మూవీ రివ్యూ : భోళా శంకర్
ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఇంతలోనే ఆయన్నుంచి ‘భోళా శంకర్’ సిద్ధమైంది. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు ఇది రీమేక్. పదేళ్లుగా సినిమా తీయని మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడీ చిత్రాన్ని.
By: Tupaki Desk | 11 Aug 2023 6:34 AM GMTనటీనటులు: చిరంజీవి-కీర్తి సురేష్-తమన్నా-తరుణ్ అరోరా-శ్రీముఖి-వెన్నెల కిషోర్-మురళీ శర్మ-తులసి-గెటప్ శీను తదితరులు
సంగీతం: మహతి స్వర సాగర్
ఛాయాగ్రహణం: డుడ్లే
కథ: శివ-ఆదినారాయణ
రచన: మామిడాల తిరుపతి-విక్రమ్ సిరికొండ-కన్నన్
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
కథనం-మాటలు-మార్పులు-దర్శకత్వం: మెహర్ రమేష్
ఈ సంక్రాంతికి ‘వాల్తేరు వీరయ్య’తో పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాడు మెగాస్టార్ చిరంజీవి. ఇంతలోనే ఆయన్నుంచి ‘భోళా శంకర్’ సిద్ధమైంది. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’కు ఇది రీమేక్. పదేళ్లుగా సినిమా తీయని మెహర్ రమేష్ డైరెక్ట్ చేశాడీ చిత్రాన్ని. ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘భోళా శంకర్’ విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
భోళా శంకర్ (చిరంజీవి) తన చెల్లెలు మహాలక్ష్మి (కీర్తి సురేష్)ను తీసుకుని కోల్ కతాలో అడుగు పెడతాడు. మహాలక్ష్మి మంచి ఆర్టిస్ట్. ఆమెకు మంచి కాలేజీలో సీట్ ఇప్పించి.. తను ఆ సిటీలోనే ట్యాక్సీ డ్రైవర్ గా పనికి కుదురుతాడు శంకర్. ఇలా వీరి జీవనం సాఫీగా సాగిపోతున్న సమయంలో అమ్మాయిలను కిడ్నాప్ చేసి విదేశాలకు తరలించే ఒక గ్యాంగ్ గురించి పోలీసులకు సమాచారం ఇచ్చి చిక్కుల్లో పడతాడు శంకర్. ఆ నెట్వర్క్ వెనుక ఉన్న మాఫియా శంకర్ ను టార్గెట్ చేస్తుంది. వాళ్లకు దీటుగా బదులివ్వడమే కాదు.. ఈ మాఫియాను నడిపించే పెద్ద బాసుల్లో ఒకరిని చంపేస్తాడు శంకర్. అంతటితో ఆగకుండా హత్యల మీద హత్యలు చేస్తూ వెళ్తాడు. అప్పుడే తెలుస్తుంది శంకర్ వెనుక పెద్ద లక్ష్యం ఉందని. అంతే కాక మహాలక్ష్మి.. శంకర్ చెల్లెలు కూడా కాదనే సంగతి కూడా వెల్లడవుతుంది. మరి శంకర్ ఎవరు.. మహాలక్ష్మికి అతడికి సంబంధం ఏమిటి.. అతను ఏ లక్ష్యంతో కోల్ కతాకు వచ్చాడు.. చివరికి ఆ లక్ష్యాన్ని సాధించాడా లేదా అన్నది మిగతా కథ.
కథనం-విశ్లేషణ:
ఇంటర్నెట్ విప్లవంతో ఓటీటీలు రాజ్యమేలుతున్న రోజులివి. చౌకగా మారిన డిజిటల్ సినీ వినోదం పుణ్యమా అని.. చూడ్డానికి బోలెడంత కంటెంట్ ఉంటోంది. ప్రేక్షకులు ఏది పడితే అది చూడటానికి రెడీగా లేరు ఈ రోజుల్లో. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కొత్తదనం లేని రొటీన్ మాస్ మసాలా సినిమాలంటే మామూలుగానే లైట్ తీసుకుంటున్నారు. అందులోనూ రీమేక్ సినిమా అనగానే సగం ఆసక్తి చచ్చిపోతోంది. ఒకవేళ రీమేక్ చేసినా.. ఏదో ఒక యునీక్ పాయింట్ ఉన్న సినిమాను ఎంచుకుని.. మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి.. అదనపు ఆకర్షణలేమైనా జోడిస్తే కొంత ప్రయోజనం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ పింక్.. భీమ్లా నాయక్.. బ్రో లాంటి సినిమాలతో అలాగే ట్రై చేశాడు. చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ కూడా ఈ విషయంలో కాస్త నయం. అంత కష్టపడ్డా సరే.. ఈ చిత్రాలు వేటికీ కూడా పూర్తి సంతృప్తికర ఫలితం రాలేదంటే.. రీమేక్ ల పట్ల ప్రేక్షకుల్లో ఎంత అనాసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి తరుణంలో ‘వేదాళం’ అనే పాత.. రొటీన్ మాస్ మూవీని తీసుకుని.. అందులో ఉన్న కొన్ని ఆకర్షణల్ని కూడా చెడగొట్టి.. ‘భోళా శంకర్’ రూపంలో ఒక ముతక సినిమాను అందించాడు ‘భోళా శంకర్’.
‘భోళా శంకర్’ సినిమా మొదలైన దగ్గర్నుంచి ఏదీ సానుకూలంగా కనిపించలేదు. స్వయంగా చిరు వీరాభిమానులే రీమేక్ ఎందుకు.. పైగా ‘వేదాళం’ లాంటి సినిమా ఎందుకు అని తలలు పట్టుకున్నారు. అందులోనూ శక్తి.. షాడో లాంటి ఆల్ టైం డిజాస్టర్లు తీసి.. పదేళ్లుగా మెగా ఫోన్ పట్టని మెహర్ రమేష్ తో చిరు ఎందుకు పెట్టుకుంటున్నాడు అని ఆందోళన చెందారు. ఈ సినిమా నుంచి రిలీజైన ప్రోమోలన్నీ కూడా ట్రోల్ స్టఫ్ లాగా కనిపించాయే తప్ప.. సినిమా మీద ఆసక్తిని రేకెత్తించలేకపోయాయి. ఈ నేపథ్యంలో థియేటర్లకు వచ్చిన ప్రతి ప్రేక్షకుడూ అతి తక్కువ అంచనాలతో అడుగు పెట్టి ఉంటాడు. ఆ పరిస్థితుల్లో సినిమా ఓ మోస్తరుగా ఉన్నా సరే.. పర్వాలేదు అనిపిస్తుంది. కానీ ‘భోళా శంకర్’ మాత్రం అసలు అంచనాలే పెట్టుకోని వారికి కూడా చుక్కలు చూపిస్తుంది. అంత ఔట్ డేటెడ్ స్టఫ్ తో సినిమాను నింపేశాడు మెహర్ రమేష్. ఒక సీన్ కావచ్చు.. ఒక డైలాగ్ కావచ్చు.. ఒక ఫైట్ కావచ్చు.. ఒక పాట కావచ్చు.. ఎక్కడా కూడా కొత్తదనపు ఛాయలు కనిపించకుండా.. ఔట్ టేడ్ ఫీల్ చెడకుండా.. ఆద్యంతం చాలా జాగ్రత్తగా సినిమాను నడిపించాడు మెహర్.
జనంతో నిండి ఉన్న ఒక గల్లీ.. అక్కడో సమస్య తలెత్తడం.. అప్పుడే హీరో గురించి కమెడియన్ ఒక ఇంట్రో ఇవ్వడం.. ఆ వెంటనే హీరో ఎంట్రీ ఇచ్చి ప్రమాదాన్ని తప్పించడం.. అందరూ అతణ్ని కొనియాడటం.. వెంటనే మ్యూజిక్ స్టార్ట్.. దశాబ్దాల నుంచి చూస్తున్న టెంప్లేట్ హీరో ఇంట్రడక్షన్ సెటప్ ఇది. ‘భోళా శంకర్’ ఇదే స్టయిల్లో మొదలైనపుడే మనం ఒక ఔట్ డేటెడ్ సినిమా చూడబోతున్నామని అర్థమైపోతుంది. భార్య ముందు అమాయకంగా నటిస్తూ.. తెర వెనుక కళాపోషణ చూపించి.. చివరికి భార్యకు దొరికిపోయే కమెడియన్ ట్రాకులు ఎన్ని చూడలేదు తెలుగు సినిమాల్లో. చిన్న ఛాన్స్ దొరికినా చెలరేగిపోయే వెన్నెల కిషోర్ లాంటి కమెడియన్ కూడా ఈ ట్రాక్ తో నవ్వించలేకపోయాడంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హీరో ముందు అమాయకంగా కనిపించడం.. తర్వాత ఉగ్రరూపం చూపించడం.. ఆపై అతను ఒక లక్ష్యంతో అక్కడికి వచ్చాడని తెలియడం.. ఆపై ఫ్లాష్ బ్యాక్.. ఈ సెటప్ కూడా ‘బాషా’ రోజుల నుంచి చూస్తున్నదే. రొటీన్ కథ అయినా.. కొంచెం బిగితో సన్నివేశాలు తీస్తే.. హీరో క్యారెక్టర్లో ఇంటెన్సిటీ ఉంటే.. ఎమోషన్లు వర్కవుట్ అయితే సర్దుకుపోవచ్చు.. కానీ ఒకదాని తర్వాత ఒకటి భారీ యాక్షన్ ఎపిసోడ్లు.. ఎలివేషన్ సీన్లు వచ్చి పోతుంటాయే తప్ప.. ఏవీ కూడా చిరు అభిమానుల్లో సైతం ఉత్సాహం కలిగించవు. ఏదో స్పూఫ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలిగించేలా సన్నివేశాలను చాలా తేలిగ్గా లాగించేశాడు మెహర్.
‘వేదాళం’ సగటు మాస్ సినిమానే అయినా.. అందులో కొన్ని ఎలివేషన్ సీన్లు.. ట్విస్టులు బాగానే పేలాయి. ముఖ్యంగా హీరో తనలోని మరో కోణం చూపించే సీన్ అక్కడ హైలైట్ గా నిలిచింది. విలన్లకు అతనిచ్చే షాకులు అభిమానులు అలరిస్తాయి. కానీ ఆ సీన్లను కూడా మెహర్ రమేష్ తెలుగులో సరిగా తీయలేకపోయాడు. తమిళంలో ఎఫెక్టివ్ గా ఉన్న సీన్లు కూడా ఇక్కడ సాధారణంగా తయారయ్యాయి. మామూలుగా చూస్తే నటుడిగా చిరు ముందు అజిత్ నిలవలేడు. అలాంటిది అజిత్ చూపించిన ఇంటెన్సిటీలో చిరు సగం కూడా చూపించలేకపోయాడంటే అతి దర్శకుడి వైఫల్యమే తప్ప.. చిరుది కాదు. ద్వితీయార్ధంలో వచ్చే ఒక సెంటిమెంట్ సీన్లో తప్పితే సినిమాలో ఎక్కడా ఇంటెన్సిటీ కనిపించదు. సన్నివేశాల్ని.. డైలాగులను ముందే ఊహించి చెప్పేంత రొటీన్ గా సినిమాను నడిపించాడు మెహర్ రమేష్. ‘గబ్బర్ సింగ్’ తీసినపుడు హరీష్ శంకర్ వేసుకున్నట్లు ‘మాటలు.. మార్పులు’ అని టైటిల్ కార్డ్స్ లో ఘనంగా వేసుకున్నాడు మెహర్ రమేష్. అలా టైటిల్ కార్డ్ వేసుకునేంతగా అతను చేసిన గొప్ప మార్పులు ఏవయ్యా అంటే.. హీరోయిన్ తల్లిదండ్రులు తమిళంలో గుడ్డి వాళ్లయితే తెలుగులో వాళ్లకు కళ్లు కనిపించేలా చూపించడం.. వెన్నెల కిషోర్ పాత్రకు ఒరిజినల్లో అత్త ఉంటే ఇక్కడ మామను పెట్టడం.. మాతృకలో కిడ్నాప్ చేసిన మహిళల్ని కంటైనర్లో తరలించాలని చూస్తే ఇందులో మాత్రం స్లీపర్ బస్ ఎక్కించడం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. మెగాస్టార్ కెరీర్లో ‘ఆచార్య’నే అతి పెద్ద మిస్టేక్ అనుకునేవాళ్లం. కానీ ‘భోళా శంకర్’ దాన్ని మించిన తప్పిదం అని చూసిన వాళ్లెవ్వరైనా అంగీకరిస్తారు. ఎందుకంటే ‘ఆచార్య’ ఎంత పేలవంగా నడిచినా.. కనీసం తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తి అయినా ఉంటుంది. ఇక్కడ ఆమాత్రం ఆసక్తి కూడా కలిగించని రొడ్డకొట్టుడు సినిమా ‘భోళా శంకర్’.
