Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్లు వీరే.. కొత్త రూల్స్ తో కిరాక్

ఈ సీజన్ మొత్తం కెప్టెన్లు ఉండరని చెప్పారు. అంతేకాదు.. ఈ సీజన్ కు మరో రెండు కండీషన్లు కూడా ఉన్నాయి.

By:  Tupaki Desk   |   2 Sep 2024 5:01 AM GMT
బిగ్ బాస్ 8లో కంటెస్టెంట్లు వీరే.. కొత్త రూల్స్ తో కిరాక్
X

సంచలనాల బిగ్ బాస్ రియాల్టీ షో మళ్లీ వచ్చేసింది. తెలుగులో ఇప్పటివరకు 7సీజన్లనను విజయవంతంగా పూర్తి చేసి.. ఎనిమిదో సీజన్ మొదలైంది. వంద రోజుల పాటు సాగే ఈ రియాల్టీ షో సెప్టెంబరు1న (ఆదివారం) మొదలైంది. ఈ సీజన్ లో కొత్త ట్విస్టులు బోలెడుగా చెప్పాలి. తాజా సీజన్ లో ఎంటర్ టైన్ మెంట్.. ఫన్.. టర్న్ లు.. ట్విస్టులకు లోటు ఉండదన్న నాగార్జున మాటలకు తగ్గట్లే..బిగ్ బాస్ సీజన్ 8 ఆరంభంలోనే వీక్షకులకు షాకుల మీద షాకులు ఇచ్చేశారు.

ఈ సీజన్ మొత్తం కెప్టెన్లు ఉండరని చెప్పారు. అంతేకాదు.. ఈ సీజన్ కు మరో రెండు కండీషన్లు కూడా ఉన్నాయి. ఈ సీజన్ మొత్తంలో రేషన్ అంటూ ఇవ్వరు. వాళ్లే సంపాదించుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. ప్రైజ్ మనీ కూడా జీరో అంటూ చెప్పి ఆశ్చర్యపరిచిన నాగార్జున.. ఎవరు ఎంత ఆడితే అంతలా ప్రైజ్ మనీ ఉంటుందని.. లిమిట్ లెస్ అన్న ఆసక్తికర ట్విస్టును రివీల్ చేశారు. ఎప్పటిలానే బుల్లితెర మీద తనదైన యాంకరింగ్ తో నాగార్జున అదరగొట్టేశారు.

ఇక.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో హౌస్ మేట్స్ గా ఎంట్రీ ఇచ్చిన మొదటి పోటీదారు నటి యష్మి నిలవగా.. చివరి పోటీదారుగా వరంగల్ డైరీస్ యూట్యూబ్ చానల్ తో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న నబీల్ అఫ్రిది ఎంట్రీ ఇచ్చారు. ఈసారి హౌస్ లోకి ఒక్కో పోటీదారు కాకుండా.. జంటలుగా పంపారు. మొత్తం ఏడు జంటలు హౌస్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాయి. బిగ్ బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్లకు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్.. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ముందు వారు చెప్పిన విశేషాల్ని చూస్తే..

యష్మి

బుల్లితెర నటిగా పలు సీరియల్స్ లో నటించిన ఆమె తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం. హౌస్ లోకి వెళ్లే ముందు మాట్లాడిన ఆమె.. తనకు ఇప్పటివరకు ఏ బాయ్ ఫ్రెండ్ లేదన్నారు. ఒకప్పుడు ఉండేవాడని.. తన మూడ్ స్వింగ్స్ భరించలేక తానే అతడిని పంపేశానని చెప్పిన ఆమె.. పెళ్లిపై ఎలాంటి అభిప్రాయం లేదన్నారు. తొలుత రిలేషన్ షిప్.. లవ్ ఓకే అయ్యాక మాత్రమే తాను పెళ్లి చేసుకుంటానని చెప్పిన ఆమె.. పెద్దలు కుదుర్చిన పెళ్లి అసలే చేసుకోనంటూ అందరిని ఆకర్షించే ప్రయత్నం చేశారు.

తనకు వంట చేయటం రాదని.. బిర్యానీ లేకుండా అస్సలు ఉండలేనన్న ఆమె.. ఆకలేస్తే కోపం వస్తుందని.. తాను చెప్పిన పని ఎవరు చేయకున్నా.. అబద్ధం చెప్పినా పిచ్చ కోపం వస్తుందన్న ఆమె.. హౌస్ లోకి ఎలాంటి వ్యూహాలతోనూ తాను వెళ్లటం లేదన్నారు. కేవలం మంచి పోటీ మాత్రమే ఇస్తానని తేల్చేశారు.


