Begin typing your search above and press return to search.

టాలీవుడ్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే!

దీని కంటే ముందు రిలీజైన సుహాస్ సినిమా 'అంబానీ పేట మ్యానేజ్ బ్యాండ్' మాత్రం విజయం సాధించింది.

By:  Tupaki Desk   |   1 March 2024 3:46 AM GMT
టాలీవుడ్ ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే!
X

ఫిబ్రవరి గడిచిపోయింది.. మార్చి వచ్చేసింది. గత నెలలో వారానికి అర డజను చొప్పున, అనేక చిన్నా చితకా చిత్రాలు థియేటర్లలోకి వచ్చేశాయి. వాటిల్లో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులని అలరించి, ఓ మోస్తరు వసూళ్లు రాబట్టాయి. ఈ నెలలో వచ్చిన ఒకే ఒక్క పెద్ద సినిమా 'ఈగల్'. రవితేజ నటించిన ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీసు దగ్గర ఆశించిన స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేకపోయింది. దీని కంటే ముందు రిలీజైన సుహాస్ సినిమా 'అంబానీ పేట మ్యానేజ్ బ్యాండ్' మాత్రం విజయం సాధించింది.

'ఊరు పేరు భైరవకోన' మూవీ ఫిబ్రవరి బాక్సాఫీసుకు కళ తీసుకొచ్చింది. సక్సెస్ కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూసిన యువ హీరో సందీప్ కిషన్ కి ఎట్టకేలకు మంచి సూపర్ హిట్ అందించింది. అయితే చివరి వారంలో వచ్చిన 'సుందరం మాస్టర్', 'మస్త్ షేడ్స్ ఉన్నాయ్ రా', 'సిద్దార్థ్ రాయ్' వంటి చిన్న చిత్రాలు పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. ఇక మిగతా సినిమాలన్నీ ఎప్పుడు థియేటర్లలోకి వచ్చాయో జనాలకు తెలియకుండానే వెళ్లిపోయాయి.

ఓవరాల్ గా ఫిబ్రవరి నెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పెద్దగా మెరుపులేవీ లేవు. దీంతో ఇప్పుడు మార్చిపై అందరి దృష్టి పడింది. ఎందుకంటే ఈ నెలలో కాస్త క్రేజ్ ఉన్న సినిమాలే ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాయి. మార్చి 1న రిలీజ్ అయ్యే వరుణ్ తేజ్ 'ఆపరేషన్ వాలెంటైన్' తో ఈ నెల సినిమా సందడి ప్రారంభం కానుంది. ఆ తర్వాత శివరాత్రి పండుగ సందర్భంగా మార్చి 8న గోపీచంద్ హీరోగా నటించిన 'భీమా', విశ్వక్ సేన్ 'గామి' చిత్రాలు విడుదల కాబోతున్నాయి.

శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన 'ఓం భీమ్ బుష్' సినిమా మార్చి 22న రిలీజ్ అవుతోంది. అదే రోజున అల్లరి నరేశ్ హీరోగా చేసిన 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీ కూడా థియేటర్స్ లోకి రానుందిం ఇక నెలాఖరు మార్చి 29న సిద్ధు జొన్నలగడ్డ నటించిన 'టిల్లూ స్క్వేర్' సినిమా వస్తోంది. 'చారి 111', 'వ్యూహం', 'భూతద్దం భాస్కర్ నారాయణ' లాంటి మరికొన్ని చిత్రాలు ఇదే నెలలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తున్నాయి.

అయితే మార్చి నెలలో రాబోయే సినిమాలకు ఇది పరీక్షా కాలం అనే చెప్పాలి. ఎందుకంటే రెండు తెలుగు స్టేట్స్ లో అన్ని తరగతుల స్టూడెంట్స్ కు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవ్వగా.. ఈరోజు నుంచి ఆంధ్రప్రదేశ్ లోనూ స్టార్ట్ అవుతున్నాయి. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వాళ్లకు డే బై డే ఎగ్జామ్స్ జరుగుతాయి. దీంతో దాదాపు నెలంతా విద్యార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతూ బిజీగా ఉంటారు. ఇదే నెలలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ కూడా ప్రారంభం కానున్నాయి. కాబట్టి పిల్లలతో పాటుగా ఫ్యామిలీస్ అంతా సినిమాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు.

పరీక్షలు పూర్తయ్యే సమయానికి ఏపీలో ఎన్నికల వాతావరణం మరింత హీట్ ఎక్కుతుంది. ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత దాదాపు జనాలంతా ఆ మూడ్ లోకి వెళ్ళిపోతారు కాబట్టి, సినిమా హాళ్లు ఖాళీగా ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. మరోవైపు మార్చి నెలాఖరున ఐపీఎల్ క్రికెట్ టోర్నీ ప్రారంభం కానుంది.. అది మే నెల లాస్ట్ వరకూ జరగనుంది. ఇది కచ్ఛితంగా సినిమాల కలెక్షన్స్ పై ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ ఆలోచించి చూస్తే రాబోయే రెండు మూడు నెలలు టాలీవుడ్ అతి పెద్ద సవాళ్ళను ఎదుర్కోబోతోందని అనుకోవాలి. మరి వీటన్నిటినీ ఫేస్ చేసి ఏయే సినిమాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్స్ అవుతాయో వేచి చూడాలి.