ఇండస్ట్రీ సమస్యలు పరిష్కరించడానికి మేం సిద్దం!
తెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పేరిట సినీ ప్రముఖులకు అవార్డులు అందిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 15 Oct 2024 7:37 AM GMTతెలంగాణ రాష్ట్రంలో గద్దర్ పేరిట సినీ ప్రముఖులకు అవార్డులు అందిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిపై ఇండస్ట్రీ పెద్దలు తమ అభిప్రాయాలు కూడా పంచుకోవాలని సూచించారు. ప్రతిగా మెగాస్టార్ చిరంజీవి కూడా మంచి ఆలోచనగా ప్రోత్సహించారు. అయితే మిగతా వారెవ్వరూ స్పందించలేదు. ఇండస్ట్రీ నుంచి స్పందించాల్సిన వారు చాలా మంది ఉన్నా? వాళ్లంతా మౌనంగా ఉన్నట్లే ప్రచారం సాగుతోంది.
అంతకు ముందు రేవంత్ రెడ్డి కూడా మౌనంగా ఉన్నారనే అసహనాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో తాజాగా సోమవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన గద్దర్ సినీ అవార్డుల కమిటీ మొదటి సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. `తెలంగాణ భావోద్వేగాలను తన ఆట , పాట ద్వారా ప్రపంచానికి పరిచయం చేసిన మహో న్నత వ్యక్తి గద్దర్. ఆయన తెలంగాణ కి ప్రతిరూపం.
ఇక్కడ సంస్కృతిని చాటి చెప్పిన వ్యక్తి . `పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా` అంటూ సమాజాన్ని తెలంగాణ రాష్ట్ర సాధనకు సమాయత్తం చేసిన గొప్ప యుద్ధనౌక. శతాబ్ద కాలంలో ఆయన లాంటి వ్యక్తి పుడతారని నేను అనుకోవడం లేదు. ప్రపంచంలో అన్ని సమస్యలపై ఆయన ప్రజలను పాటలతో కదిలించారు. రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసిన గద్దర్ లాగే పాడాలని ప్రయత్నిస్తుంటారు.
ఆయనను అనుకరిస్తుంటారు. అడవి, సినిమా, మానవులు, రాజ్యాంగం అన్నిట్లోనూ గద్దర్ తనదైన ముద్ర వేసారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదగాలి. సినీ పరిశ్రమలకు వచ్చే ఎలాంటి సమస్యను అయినా వినడానికి, పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం` అన్నారు.