నిఖిల్

కన్నడ సినిమాల్లో హీరోగా నటించిన ఇతడు డ్యాన్సర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చినట్లు చెప్పారు. అనుకోకుండా వచ్చిన అవకాశంతో తాను హీరోగా మారినట్లు చెప్పిన ఇతను.. సినిమాల్లో నటిస్తే మంచి విలన్ పాత్ర చేయాలన్న ఆసక్తిని వ్యక్తం చేశారు. బిగ్ బాస్ 8 సీజన్ లో బాధ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.

ప్రస్తుతానికి తాను సింగిల్ అని చెప్పిన ఇతడు.. ఆట మీద ఆసక్తితోనే ఈ షోకు వచ్చినట్లు చెప్పారు. హౌస్ లో ఏ అమ్మాయినీ వెతకనని.. తనకు అవసరమైన భార్యను తన తల్లి చూస్తుందన్నారు. హౌస్ లో మనశ్శాంతి కావాలన్న అతను.. అది దొరకదంటూనే తన ఆట తాను చూపిస్తానని చెప్పి హౌస్ లోకి వెళ్లాడు.


అభయ్ నవీన్

పెళ్లిచూపుల మూవీతో గుర్తింపు పొందిన నటుడు. పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా సుపరిచితం. పాత్రల్లో ఒదిగిపోయే ఇతను తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహిస్తున్న యాక్టింగ్ స్కూల్ లో ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అన్న విషయాన్ని వెల్లడించిన ఇతను.. తన నటనను లెజెండరీ నటుడు ఏయన్నార్ మెచ్చుకున్న విషయాన్ని హౌస్ లోకి వెళ్లే ముందు షేర్ చేసుకున్నారు.

నటుడిగా కొన్ని సినిమాలు చేసిన తర్వాత డైరెక్షన్ లోకి వెళ్లాలనుకుంటున్నట్లు చెప్పిన ఇతను.. రామన్న యూత్ చేశానని.. మళ్లీ బిగ్ బాస్ షోతో తన సత్తా చాటుతానన్న ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తాను కాస్తంత ఎమోషనల్ అన్న ఇతను.. దాన్ని బయటకు కనిపించనని చెప్పటం గమనార్హం.


ప్రేరణ

కన్నడ టీవీ సీరియల్ రంగనాయకితో పాపులర్ అయిన ఆమె.. తన పూర్తి పేరు ప్రేరణ కంభంగా పేర్కొన్నారు. పలు తెలుగు సీరియల్స్ లోనూ నటిస్తున్నట్లు చెప్పిన ఆమె.. మంచి డ్యాన్సర్ కూడా. బిగ్ బాస్ షోలో హౌస్ లోకి వెళ్లే ముందు అదరగొట్టే డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో ఎంట్రీ ఇచ్చిన ఆమె.. తాను ఎప్పుడూ హ్యాపీగా ఉండాలనుకుంటానని చెప్పారు.

మంచి రిలేషన్లు ఉండాలని.. ఎప్పుడూ జాలీగా ఉండాలన్న ఆమె.. ఆటలు బాగా ఆడుతానన్న ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. తనతో పోటీ పడే కంటెస్టెంట్ల పరిస్థితి ఏంటా? అని ఆలోచిస్తున్నట్లు చెప్పిన ఆమె.. తాను.. హీరోయిన్ రష్మిక చాలా మంచి స్నేహితులమన్న విషయాన్ని రివీల్ చేశారు. తామిద్దరం స్కూటీలు వేసుకొని అర్థరాత్రిళ్లు తిరిగిన రోజులు చాలానే ఉన్నాయంటూ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తనకు పెళ్లై ఎనిమిది నెలలే అయ్యిందన్న ఆమె.. తన భర్త పేరు శ్రీపాద్ అని.. తనకు హౌస్ లో లిమిట్ లెస్ గా నిద్ర కావాలని పేర్కొనటం గమనార్హం.


ఆదిత్య ఓం

లాహిరి లాహిరి లాహిరి మూవీతో ఎంట్రీ ఇచ్చిన ఆదిత్య తెలుగు వారికి సుపరిచితులే. 2005 తర్వాత తాను చేసిన సినిమాలు కొన్ని ప్లాప్ అయ్యాయని.. దాంతో ఇంట్లో నుంచి బయటకు రాలేదన్నారు. జీవితం అంటే పోరాటమని.. 2010లో తాను కెరీర్ స్టార్ట్ చేసినట్లు చెప్పారు. నాలుగు హిందీ సినిమాలకు దర్శకత్వం వహించినట్లు చెప్పిన ఆదిత్య.. తాను చేసిన సినిమాలకు అవార్డులు వచ్చాయన్నారు.

