Begin typing your search above and press return to search.

బెనిఫిట్ షోలు బంద్.. ఆ సినిమాలపై గట్టి దెబ్బ పడినట్లేనా?

అల్లు అర్జున్‌ నటించిన 'పుష్ప 2: ది రూల్‌' మూవీ ప్రీమియర్‌ షోలో భాగంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే

By:  Tupaki Desk   |   6 Dec 2024 7:03 AM GMT
బెనిఫిట్ షోలు బంద్.. ఆ సినిమాలపై గట్టి దెబ్బ పడినట్లేనా?
X

అల్లు అర్జున్‌ నటించిన ‘పుష్ప 2: ది రూల్‌’ మూవీ ప్రీమియర్‌ షోలో భాగంగా హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌ వద్ద బుధవారం రాత్రి తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ నిర్ణయం భారీ సినిమాల ఓపెనింగ్స్ పై గట్టి ప్రభావం చూపించే అవకాశం ఉంది.

టాలీవుడ్ లో స్టార్ హీరోలు నటించే పెద్ద సినిమాలకు ప్రీమియర్ షోలు, స్పెషల్ బెనిఫిట్ షోలు వేయడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. కాకపోతే దాని వెనక ఉద్దేశం వేరు కానీ, రానురాను ఈ ప్రత్యేక అనుమతులను దుర్వినియోగం చేయడం, క్యాష్ చేసుకోవడం మొదలైంది. ఇటీవల కాలంలో మాత్రం భారీ ఓపెనింగ్స్ తెచ్చుకోడానికే నిర్మాతలు బెనిఫిట్ షోలకు అనుమతి తెచ్చుకుంటున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో బెనిఫిట్ షోలను నిషేధిస్తున్నామని సినిమాటోగ్రఫీ మినిస్టర్ ప్రకటించడం ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది. స్పెషల్ షోలు రద్దు చేయడమంటే భారీ బడ్జెట్ తో సినిమాలు తీసే నిర్మాతలకు పెద్ద ఎదురు దెబ్బ తగిలినట్లే అవుతుంది.

జనవరిలో సంక్రాంతి పండక్కి పలు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్', నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్', వెంకటేష్ చేసిన 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి క్రేజీ చిత్రాలు రెండు రెండు రోజుల గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి. వాటిల్లో దిల్ రాజు బ్యానర్ లో రూపొందుతున్న 'గేమ్ ఛేంజర్' చిత్రానికి భారీ బడ్జెట్ ఖర్చు చేస్తున్నారు. కాబట్టి టికెట్ రేట్ల హైక్స్, ప్రీమియర్ స్పెషల్ షోల అవసరం ఉంటుంది. మెగా ఫ్యాన్స్ సైతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున బెనిఫిట్ షోలు వెయ్యాలని కోరుకుంటున్నారు.

'పుష్ప 2' చిత్రానికి అన్ని వెసులుబాట్లు దక్కడంతో, 'గేమ్ ఛేంజర్' & 'డాకు మహారాజ్' సినిమాలకు అంత కాకపోయినా ఎంతో కొంత అదనపు ప్రయోజనం చేకూరుతుందని అభిమానులు భావించారు. కానీ ఇప్పుడేమో నైజాంలో మొత్తానికే ప్రత్యేక షోలు బంద్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. బెనిఫిట్ షోలు లేకుండా కేవలం రెగ్యులర్ షోలతోనే ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అవ్వడం అంటే, భారీగా వచ్చే రెవిన్యూకి గండి పడినట్లే. ముఖ్యంగా ఈ నిర్ణయం ఓపెనింగ్స్ తో రికార్డులు బ్రేక్ చెయ్యాలనుకునే స్టార్ హీరోల సినిమాలపై ప్రభావం చూపిస్తుందనడంలో సందేహం లేదు.

నిజానికి గతంలో కొన్నాళ్ళు తెలంగాణా రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు ప్రభుత్వాలు అనుమతి ఇవ్వలేదు. ఆంధ్రప్రదేశ్ లో అర్థరాత్రి షోలు, ఫ్యాన్స్ షోల హడావిడి ఉండేది కానీ, నైజాంలో మాత్రం ఈ షోలు ఉండేవి కాదు. కానీ ఆ తర్వాత రోజుల్లో ఇక్కడ కూడా స్పెషల్ షోలు వేయడం అలవాటు అయింది. కాకపోతే ఎప్పుడూ ఇలాంటి సంఘటనలు జరగలేదు. ఇప్పుడు కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో 'పుష్ప 2' బెనిఫిట్ షోలో ఈ దుర్ఘటన జరగకపోయి ఉంటే, తెలంగాణలో స్పెషల్ షోలపై బ్యాన్ ఉండేది కాదు. మరి ఈ బ్యాన్ సుదీర్ఘ కాలం ఉంటుందా?, లేదా తగిన జాగ్రత్తలు తీసుకునేలా ఆదేశాలిచ్చి మళ్లీ అనుమతులు ఇస్తారా? అనేది చూడాలి.