Begin typing your search above and press return to search.

'భారతీయుడు 2' - హిట్టు కొట్టకపోతే కష్టమేనా?

దాదాపు 28 ఏళ్ళ కిందట కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా 'భారతీయుడు 2' రూపొందింది.

By:  Tupaki Desk   |   8 July 2024 2:30 PM GMT
భారతీయుడు 2 - హిట్టు కొట్టకపోతే కష్టమేనా?
X

విశ్వనటుడు కమల్ హాసన్, అగ్ర దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'ఇండియన్ 2'. దాదాపు ఐదారేళ్ల పాటు నిర్మాణం జరుపుకున్న ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్.. ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జులై 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. తెలుగులో 'భారతీయుడు 2' పేరుతో విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో కమల్ అండ్ టీం తెలుగు ప్రమోషన్స్ మీద దృష్టి పెట్టారు. హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడమే కాదు, ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. దీంతో ఇప్పటి వరకూ ఈ మూవీ పరిస్థితి ఎలా ఉన్నా, ఇప్పుడిప్పుడే మెల్లగా బజ్ క్రియేట్ అవడం స్టార్ట్ అయింది.

దాదాపు 28 ఏళ్ళ కిందట కమల్ హాసన్, శంకర్ కలయికలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా 'భారతీయుడు 2' రూపొందింది. సిద్ధార్థ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ఎస్‌.జె.సూర్య, ప్రియా భవానీ శంకర్, బాబీ సింహా లాంటి స్టార్ క్యాస్టింగ్ ఈ మూవీలో భాగమయ్యారు. ఈ మూవీని కంప్లీట్ చెయ్యడానికి టీం ఎన్నో ఒడిదుడుకులను, కష్టనష్టాలను ఫేస్ చేసింది. షూటింగ్ ప్రారంభంలోనే ఓ భారీ ప్రమాదం జరిగి ప్రాణ నష్టం కలగడం.. ఆ తర్వాత లైకా ప్రొడ్యూసర్స్ తో దర్శకుడికి విబేధాలు రావడం.. శంకర్ 'గేమ్ ఛేంజర్' ను పట్టాలెక్కించడంతో అసలు ఈ సినిమా బయటకు వస్తుందా? అనే అనుమాలు వచ్చాయి. కానీ అన్నిటినీ ఎదుర్కొని మూవీని ఫినిష్ చేసి రిలీజ్ కు రెడీ చేసారు.

'భారతీయుడు 2' సినిమా హిట్టవ్వడం డైరెక్టర్ శంకర్ కు చాలా అవసరం. ఎందుకంటే 'రోబో' తర్వాత ఆయన ఆ స్థాయిలో మరో విజయాన్ని అందుకోలేదు. 'స్నేహితుడు', 'ఐ', '2.0' చిత్రాలు అంచనాలు అందుకోవడంలో విఫలం అయ్యాయి. దీంతో దర్శకుడి సామర్ధ్యాన్ని వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రంతో హిట్టు కొట్టి తన స్టామినా ఏంటో మరోసారి నిరూపించాల్సి ఉంది. అంతేకాదు దీని తర్వాత ఆయన్నుంచి రాబోయే 'గేమ్ ఛేంజర్' పై అంచనాలు ఏర్పడాలన్నా ఈ సక్సెస్ కీలకంగా ఉంటుంది. అందుకే శంకర్ తో పాటుగా రామ్ చరణ్ టీమ్, ఫ్యాన్స్ అంతా కమల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు.

మరోవైపు కమల్ హాసన్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ను కంటిన్యూ చెయ్యాలని భావిస్తున్నారు. 'విక్రమ్' 'కల్కి 2898 AD' చిత్రాలతో భారీ విజయాలు రుచి చూసిన యూనివర్సల్ స్టార్.. ఇప్పుడు 'ఇండియన్ 2' ను అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నారు. విజయ్, అజిత్ కుమార్ లాంటి హీరోల్లా కాకుండా ఆయనే స్వయంగా రంగంలోకి దిగి ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 'భారతీయుడు 2' హిట్టయితేనే 'భారతీయుడు 3' కోసం అందరూ ఎదురు చూస్తారు కాబట్టి, కమల్ తన సినిమాని జనాల్లోకి తీసుకెళ్లడానికి గట్టిగానే ప్రచారం చేస్తున్నారు.

ఇక బొమ్మరిల్లు సిద్ధార్ట్ సరైన హిట్టు కొట్టి చాలా కాలమే అయింది. 'చిన్ని' సినిమాకి విమర్శకుల ప్రశంసలు దక్కినా వసూళ్లు రాలేదు. అందుకే 'ఇండియన్ 2' తో తన ఫేట్ మార్చుకోవాలని చూస్తున్నారు. మూడేళ్ళ క్రితమే టాలీవుడ్ కు దూరమైనా రకుల్ ప్రీత్ సింగ్.. ఈ సినిమాతో మళ్ళీ తెలుగు తమిళ భాషల్లో అవకాశాలు అందుకోవాలని చూస్తోంది. ఇలా దాదాపు ఈ చిత్రానికి పని చేసిన వారందరికీ ఈ విజయం అవసరం ఉంది. మరి బాక్సాఫీస్ వద్ద ఏం జరుగుతుందో వేచి చూడాలి.