సినిమా ఇండస్ట్రీ నుంచి తీసుకున్న దానికి తిరిగి ఇవ్వాలనుకున్న కారణంగా భద్రాద్రి కొత్తగూడె దగ్గర చెరుపల్లి.. కొత్తపల్లి గ్రామాల్లో కొన్ని సోషల్ యాక్టివిటీస్ ప్రోగ్రాంస్ చేసినట్లు చెప్పారు. బిగ్ బాస్ అనేది తనకు పెద్ద సవాలుగా చెప్పిన ఇతను.. తన కెరీర్ లో మళ్లీ పుట్టేందుకు బిగ్ బాస్ తో వస్తున్నట్లు చెప్పారు. తనకు చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టమని.. హౌస్ లో తనకు లిమిట్ లెస్ గా ఛాలెంజెస్ కావాలని నాగార్జునను అడిగారు. బిగ్ బాస్ లోకి వెళ్లటాన్ని అంతరిక్షయానంగా అభివర్ణించారు.


సోనియా

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ మూవీ దిశలో నటించిన సోనియాకు గుర్తింపు లభించింది. లవ్ కు సంబంధించిన ఆమె కొత్త ఫార్ములాను చెప్పుకొచ్చి అందరి అటెన్షన్ తన మీద పడేలా చేశారు. తాను లిట్మస్ పీరియడ్ పాటిస్తానని.. తనకు నచ్చిన అబ్బాయికి తొమ్మిది నెలలు టైం పెడతానని చెప్పారు. తాను బిగ్ బాస్ షోకు రావటానికి ఒక కారణం ఉందన్నారు.

ఎంతో డబ్బులు ఉన్న వారికి సైతం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశం ఉండదని.. అతి తక్కువ మందికి వచ్చే అవకాశం తనకు లభించిందన్నారు. హౌస్ లో తనకు లిమిట్ లెస్ గా ఫ్రెండ్స్ కావాలన్న ఆమె.. తనకు కళరి.. కరాటే కూడా నేర్చుకున్నట్లు చెప్పారు. ఒకరిద్దరికి దెబ్బలు కూడా పడినట్లు చెప్పుకున్నారు.


బెజవాడ బేబక్క

బెజవాడ బేబక్కగా నెటిజన్లకు సుపరిచితులైన ఆమె అసలు పేరు మధు నెక్కంటి. తాను చేసే వీడియోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ కావటంతో బిగ్ బాస్ సీజన్ 8లో అడుగుపెట్టే అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. బెజవాడలో బేబీలు.. బేబమ్మలు ఎక్కువని.. అందుకే తాను ఆ పేరు పెట్టుకున్నట్లు చెప్పారు. విజయవాడ - గుంటూరు షటిల్ సర్వీసులు చేసినట్లుగా తాను అమెరికాకు తరచూ వెళ్లి వస్తుంటానని చెప్పారు.

తన మాటలు.. ప్రాసలతో పంచ్ డైలాగ్స్ తో అందరిని అలరించే ఆమె.. అమెరికాలో ఏ ప్రోగ్రాం ఉన్నా తనను వ్యాఖ్యాతగా.. గాయనిగా ఎంటర్ టైన్ చేసేందుకు పిలుస్తుంటారని చెప్పారు. హౌస్ లో తనకు లిమిట్ లెస్ గా ఫుడ్ కావాలన్న కోరికను వెల్లడించారు.


శేఖర్ బాషా

రేడియో జాకీగా సుపరిచితుడైన శేఖర్ బాషా.. తాను బీటెక్ చేసిన తర్వాత రేడియో జాకీగా అవకాశం వచ్చిందన్నారు. కెరీర్ లో 18ఐఆర్ఎఫ్ అవార్డుల్ని తీసుకున్నట్లు చెప్పిన అతను తానెప్పుడూ యాక్టివిస్ట్ గా మారతానని అనుకోలేదన్నారు. పురుషుల పట్ల సమాజం వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలని.. లేకుంటే కుటుంబాలు చితికిపోతాయన్నారు.

ప్రాణాలకు తెగించి పోరాడదామని ముందుకు వచ్చినట్లు చెప్పిన శేఖర్ బాషా.. ఈ సీజన్ లో అసలుసిసలైన శేఖర్ బాషాను బిగ్ బాస్ లో చూడబోతున్నట్లుగా చెప్పారు. బిగ్ బాస్ కురావటం తన కలగా చెప్పిన అతను.. చాలా రోజుల నుంచి ఈ అవకాశం కోసం తాను చూస్తున్నట్లు చెప్పారు. హౌస్ లో తనను ఫ్రెండ్ గా చూస్తే ఫర్లేదు కానీ శత్రువుగా చూస్తే మాత్రం బిగ్ బాస్ టైటిల్ పట్టుకుపోతానంటూ ఫుల్ స్వింగ్ లో ఉన్న తన కాన్ఫిడెన్స్ ను ప్రదర్శించారు.


