జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. ఉత్తమ చిత్రం రాకెట్రీ..
69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించారు.
By: Tupaki Desk | 24 Aug 2023 1:01 PM GMT69వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను గురువారం సాయంత్రం 5 గంటలకు ప్రకటించారు. పుష్ప చిత్రానికి గాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా ఎంపిక కాగా.. గంగూబాయి కతియావాడి, మిమీ చిత్రాలకు గాను అలియా భట్ - కృతి సనన్ సంయుక్తంగా ఉత్తమ నటి అవార్డును పంచుకున్నారు. రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ ఉత్తమ చలనచిత్రంగా అవార్డును గెలుచుకుంది.
జాతీయ చలనచిత్ర అవార్డులు అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులు. వీటిని దేశవ్యాప్తంగా ఉత్తమ సినిమాలను వాటిలో నటించిన కళాకారుల ప్రతిభను గౌరవించేందుకు, సాంకేతిక నిపుణుల ప్రజ్ఞకు గుర్తింపు నిచ్చేందుకు ప్రతి సంవత్సరం ప్రకటిస్తారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ప్రకారం జాతీయ చలనచిత్ర అవార్డులు ''సౌందర్యం సాంకేతిక నైపుణ్యం .. సామాజిక ఔచిత్యం కలిగిన చిత్రాల నిర్మాణాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.
ఈ సంవత్సరం జై భీమ్, మిన్నల్ మురళి, తలైవి, సర్దార్ ఉదం, 83, పుష్పా ది రైజ్, షేర్షా, ది గ్రేట్ ఇండియన్ కిచెన్, గంగూబాయి కతియావాడి , నాయట్టు, రాకెట్రీ వంటి అనేక చిత్రాలు అవార్డుల కోసం పోటీ పడ్డాయి.
గత అవార్డుల్లో సూర్య- అపర్ణ బాలమురళి..68వ జాతీయ చలనచిత్ర అవార్డులలో తమిళ చిత్రం సూరరై పొట్రు (ఆకాశం నీ హద్దురా) ఐదు విభాగాలలో అవార్డులు గెలుచుకుంది - ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ , ఉత్తమ నటుడు- సూర్య, ఉత్తమ నటి అపర్ణా బాలమురళి, ఉత్తమ సంగీత దర్శకత్వం (స్కోర్) GV ప్రకాష్ కుమార్, ఉత్తమ స్క్రీన్ ప్లేకి సుధా కొంగర అవార్డులు అందుకున్నారు.
స్క్రీన్ ప్లే తో పాటు ఈ చిత్రానికి సుధ కొంగర దర్శకత్వం కూడా వహించారు. సూర్య తన ఉత్తమ నటుడి విజయాన్ని తానాజీ నటుడు అజయ్ దేవగన్‌తో షేర్ చేసుకున్నాడు. ఆశా పరేఖ్‌ను 2022లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించారు.