Begin typing your search above and press return to search.

'భూల్ భులైయ్యా 3' - టాక్ ఎలా ఉంది?

అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ 3వ సినిమాకు విడుదలకు ముందు పెద్దగా హైప్ రాలేదు.

By:  Tupaki Desk   |   1 Nov 2024 6:44 PM GMT
భూల్ భులైయ్యా 3 - టాక్ ఎలా ఉంది?
X

ఈమధ్య కాలంలో హారర్ కామెడీ జోనర్ సినిమాలకు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. కంటెంట్ క్లిక్కయితే స్టార్ హీరోల రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొడుతున్నాయి. స్త్రీ 2 సినిమా ఏకంగా 870 కోట్లకు పైగా వసూళ్ళను రాబట్టింది. ఇక సక్సెస్ ఫుల్ ఫ్రాంచైజ్ లో తెరకెక్కిన 'భూల్ భులైయ్యా 3' రీమేక మూవీ నేడు థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ బాలీవుడ్ చంద్రముఖి మొదటి రెండు భాగాలకు బాగా క్రేజ్ వచ్చింది.

అనీస్ బజ్మీ దర్శకత్వం వహించిన ఈ 3వ సినిమాకు విడుదలకు ముందు పెద్దగా హైప్ రాలేదు. ఇక విడుదల అనంతరం ఏదైనా మ్యాజిక్ చేయవచ్చని అందరూ అనుకున్నారు. కానీ సోషల్ మీడియా వ్యాప్తంగా మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. కార్తీక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో ‘రూహ్ బాబా’ గా కనిపించాడు, ఈ చిత్రంలో విద్యా బాలన్, మాధురీ దీక్షిత్, త్రిప్తి దిమ్రి వంటి ప్రముఖ తారలు కూడా భాగస్వామ్యం అయ్యారు. అయితే మొదటి సినిమాకు ఇచ్చిన స్ఫూర్తిని పునరావృతం చేయడంలో ఈ సినిమా కొంత వెనుకబడినట్లు సోషల్ మీడియా టాక్‌.

కార్తీక్ ఆర్యన్ తన నటనతో మెప్పించినప్పటికీ, తొలి భాగంలో అక్షయ్ కుమార్ పోషించిన పాత్ర స్థాయికి సరిపోలేదని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అక్షయ్ స్థానంలో కార్తిక్ రూహ్ బాబా పాత్రలో సరిపోయాడని చాలామంది చెబుతున్నప్పటికీ, తొలిసినిమాలో అక్షయ్ పాత్ర సృష్టించిన మేజిక్ మిస్ అయినట్లు అనిపించిందని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

మరోవైపు, విద్యా బాలన్ తన మంజులిక పాత్రలో ఆమెలోని మ్యాజిక్ ని మళ్ళీ చూపిస్తూ ప్రేక్షకుల మదిని దోచుకుందని అభిప్రాయపడుతున్నారు. ఈ చిత్రంలో ఆమెను నిజమైన స్టార్ గా అభివర్ణిస్తూ విద్యా తన పాత్రను అత్యద్భుతంగా పునరావృతం చేసిందని ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే, మాధురీ దీక్షిత్ పాత్ర గురించి మాత్రం కొంత నిరాశ వ్యక్తమవుతోంది. ఆమె పాత్రను చాలా చిన్నగానే చూపించడం, చివరి క్షణంలో స్క్రిప్ట్ లో చేర్చినట్లుగా అనిపించడం కొన్ని విమర్శలకు దారితీసింది.

మాధురీ పాత్రకు తగినంత ప్రాధాన్యం ఇవ్వకపోవడం, ఆమె పాత్రను పకడ్బందీగా చూపలేకపోవడం ప్రేక్షకులను నిరాశపరిచింది. సినిమా కథనాన్ని సెట్ చేసుకున్న విధానం గురించి నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. కథలోని సీన్స్, ముందుగానే ఊహించదగినవిగా ఉండటంతో ప్రేక్షకులు కొంత నిరాశ చెందారు. ఇది భూల్ భులైయ్యా లానే ఉంది కానీ, హాంటెడ్ మాన్షన్ లో ఉంటే మ్యాజిక్ కాస్తా మాయమైపోయిందని ఒక నెటిజన్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ముఖ్యంగా హారర్ ఎలిమెంట్స్, కామెడీ సీన్స్ కొంతమంది ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ, మొత్తం సినిమాను చూస్తే ఆ ఫ్రాంచైజ్ బ్రాండ్ కు తగ్గట్టుగా కాంటెంట్ క్లిక్కవ్వలేదని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఫైనల్ గా కాస్త మిక్స్ డ్ టాక్ అందుకున్న భూల్ భులైయ్యా 3 బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.