దీపావళి బాక్సాఫీస్: టపాసుల మోత మోగించే సినిమా ఏది?
దీపావళి కానుకగా బాక్సాఫీస్ వద్ద టపాసుల మోత మోగించడానికి, ఈ నెలాఖరున నాలుగు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి.
By: Tupaki Desk | 28 Oct 2024 5:21 AM GMTదీపావళి కానుకగా బాక్సాఫీస్ వద్ద టపాసుల మోత మోగించడానికి, ఈ నెలాఖరున నాలుగు సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. వాటిల్లో రెండు స్ట్రెయిట్ తెలుగు చిత్రాలు ఉంటే.. రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి. ఇప్పటికైతే 'లక్కీ భాస్కర్', 'క' వంటి రెండు తెలుగు చిత్రాలకు మంచి బజ్ వుంది. రెండూ వేటికవే ప్రత్యేకమైన కంటెంట్ తో రూపొందినవి కావడం.. ప్రమోషనల్ మెటీరియల్ కూడా ఆకట్టుకోవడంతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది.
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "లక్కీ భాస్కర్". 90వ దశకంలో స్టాక్ మార్కెట్ లో జరిగిన స్కామ్ నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. కోటీశ్వరుడుగా మారిన ఒక మామూలు బ్యాంక్ క్యాషియర్ జీవిత ప్రయాణాన్ని ఇందులో చూడబోతున్నాం. టీజర్, ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలు కలిగించాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎస్. నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించాయి.
'లక్కీ భాస్కర్' విజయంపై నిర్మాత నాగ వంశీ చాలా ధీమాగా ఉన్నారు. సినిమాలో తప్పులు వెతికిన వారికి పార్టీ ఇస్తానని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. కంటెంట్ మీద నమ్మకంతో ఒకరోజు ముందుగానే, అంటే అక్టోబరు 30వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100 పెయిడ్ ప్రీమియర్ షోలు వేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగుతో పాటుగా తమిళ మలయాళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.
కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తూ, నిర్మించిన చిత్రం "క". సుజిత్-సందీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ థ్రిల్లర్ మూవీ అక్టోబర్ 31న వస్తోంది. ఇంతవరకూ బిగ్ స్క్రీన్ మీద రాని కొత్త పాయింట్ తో ఈ సినిమా రూపొందినట్లుగా మేకర్స్ చెబుతున్నారు. ఇతర సినిమాలతో పోలికలు ఉన్నాయని అనిపిస్తే, తాను ఇంక మూవీస్ చెయ్యమని కిరణ్ ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సినిమా కంటెంట్ పై అంత నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది.
"క" సినిమా థియేట్రికల్ హక్కులను నందిపాటి వంశీ దక్కించుకున్నారు. ముందుగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ తమిళ్ లో థియేటర్లు దొరకలేదు. మలయాళంలో ఈ చిత్రాన్ని హీరో దుల్కర్ సల్మాన్ విడుదల చేస్తున్నారు. కాకపోతే ఆయన నటించిన 'లక్కీ భాస్కర్' అదే రోజున వస్తుండటంతో, కిరణ్ మూవీని రిలీజ్ చేయడం లేదు. ప్రస్తుతానికి దివాళీకి తెలుగులో విడుదల చేసి, నవంబరు 7న మిగిలిన భాషల్లోకి తీసుకెళ్ళాలని చూస్తున్నారు.
ఇలా దీపావళికి తెలుగులో క్లాస్ ను ఆకట్టుకునే పీరియడ్ డ్రామా.. మాస్ ను అలరించే రస్టిక్ పీరియడ్ థ్రిల్లర్ రాబోతున్నాయి. మరోవైపు అనువాద చిత్రాలు కూడా ప్రచార కార్యక్రమాలతో తెలుగు ఆడియన్స్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. శివ కార్తికేయన్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన బయోగ్రాఫికల్ యాక్షన్ మూవీ 'అమరన్' ఈ వారమే వస్తోంది. ప్రశాంత్ నీల్ కథతో రూపొందిన కన్నడ డబ్బింగ్ మూవీ 'బఘీర' కూడా థియేటర్లలోకి రాబోతోంది. మరి వీటిల్లో ఏయే సినిమాలు దీపాల పండక్కి బాక్సాఫీస్ వద్ద గట్టిగా సౌండ్ చేస్తాయో చూడాలి.