Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8 : ఇత‌డే స‌రైన రీప్లేస్‌మెంట్

తెలుగులో బిగ్ బాస్‌కి నాగార్జున మెజారిటీ సీజ‌న్ల‌కు హోస్ట్ గా కొన‌సాగారు. 6 సీజ‌న్లుగా ఆయ‌న త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించారు

By:  Tupaki Desk   |   7 Oct 2024 7:30 PM GMT
బిగ్ బాస్ 8 : ఇత‌డే స‌రైన రీప్లేస్‌మెంట్
X

తెలుగులో బిగ్ బాస్‌కి నాగార్జున మెజారిటీ సీజ‌న్ల‌కు హోస్ట్ గా కొన‌సాగారు. 6 సీజ‌న్లుగా ఆయ‌న త‌న‌కు ఎదురే లేద‌ని నిరూపించారు. అలాగే యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్టింగ్ తో మొద‌టి సీజ‌న్ ని, నేచుర‌ల్ స్టార్ నాని హోస్టింగ్ తో రెండో సీజ‌న్ ని కొన‌సాగించిన బిగ్ బాస్, ఆ త‌ర్వాత వ‌రుస సీజ‌న్ల‌కు నాగార్జున‌ను హోస్ట్ గా కొన‌సాగించ‌డం ఆస‌క్తిని క‌లిగించింది. నాగ్ త‌న‌దైన స్టైల్, ఈజ్ తో బిగ్ బాస్ ని విజ‌య‌వంతంగా ర‌న్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే, త‌మిళంలో విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ ఆరంభ సీజ‌న్ నుంచి ఏకంగా ఏడు సీజ‌న్ ల‌కు అజేయంగా హోస్ట్ గా కొన‌సాగారు. ఆయ‌న‌ను రీప్లేస్ చేసేందుకు బిగ్ బాస్ యాజ‌మాన్యం వెనుకంజ వేసింది. చివ‌రికి క‌మ‌ల్ హాస‌న్ త‌న‌కు ఉన్న బిజీ సినిమా క‌మిట్ మెంట్లు, రాజ‌కీయ క‌మిట్ మెంట్ల కార‌ణంగా సీజ‌న్ 8కి హోస్టింగ్ చేయ‌లేన‌ని ప్ర‌క‌టించారు. ఆ త‌ర్వాత ఈ సీజ‌న్ హోస్ట్ గా సింబు (గతంలో బిగ్ బాస్ అల్టిమేట్‌ను హోస్ట్ చేసినందున) ఎంట‌ర్ అవుతాడని భావించారు. కానీ చివ‌రిగా విజ‌య్ సేతుప‌తి హోస్ట్ గా ఎంట్రీ ఇచ్చారు. ఈ షో కొత్త హోస్ట్‌గా విజయ్ సేతుపతి ఆధ్వర్యంలో 18 మంది పోటీదారులను పరిచయం చేయడంతో బిగ్ బాస్ తమిళ్ సీజన్ 8 అధికారికంగా గ్రాండ్ గా ప్రారంభ‌మైంది.

గత 7 సీజన్‌లుగా ఈ షోకి ఎదురేలేని హోస్ట్‌గా వ్యవహరించిన కమల్ హాసన్ కి సేతుప‌తి స‌రితూగుతాడా? అని ఒక సెక్ష‌న్ సందేహించినా అన్ని సందేహాల‌ను ప‌టాపంచ‌లు చేస్తూ అత‌డు దూసుకొచ్చాడు. విజ‌య్ సేతుపతి హోస్టింగ్‌కు సానుకూల స్పందనలు వ్య‌క్త‌మ‌య్యాయి. పోటీదారుల స్పంద‌న‌ల న‌డుమ సేతుప‌తి ఛ‌మ‌క్కులు అంద‌రినీ ఆక‌ట్టుకున్నాయి. అభిమానులు ఆశించిన‌ దానిని అత‌డు అందించాడు. అందుకే దీనికి అద్భుత‌మైన స్పంద‌న ద‌క్కింది. అయితే ఆరంభం అద‌ర‌గొట్ట‌డం వేరు.. తుదికంటా ఇదే విధంగా ర‌స‌వ‌త్త‌రంగా కొన‌సాగిస్తూ ప్ర‌తి ఎపిసోడ్ ని ర‌క్తి క‌ట్టించ‌డం వేరు. సేతుప‌తి వారం వారం బిగ్ బాస్ ఇంటి స‌భ్యుల‌తో సంభాషిస్తూ హోస్ట్ గా త‌న‌ను తాను ఎలివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏం జ‌రుగుతుందో వేచి చూడాలి.