మంచాన పడకుండా పోతే అదే గొప్ప జీవితం!
ప్రపంచంలో సగం సంపదంతా ఈ మూడు వేల మంది వద్దనే ఉంది.
By: Tupaki Desk | 4 Jan 2025 2:45 AM GMTడ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ పాడ్ కాస్ట్ ద్వారా ఎన్నో గొప్ప విషయాలు పంచుకుంటోన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఏ టాపిక్ తీసుకున్నా? దానిపై ఎంతో గొప్పగా మాట్లాడుతున్నారు. తాజాగా ఈసారి బిలీయనీర్లపై మాట్లాడారు. ఆ సంగతేంటో ఆయన మాటల్లోనే..' ప్రపంచంలో మూడు వేల మంది బిలియనీర్లు ఉన్నారు. వారిలో పది శాతం మహిళలు. వాళ్లందరి ఆస్తి కలిపితే ఎన్నో ట్రిలియన్ డాలర్లు. ప్రపంచంలో సగం సంపదంతా ఈ మూడు వేల మంది వద్దనే ఉంది. ఎక్కువ మంది కోటీశ్వరులు టెక్నాలజీ, పైనాన్స్, రియల్ ఎస్టేట్ రంగాలకు చెందిన వారు.
67 శాతం మంది బిలియనీర్లు కష్టపడి పైకి వచ్చిన వారు. మిగిలిన వారు వారసత్వంతో ఎదిగిన వారు. 2023 లో స్వయంగా ఎదిగిన బిలియనీర్ అలెగ్జాండర్ వాంగ్. అతడు 20 ఏళ్లకే సంపన్నుడయ్యాడు. కైలీ జెన్నర్ కూడా చిన్న వయసులోనే బిలియనీర్ అయింది. ఎక్కువ మంది సంపన్నులు జీవించే ప్రాంతాలు కావడంతో న్యూయార్క్ మాస్కో, హాంకాంగ్, ముంబైలను బిలియనీర్ సిటీస్ అని పిలుస్తారు. ఛారిటీల కోసం చాలా మంది దానం చేస్తారు. వారెన్ బఫెట్, బిల్ గేట్స్ తమ సంపదలో 50 శాతం ఇచ్చేసారు. ఎలన్ మస్క్, జెఫ్ బెజోస్, రిచర్డ్ బ్రాన్సస్ లాంటి వారు అంతరిక్ష పరిశోధనపై దృష్టి పెట్టారు.
ఏదో ఒక రోజు స్పేస్ ట్రావెల్ ను అందుబాటులోకి తీసుకురావాలని శ్రమిస్తున్నారు. ఇలా ప్రతీ బిలియనీర్ కు ఓ విజన్ ఉంది. ఈ మూడు వేల మంది సంపన్నులు దేవుడి ముద్దు పిల్లలు. వీరిలాగే మనం ఆస్తి కావాలని దేవుడుని మొక్కుతాం. మరి దేవుడు వారికి అన్ని ఇచ్చాడు. అయినా మనకంటే ఎక్కువగా వారు దేవుడిని మొక్కుతారు. ఆరోగ్యంగా ఉండాలనే వారంతా కోరుకునేది. వయసు మీద పడుతోన్న బిలియనీర్లు, రోజులు గడుస్తుంటే భయ పడుతూ బ్రతుకుతుంటారు. ప్రతీ గంటకు వారి బ్యాంక్ ఖాతాలో డబ్బు జమా అవుతుంది.
ఎందుకంటే వారి ఆదాయం రోజుకు 200 కోట్ల నుంచి 300 కోట్ల వరకూ ఉంటుంది. ఆయుషు ఎలాగూ పెరగదు కాబట్టి బతికినంత కాలం ఆనందంగా ఉంటూ మంచాన పడకుండా పోవాలన్నదే వారి కోరిక. మనదీ అదే ఆశ. అందుకే పెద్దలు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మనం జీవితంలో ఏం సాధించినా? సాధించకపోయినా? ఆరోగ్యంగా ఉంటే చాలు. ఏదో ఒక రోజు దేవుడు మిమ్మల్ని కూడా ఎత్తుకుని ముద్దాడుతాడు. అప్పటికి మీరు ఆరోగ్యంగా ఉంటే చాలు. అనుభవించేదుకైనా ఆరోగ్యం కావాలి` అని ముగించారు.