అలా మాయమై.. ఇలా ‘బిగ్ బాస్’లో తేలాడు
మొత్తానికి తెలుగు బిగ్ బాస్ షో మళ్లీ వచ్చేసింది. ఎప్పట్లాగే అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొత్త సీజన్ ఆదివారమే శ్రీకారం చుట్టుకుంది.
By: Tupaki Desk | 2 Sep 2024 3:55 PM GMTమొత్తానికి తెలుగు బిగ్ బాస్ షో మళ్లీ వచ్చేసింది. ఎప్పట్లాగే అక్కినేని నాగార్జున హోస్ట్‌గా కొత్త సీజన్ ఆదివారమే శ్రీకారం చుట్టుకుంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న పేర్లే కంటెస్టెంట్లుగా ఖరారయ్యాయి. వారిలో కొందరు తెలిసిన వాళ్లున్నారు. కొందరు పూర్తిగా కొత్త అనిపించారు. 14 మంది పోటీదారుల్లో తెలుగేతర వ్యక్తులు కూడా ఉన్నారు. అందులో కాస్త ప్రత్యేకంగా అనిపించే పేరు.. ఆదిత్య ఓం. ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్లో బాగానే వినిపించింది. కానీ తర్వాత ఏమయ్యాడో తెలియదు. తెలుగు ప్రేక్షకులు పూర్తిగా మరిచిపోయిన సమయంలో ఇప్పుడిలా ‘బిగ్ బాస్’ షోలో తేలాడు. టాలీవుడ్లోకి తన అరంగేట్రం.. తర్వాత తన ప్రయాణం కొంచెం భిన్నమైనవే.
వైవీఎస్ చౌదరి సినిమా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఉత్తర్ ప్రదేశ్ కుర్రాడైన ఆదిత్య. ఆ చిత్రం తన నటన, డైలాగ్ డెలివరీ విమర్శలకు దారి తీశాయి. కానీ సినిమా సూపర్ హిట్ కావడంతో ఆదిత్యకు అవకాశాలు వరుసకట్టాయి. కానీ తన తర్వాతి చిత్రాలేవీ సరిగా ఆడలేదు. ధనలక్ష్మీ ఐ లవ్యూ, మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి.. ఇలా వరుసగా సినిమాలు వచ్చాయి కానీ.. ఏవీ ప్రేక్షకులను మెప్పించలేదు. తర్వాత అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఆదిత్య దర్శకుడిగా మారాడు. స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో సైలెన్స్ అనే మూకీ మూవీ తీశాడు. కానీ అది విడుదలకే నోచుకోలేదు. కానీ హిందీలోకి వెళ్లి ‘బందూక్’ అనే సినిమా తీస్తే అవార్డులు గెలుచుకుంది, దాని స్క్రిప్ట్ ఆస్కార్ లైబ్రరీకి వెళ్లింది. ఇంకా కొన్ని అవార్డు సినిమాలేవో తీశాడు ఆదిత్య. కానీ ఆర్థికంగా ఆ సినిమాలేవీ ఆశించిన ప్రయోజనాన్ని ఇవ్వలేదు. మధ్య మధ్యలో తెలుగులో కొన్ని ప్రయత్నాలు చేశాడు. అలాగే తెలంగాణలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని వార్తల్లో నిలిచాడు. ఆపై మాత్రం కనుమరుగైపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ షోతో మళ్లీ ఆదిత్య వెలుగులోకి వచ్చాడు. మరి ఈ షోలో తను ఏమాత్రం ప్రత్యేకతను చాటుకుంటాడో చూడాలి.