Begin typing your search above and press return to search.

రెడీ ఫర్‌ రిలీజ్‌... నిహారిక యమ స్పీడ్‌

ఇప్పటి వరకు కమిటీ కుర్రాళ్లు సినిమా రూ.17.5 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   27 Aug 2024 11:30 AM GMT
రెడీ ఫర్‌ రిలీజ్‌... నిహారిక యమ స్పీడ్‌
X

మెగా ఫ్యామిలీ నుంచి నటిగా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి, షార్ట్‌ ఫిల్మ్స్, వెబ్‌ సిరీస్ లను నిర్మించడం ద్వారా అభిరుచి గల నిర్మాత అనిపించుకున్న నిహారిక ఇటీవల కమిటీ కుర్రాళ్లు సినిమాతో పూర్తి స్థాయి నిర్మాతగా మారింది. అంతా కొత్తవారితో నిహారిక నిర్మించిన కమిటీ కుర్రాళ్లు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా పోటీ ఉన్నా కూడా మంచి వసూళ్లు నమోదు చేసింది. ఇప్పటి వరకు కమిటీ కుర్రాళ్లు సినిమా రూ.17.5 కోట్ల వసూళ్లు నమోదు చేసినట్లుగా సమాచారం అందుతోంది. లాంగ్‌ రన్‌ లో రూ.20 కోట్లకు వసూళ్లు చేరే అవకాశాలు ఉన్నాయి.

కమిటీ కుర్రాళ్లు ఇచ్చిన సక్సెస్ జోష్ తో నిహారిక మరిన్ని ప్రాజెక్ట్‌ లను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే బెంచ్ లైఫ్ అనే వెబ్‌ సిరీస్‌ని రెడీ చేసింది. గతంలోనే ఈ వెబ్‌ సిరీస్‌ పూర్తి అయినా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం పక్కన పెడితే సోనీ లివ్‌ లో ఈ వెబ్‌ సిరీస్‌ని స్ట్రీమింగ్‌ చేయడానికి ముహూర్తం ఖరారు అయ్యింది. సెప్టెంబర్‌ 12న ఈ సిరీస్‌ను స్ట్రీమింగ్‌ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది.

ఇటీవలే బెంచ్ లైఫ్ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజ్ అయ్యింది. ట్రైలర్‌ లో ఆసక్తికర పాయింట్స్ ను చూపించారు. సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో ఉద్యోగుల జీవితాలను గురించి చూపిస్తూ ఈ వెబ్‌ సిరీస్ కథ సాగనుంది. తమిళ నటుడు వైభవ్‌ ను ఈ సిరీస్ లో కీలక పాత్రలో చూడబోతున్నాం. ఇంకా ఈ సిరీస్ లో రితికా సింగ్‌, ఆకాంక్ష సింగ్‌, రాజేంద్ర ప్రసాద్‌, నయన్‌ సారిక, చరణ్ పేరి, వెంకటేష్ కాకుమాను, తనికెళ్ల భరణి తో పాటు ప్రముఖ నటీనటులు నటించారు. ఈ వెబ్‌ సిరీస్‌ కు మానస శర్మ దర్శకత్వం వహించగా పీకే దండి సంగీతాన్ని అందించారు.

మెగా ఫ్యామిలీ మొత్తం కూడా కమిటీ కుర్రాళ్ల సినిమాకు ప్రమోషన్ చేశారు. పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ నిహారిక కోసం మీడియా ముందుకు వచ్చి ఆ సినిమాను ప్రమోట్‌ చేశారు. ఇప్పుడు బెంచ్ లైఫ్‌ వెబ్‌ సిరీస్ కోసం ఆ మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు స్పందిస్తారు అనేది చూడాలి. ఒక వైపు వరుసగా సినిమాలు తీయాలని భావిస్తున్న నిహారిక మరో వైపు వెబ్‌ సిరీస్ లను కూడా నిర్మించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. మెగా ఫ్యామిలీ హీరోలతో కూడా భవిష్యత్తులో నిహారిక నిర్మాణంలో సినిమాలు ఉండే అవకాశాలు ఉన్నాయని మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిహారిక మాత్రం ఇప్పటి వరకు ఆ విషయమై స్పందించలేదు.