కిరాక్ సీత

బేబీ మూవీలో గుర్తింపు తెచ్చుకున్న నటి కిర్రాక్ సీత. కిర్రాక్ తన పేరుగా చెప్పిన ఆమె తన పర్సనాలిటీ కూడా అలానే ఉంటుందని వ్యాఖ్యానించారు. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ వచ్చానని.. తనకేం చేయాలనిపిస్తే అది చేస్తూ చేస్తున్నట్లు చెప్పారు. చాలా క్యారెక్టర్లు చేశానని.. బేబీలో తాను చేసిన పాత్రే నిజమైన క్యారెక్టర్ గా పేర్కొన్నారు.

ఆ సినిమాతో ఒక నటిగా తాను ఎంతో సంతోషంగా ఫీలయ్యానని చెప్పిన ఆమె.. తనను వ్యక్తిగతంగా అవమానించారన్నారు. తన ముందు ఒకలా.. వెనుక ఒకలా మాట్లాడేవారంటే తనకు కోపమన్నారు. కెమెరా ముందు నటించాలే కానీ.. కెమెరా వెనుక నటించకూడదన్నారు. తనను తాను ఫ్రూవ్ చేసుకోవటానికి లిమిట్ లెస్ గా అవకాశాలు రావాలన్న ఆమె.. తన కెరీర్ లో తాను ఉన్నత స్థాయికి చేరుకోవాలన్న ఆకాంక్షను వెల్లడించారు.


నాగ మణికంఠ

సామాన్యుడి (కామన్ మ్యాన్)గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చానని.. తాను కోల్పోయిన గౌరవాన్ని తిరిగి పొందేందుకే తాను బిగ్ బాస్ 8 సీజన్ లో అడుగు పెట్టినట్లు చెప్పారు. షార్ట్ ఫిలిమ్స్.. వెబ్ సిరీస్ లతో గుర్తింపు తెచ్చుకున్న ఇతను.. సీరియల్స్ లోనూ నటిస్తున్నాడు. బిగ్ బాస్ షోతో తన కెరీర్ కు మరింత సాయం చేస్తుందన్న ఉద్దేశంతో ఈ షోకు వచ్చినట్లుగా పేర్కొన్నారు.


పృథ్వీరాజ్

బిగ్ బాస్ సీజన్ 8లో హౌస్ లోకి పదకొండో కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన ఇతను.. కన్నడకు చెందిన నటుడు. తెలుగులో నాగపంచమి సీరియల్ తో పాటు నీతోనే డ్యాన్స్ షోలతో పాపులర్ అయ్యాడు. కన్నడలో సీరియల్స్.. సినిమాలు చేశారు. బిగ్ బాస్ షో అద్భుతమైన షో అని.. ఇందులో పాల్గొనాలన్న కోరిక ఎప్పటి నుంచో ఉందని చెప్పాడు. మనీ.. పేరు కోసమే ఈ షోకు వస్తున్నట్లు చెప్పిన అతను ప్రేక్షకుల నుంచి లిమిట్ లెస్ ప్రేమ కావాలన్నారు.


విష్ణుప్రియ

నటి కం యాంకర్ గా సుపరిచితురాలైన విష్ణుప్రియ పన్నెండో పోటీదారుగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు. తనకు ఈ సీజన్ లో ఎంటర్ టైన్ మెంట్ లిమిట్ లెస్ గా కావాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు.


నైనిక

ఈటీవీలో నిర్వహించే ఢీ డ్యాన్స్ షోతో ద్వారా పాపులర్ అయిన ఆమె.. బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే ఇష్టమని.. డ్యాన్సర్ ను కాకుంటే నటిని అయ్యేదానిని అని చెప్పిన ఆమె.. కెమెరా ముందు ఉండాలన్నదే తన కోరికగా చెప్పారు. తన తల్లికి కూడా తాను నటిగా ఉండటం ఇష్టమన్నారు.


నబీల్ అఫ్రిది

వరంగల్ డైరీస్ అన్న పేరుతో యూట్యూబ్ చానల్ తో సుపరిచితమైన ఇతను .. తన చానల్ తో యూత్ లో మంచి క్రేజ్ ఉంది. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్న కోరికతో ఫన్నీ స్కిట్ లు చేస్తుంటారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ఇతను.. బిగ్ బాస్ ద్వారా తన కల నెరవేరిందని చెప్పాడు.