బిర్సా ముండా జీవితకథతో పా.రంజిత్
ప్రస్తుతం నటీనటుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటున్నామని, త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు.
By: Tupaki Desk | 1 Sep 2024 1:30 AM GMTతమిళ వాసనలతో తెరకెక్కించిన కబాలి ఆశించిన విజయం సాధించకపోయినా కానీ, భారీతనం నిండిన సినిమాలతో పా.రంజిత్ కెరీర్ పరంగా బిజీగానే ఉన్నాడు. ఇటీవలే చియాన్ విక్రమ్ కి మరపురాని హిట్ ని ఇచ్చాడు. తంగళన్ సినిమా పా.రంజిత్ కి పెద్ద ఊరట. ఈ చిత్రం తమిళం, తెలుగు వెర్షన్లు విజయం సాధించగా, హిందీ వెర్షన్ సెప్టెంబర్ 6న విడుదల కానుంది. ఇంతలోనే పా.రంజిత్ 'బిర్సా ముండా' అనే కొత్త హిందీ చిత్రానికి కూడా పని చేస్తున్నాడు. కాస్టింగ్ ప్రకటనలు త్వరలో రానున్నాయని తెలుస్తోంది.
ఇటీవలి చాటింగ్ సెషన్‌లో తాను త్వరలో ఓ హిందీ సినిమా చేయనున్నట్టు పేర్కొన్న పా.రంజిత్ పింక్‌విల్లాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తంగళన్ తర్వాత వెంటనే ప్రొడక్షన్ ప్రారంభించవచ్చు లేదా ప్రారంభించకపోవచ్చు అని అన్నారు. అతడి తదుపరి హిందీ చిత్రం గురించి ప్రశ్నించగా.. గతంలో ఓ ప్రాజెక్ట్ కోసం రణ్‌వీర్ సింగ్ - అక్షయ్ కుమార్ లతో చర్చలు జరిగినట్లు తెలిపాడు. తాను 'బిర్సా ముండా' అనే ప్రాజెక్ట్‌పై సంతకం చేసినట్లు పా.రంజిత్ ధృవీకరించాడు. స్క్రిప్ట్ దాదాపుగా ఖరారైంది. ఈ స్క్రిప్టును స్నేహితుడితో కలిసి రాశారు.
నేను ఒక ప్రాజెక్ట్‌పై సంతకం చేశాను. దీనికి 'బిర్సా ముండా' అనే టైటిల్ పెట్టినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం నటీనటుల ఎంపికపై నిర్ణయం తీసుకుంటున్నామని, త్వరలోనే పూర్తి వివరాలను ప్రకటిస్తామని తెలిపారు. పా.రంజిత్ ఇప్పటికే 'తంగళన్ 2'ని ప్రకటించారు. వరుసగా చియాన్ విక్రమ్ తో పని చేసేందుకు అతడు ఆసక్తిగా ఉన్నాడు. బిర్సా ముండా సినిమాలో ప్రధాన పాత్రలో ఎవరు నటిస్తారు? అన్నది వేచి చూడాలి.
ఎవరు ఈ బిర్సా ముండా?
బిర్సా ముండా ఒక భారతీయ గిరిజన స్వాతంత్య్ర కార్యకర్త. ముండా తెగకు చెందిన జానపద హీరో. అతడు 19వ శతాబ్దం చివరలో బ్రిటీష్ రాజ్ సమయంలో బెంగాల్ ప్రెసిడెన్సీలో (ప్రస్తుతం జార్ఖండ్) ఉద్భవించిన గిరిజన మత సహస్రాబ్ది ఉద్యమానికి నాయకత్వం వహించాడు. తద్వారా భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో అతడు ఒక ముఖ్యమైన వ్యక్తిగా నిలిచాడు. అతడి తిరుగుబాటు కేంద్ర స్థానం.. ప్రధానంగా ఖుంతి, తమర్, సర్వదా, బంద్‌గావ్‌లోని ముండా బెల్ట్‌లో కేంద్రీకృతమై ఉంది.
బిర్సా తన గురువు జైపాల్ నాగ్ మార్గదర్శకత్వంలో సల్గాలో విద్యను అభ్యసించాడు. తరువాత, బిర్సా జర్మన్ మిషన్ స్కూల్‌లో చేరడానికి క్రిస్టియన్‌గా మారాడు. అయితే బ్రిటీషర్లు గిరిజనులను విద్య ద్వారా క్రైస్తవ మతంలోకి మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారని తెలుసుకున్న తర్వాత వెంటనే విడిచిపెట్టాడు. ముండా కమ్యూనిటీ సభ్యులు సైతం అతడిని నమ్మి తిరిగి హిందూ విశ్వాసంలో చేరడం ప్రారంభించారు. ఇది బ్రిటీష్ కార్యకలాపాలకు సవాలుగా మారింది. నిజమైన శత్రువులు బ్రిటిష్ వారు క్రిస్టియన్ ముండాలు కాదని బిర్సైత్‌లు బహిరంగంగా ప్రకటించారు. ముండా తిరుగుబాటుకు కారణం 'కలోనియల్ మరియు స్థానిక అధికారులచే అన్యాయమైన భూసేకరణ పద్ధతులు, గిరిజన సాంప్రదాయ భూ వ్యవస్థను కూల్చివేసాయి.
బిర్సా ముండా బ్రిటీష్ క్రైస్తవ మిషనరీలను సవాలు చేయడం..మత మార్పిడి కార్యకలాపాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో పేరుగాంచాడు. ముండా ఒరాన్ కమ్యూనిటీలతో కలిసి పని చేసాడు. 1897లో అతడు బ్రిటీష్ వారిపై యుద్ధం ప్రకటించాడు. అతడి వీరత్వాన్ని చరిత్ర గుర్తించింది. గిరిజన నాయకుడి ఔన్నత్యానికి తగ్గ గౌరవం దక్కింది. అతడి చిత్రపటాన్ని భారత పార్లమెంటు మ్యూజియంలో వేలాడదీయడం ఒక గొప్ప గౌరవం. రాంచీలోని విమానాశ్రయానికి బిర్సా ముండా పేరు పెట్టడం మరో గొప్ప గౌరవం. 15 నవంబర్ 1875 - 9 జూన్ 1900 మధ్య అతడు జీవించి ఉన్నాడు. ఇప్పుడు అతడి విరోచిత పోరాటాలపై సినిమా తీసేందుకు పా.రంజిత్ చేస్తున్న ప్రయత్నం ప్రశంసించదగినది.