స్నేహితుడికి జోడీగా స్నేహితురాలు!
వెండి తెరపై కొన్ని కాంబినేషన్లు చూడముచ్చటగా ఉంటాయి. అందులోనూ కొన్ని క్రేజీ కాంబినేషన్లు అంటే? ఇంకా ఆసక్తికరంగా అనిపిస్తుంది
By: Tupaki Desk | 11 Dec 2023 4:30 PM GMTవెండి తెరపై కొన్ని కాంబినేషన్లు చూడముచ్చటగా ఉంటాయి. అందులోనూ కొన్ని క్రేజీ కాంబినేషన్లు అంటే? ఇంకా ఆసక్తికరంగా అనిపిస్తుంది. అలాంటి జోడీల్లో కార్తీక్ ఆర్యన్- సారా అలీఖాన్ జంట కూడా ఒకటి. ఇద్దరు తొలిసారి 'లవ్ ఆజ్ కల్' లో కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అప్పటి నుంచి ఆ జోడీ అంటే బాలీవుడ్ లో ప్రత్యేకమైన క్రేజ్ ఏర్పడింది.
అందుకు మరో కారణం కూడా ఉందండోయ్. ఇద్దరు మంచి స్నేహితులు కూడా. సినిమాల్లోకి రాకముందు నుంచే స్నేహితులు కావడంతో ఇద్దరి మధ్య తెరపై కెమిస్ట్రీ కూడా అంతే అద్భుతంగా పండుతుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆ జోడీని ఎప్పుడు చూస్తామా? అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదరు చూస్తున్నారు. తాజాగా ఆ సమయం వచ్చేసినట్లు తెలుస్తోంది. 'భూల్ భులయ్య-3' కోసం ఆ ఇద్దర్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
భుల్ భులయ్య సీక్వెల్ హీరోగా కార్తీక్ ఆర్యన్ ని చాలా కాలం క్రితం ఫైనల్ చేసారు. కానీ అతనికి జోడీగా ఏ నాయికని తీసుకోవాలి? అన్న అంశంపై తర్జన భర్జన సాగుతోంది. ఈ నేపథ్యంలో సారా అలీఖాన్ అయితే బాగుంటుందని దర్శకుడు అనీస్ బజ్మీ సారాని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి క్రేజీ కాంబినేషన్ వెండి తెరపై మెరవతబోతుంది. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభిం చాలని సన్నాహాలు చేస్తున్నారు.
దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని చిత్ర వర్గాల నుంచి తెలుస్తోంది. ఈ చిత్రాన్ని భూషణ్‌కుమార్-కృష్ణకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సారా అలీఖాన్ 'యే వతన్ మేరా వతన్' చిత్రంలో నటిస్తోంది. అలాగే తెలుగు అవకాశం కోసం ఎదురు చూస్తోంది. సరైన ఛాన్స్ వస్తే స్నేహితురాలు జాన్వీ కపూర్ లా లాంచ్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది. మరి ఆ ఛాన్స్ ఎప్పుడు తలుపు తడుతుందో చూడాలి