నటీనటులు:
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బహుశా 67 ఏళ్ల వయసులో చిరంజీవి అంత ఆకర్షణీయంగా ఏ హీరో కనిపించి ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికీ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ లుక్ పరంగా ఆకర్షణీయంగా కనిపించాడాయన. ఉత్సాహంగా డ్యాన్సులు వేశాడు. ఫైట్లు కూడా చేశాడు. కానీ ఆయన్ని ఏమాత్రం ఉపయోగించుకునే.. ఆయనకు ఉపయోగపడే సినిమా కాదిది. కొన్ని చోట్ల చిరు తన మార్కు కామెడీ టైమింగ్ చూపించాడు. సెంటిమెంట్ సీన్లలో బాా చేశఆడు. కానీ ఔట్ డేటెడ్ సీన్ల మధ్య చిరు సైతం సాధారణంగా కనిపించాడు. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ నడుము సన్నివేశాన్ని రీక్రియేట్ చేయడానికి చిరు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. మెగా అభిమానులకు సైతం ఇది రుచించకపోవచ్చు. ఇలాంటి సినిమాను రీమేక్ చేయాలనుకోవడం.. పైగా మెహర్ లాంటి దర్శకుడి చేతిలో చిరు తప్పిదమే. హీరోయిన్ తమన్నా అందంగా కనిపించింది. చిరు చెల్లి పాత్రలో కీర్తి సురేష్ బాగానే నటించింది. ఆమె వైపు నుంచి లోపమేమీ లేదు. విలన్ తరుణ్ అరోరా రొటీన్ అనిపిస్తాడు. వెన్నెల కిషోర్.. శ్రీముఖిల కామెడీ పెద్దగా వర్కవుట్ కాలేదు. మురళీ శర్మ.. తులసి.. గెటప్ శీను.. వీళ్లంతా మామూలే.
సాంకేతిక వర్గం:
ఒక సినిమా తేడా కొడితే.. అన్నీ తేడాగానే ఉంటాయనడానికి ‘భోళా శంకర్’ రుజువుగా నిలుస్తుంది. ఛలో.. భీష్మ లాంటి చిత్రాల్లో మంచి సంగీతంతో తండ్రి పేరు నిలబెట్టేలా కనిపించిన మహతి స్వర సాగర్.. చిరు సినిమాతో వచ్చిన ‘మెగా’ ఛాన్సుని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు. పాటల్లో ఒక్కటీ వారెవా అనిపించేలా లేదు. సోసోగా సాగిపోయాయి. నేపథ్య సంగీతం కూడా రొటీన్ అనిపిస్తుంది. ఒరిజినల్లో అనిరుధ్ రవిచందర్ లాగా ఎలివేషన్.. యాక్షన్ సీన్లను అతను ఎలివేట్ చేయలేకపోయాడు. డుడ్లే ఛాయాగ్రహణం ఓకే. నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయి. ఇక మెహర్ రమేష్ గురించి ఏం చెప్పాలి? ‘వేదాళం’ను అతను ఉన్నదున్నట్లు తీసినా.. అభినందించి ఉండొచ్చు. కానీ అసలే రొటీన్ మాస్ సినిమా అయిన దాన్ని.. ‘క్రింజ్’ అనుకునే స్థాయికి దించేశాడు. దర్శకుడి ప్రతిభ అంటూ చెప్పుకోవడానికి ఇందులో ఏమీ లేదు.
చివరగా: భోళా శంకర్.. పాత రీమేక్ పచ్చడి
రేటింగ్ - 1.5/5