భానుప్రియపై బాలీవుడ్ లో రాజకీయం!
వైవిథ్యమైన పాత్రలతో నటిగా సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించారు. సౌత్ లో దాదాపు అన్ని భాషల్లోనూ నటించారు. హిందీలో కూడా నటించారు.
By: Tupaki Desk | 7 Feb 2025 12:30 PM GMTఅలనాటి అందాల నటి భాను ప్రియ గురించి పరిచయం అవసరం లేదు. ఎన్నో చిత్రాల్లో నటించి నటిగా తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. దాదాపు అన్ని భాషల్లోనూ సినిమాలు చేసారు. వైవిథ్యమైన పాత్రలతో నటిగా సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించారు. సౌత్ లో దాదాపు అన్ని భాషల్లోనూ నటించారు. హిందీలో కూడా నటించారు. సౌత్ లో కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో భాను ప్రియ బాలీవుడ్ లో `దోస్తీ దుష్మానీ` సినిమాతో 1986 లో లాంచ్ అయ్యారు.
'ఇన్సాప్ కీ పుకార్', 'ఖుడ్ జార్జ్', 'మార్ మితేంగే', 'తమాచా' ,' సూర్య', 'గరీబాన్ కా దాతా' లాంటి చిత్రాలు చేసారు. అక్కడ నటిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. కానీ అక్కడ మాత్రం సౌత్ లో ఫేమస్ అయినంతగా వెలుగులోకి రాలేదు. అయితే బాలీవుడ్ లో భానుప్రియ రాణించలేకపోవడానికి గల కారణాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె సోదరి శాంతి ప్రియ రివీల్ చేసారు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో నా సోదరికి ప్రత్యేక స్థానం ఉంది. విభిన్న చిత్రాల్లో నటించి నిరూపించుకుంది.
ఆమెని శివాజీ గణేషన్ తో పోల్చేవారు. బాలీవుడ్ కి అడుగు పెట్టిన సమయంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కుంది. అమెకు అవకాశాలు రాకుండా చాలా రాజకీయాలు చేసారు. అందుకు గానూ తను ఎంతో బాధపడింది. దక్షిణాదిలో బిజీగా ఉన్నా ముంబై వెళ్లి హోటల్ లో ఖాళీగా కూర్చోవడం తనకెంత మాత్రం నచ్చేది కాదు. అందుకే హిందీలో కొన్ని సినిమాలు చేసి మళ్లీ సౌత్ ఇండస్ట్రీకి వచ్చేసింది. ఆరోజుల్లో నటీనటులు పారితోషికం తగ్గించుకునే విషయంలో వెనకడుగు వేసేవారు కాదు.
80-90 కాలంలో సినిమాకు అనుగుణంగా డిమాండ్ చేసి తీసుకునే వాళ్లం. అయితే తక్కువ బడ్జెట్ లో మంచి కథలు తెరకెక్కించాలనుకునే వాళ్ల విషయంలో పారితోషికం తగ్గించుకునే వాళ్లం. తెలుగులో చాలా సినిమాలకు పారితోషికం తగ్గించుకున్నాను. కమర్శియల్ సినిమాల్లో నాలుగు పాటలకే పరిమితం అవుతున్నానంటే పారితోషికం అధికంగా డిమాండ్ చేసే వాళ్లం` అని తెలిపారు.