రవారంని రిజర్వ్ చేసుకున్నాయి. వీటితో పాటు హిందీ డబ్బింగ్ సినిమాలు కూడా పోటీపడుతున్నాయి. కానీ వాటి కోసం ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే.
ఇందులో తమిళ సినిమా కూడా ఉంది. జయం రవి, నయనతార నటించిన థ్రిల్లర్ 'గాడ్' కూడా వచ్చేస్తోంది కానీ దీనిపై కూడా ఎలాంటి బజ్ లేదు. వచ్చే వారం టైగర్ నాగేశ్వరరావు, భగవంత్ కేసరి, లియో, గణపథ్ వంటి భారీ క్రేజీ సినిమాలు రానుండటంతో ఈ శుక్రవారం ప్రేక్షకులు థియేటర్లకు రావడం కష్టమే అనే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ సందడికి ఈ వారం బ్రేక్ పడినట్టేనని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.