బెంగాల్ చిత్ర పరిశ్రమలోనూ హేమ కమిటీ!
బెంగాలీ చిత్ర పరిశ్రమలో కూడా ఇలాంటి కమిటీ వేసే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఆమె కోరారు.
By: Tupaki Desk | 27 Aug 2024 12:05 PM GMTమలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం రేపిన వేళ మా ఇండస్ట్రీలో కూడా ఇలాంటి కమిటీ వేసి లైంగిక దాడుల నుంచి రక్షించండి అంటూ తాజాగా నటి రీతాభరీ చక్రవర్తి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేసారు. దీనికి సంబంధించి నటి ఫేస్ బుక్ వేదికగా ఓ సుదీర్గ పోస్ట్ పెట్టారు. బెంగాలీ చిత్ర పరిశ్రమలో కూడా ఇలాంటి కమిటీ వేసే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని ఆమె కోరారు.
లైంగిక వేధింపుల కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవాలని పోస్ట్ లో పేర్కొంది. తనతో పాటు, తన తోటి వారిని కూడా దర్శక, నిర్మాతల చేతుల్లో భయానక అనుభవాలు ఎదురయ్యాయని తెలిపారు. అయితే సదరు నటి ప్రత్యేకంగా ఏ ఒక్కరిపై లైంగిక ఆరోపణలు చేయలేదు. కేవలం పరిశ్రమలో ఇలాంటి పరిస్థితులు మాత్రమే ఉన్నాయి అన్న అంశాన్ని హైలైట్ చేసింది. అలాగే లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తులే జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనకు వ్యతిరేకంగా జరుగుతోన్న నిరసనల్లో ఎలాంటి సిగ్గు లేకుండా పాల్గొనడం ఆశ్చర్యపరిచిందన్నారు.
దీంతో ఇప్పుడా లేఖ నెట్టింట వైరల్ గా మారింది. ఆమె లేఖకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. అసలే బెంగాల్ కొన్ని రోజులుగా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటనతో అతలాకుతలమవుతోంది. పెద్ద ఎత్తున నిరసనలు, ర్యాలీలు దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. సీబీఐ కేస్ దర్యాప్తు చేస్తున్నా నిరనల జోరు ఏమాత్రం తగ్గలేదు. కేసులో ఎన్నో కొత్త కోణాలు తెరపైకి రావడంతో దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
అప్పట్లో బాలీవుడ్ లో మొదలైన మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనమైందో తెలిసిందే. చివరికి హాలీవుడ్ కి సైతం చేరింది. అప్పటి నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీపై తరుచూ లైంగిక ఆరోపణలు వెల్లు వెత్తుతూనే ఉన్నాయి. తాజాగా మలయాళ ఇండస్ట్రీ ఉదంతం సంచలనమవ్వడంతో సినీ పరిశ్రమపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.