మళ్ళీ హిందీలో ఎందుకు భోళా?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది
By: Tupaki Desk | 15 Aug 2023 4:31 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన భోళా శంకర్ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చి డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. భారీ బడ్జెట్ తో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. మెహర్ రమేష్ మళ్ళీ దశాబ్దం తర్వాత మెగా ఫోన్ పట్టి చిరంజీవిని డైరెక్ట్ చేసే అవకాశం సొంతం చేసుకొని భోళా శంకర్ చేశారు.
మెగాస్టార్ తో ఉన్న బంధుత్వం కారణంగానే ఈ అవకాశం అతనికి వచ్చిందని అందరికి తెలిసిందే. అయితే మెగాస్టార్ అభిమానంతో మెహర్ రమేష్ ని నిలబెట్టాలని అతనికి అవకాశం ఇస్తే నిర్మాతకి ఇప్పుడు భారీగా నష్టం వచ్చింది. సెకండ్ ఇన్నింగ్ లో మెగాస్టార్ చిరంజీవి ఎక్కువ రీమేక్ కథల మీద ఆధారపడటం, అవి కాస్తా దెబ్బతీయడం కనిపిస్తూనే ఉంది. భోళా శంకర్ తో మరో బిగ్గెస్ట్ డిజాస్టర్ ని చిరంజీవి తన ఖాతాలో వేసుకున్నారు.
మెహర్ రమేష్ తనకి అలవాటైన బ్యాడ్ ప్రెజెంటేషన్ తో మెగా ఫ్యాన్స్ మొదటి నుంచి టెన్షన్ పడుతున్నట్లుగానే చేశారనే మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది. ఇప్పటికే తెలుగులో చాలా థియేటర్స్ లో భోళా శంకర్ ఖాళీ అయిపోయి జైలర్ సినిమా రీప్లేస్ చేసింది. అయితే ఇప్పుడు ఊహించని విధంగా మెగాస్టార్ నుంచి మరో సర్ప్రైజ్ వచ్చింది. భోళా శంకర్ హిందీ వెర్షన్ కూడా రిలీజ్ కి రెడీ అయ్యింది.
తెలుగులో రిలీజ్ కి ముందే హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా హిందీ రిలీజ్ డేట్ ని టీజర్ రిలీజ్ చేసి ఎనౌన్స్ చేశారు. ఆగష్టు 25న హిందీలో భోళా శంకర్ టైటిల్ తోనే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆర్కేడీ స్టూడియోస్ ఈ చిత్రాన్ని హిందీలో రిలీజ్ చేస్తోంది.
హిందీ వెర్షన్ టీజర్ ని కాస్తా భిన్నంగా యాక్షన్ ప్యాక్డ్ ఎలివేషన్ తో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. మరి తెలుగులో డిజాస్టర్ అయిన ఈ మూవీ హిందీ ఆడియన్స్ ని ఏమైనా ఎంటర్టైన్ చేసే అవకాశం ఉందా అనేది చూడాలి. ఏది ఏమైనా భోళా శంకర్ దెబ్బతో మెగాస్టార్ చిరంజీవి రీమేక్ కథలపై పునరాలోచన చేయాల్సిన అవసరం వచ్చిందనే మాట మెగా ఫ్యాన్స్ నుంచి ఇప్పుడు వినిపిస్తోంది.