ప్రకాష్ రాజ్ మరో ట్వీట్.. బహిష్కరించాలని బీజేపీ డిమాండ్!
నటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్స్.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.
By: Tupaki Desk | 26 Sep 2024 1:31 PM GMTనటుడు ప్రకాష్ రాజ్ ట్వీట్స్.. కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. జస్ట్ ఆస్కింగ్ పేరుతో ఆయన చేస్తున్న పోస్టుల వల్ల పెద్ద చర్చ నడుస్తోంది. తిరుమల శ్రీవారి లడ్డూ మహాప్రసాదం కల్తీ వ్యవహారంపై ఆయన పెట్టిన పోస్ట్ తెగ చక్కర్లు కొట్టగా ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ స్పందించారు. అప్పటి నుంచి ప్రకాష్ రాజ్.. వరుస ట్వీట్లు పెడుతున్నారు. చేయని తప్పుకు సారీ చెప్పించుకోవడంలో ఆనందమేంటో అంటూ నిన్న పోస్ట్ చేసిన ఆయన.. తాజాగా మరొకటి పెట్టారు.
"గెలిచే ముందు ఒక అవతారం... గెలిచిన తర్వాత ఇంకో అవతారం.. ఏంటీ అవాంతరం.. ఏందుకు మనకీ అయోమయం… ఏది నిజం? జస్ట్ ఆస్కింగ్?" అంటూ ప్రకాష్ రాజ్ చేసిన లేటెస్ట్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. అసలు ప్రకాష్ రాజ్.. ఎవరిని ఉద్దేశించి పెడుతున్నారో తెలియడం లేదని కొందరు నెటిజన్లు చెబుతున్నారు. లడ్డూ వ్యవహారంలో ఇండియా వచ్చి ఆన్సర్స్ ఇస్తానన్న ఆయన.. ఇప్పుడు వరుస ట్వీట్స్ పెట్టడం వెనుక కారణమేంటోనని మాట్లాడుకుంటున్నారు.
అదే సమయంలో ప్రకాష్ రాజ్ ట్వీట్స్ పై భారతీయ జనతా పార్టీ (BJYM) కార్యకర్తలు.. హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ ఎదుట గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా ట్వీట్స్ ఉన్నాయని మండిపడ్డారు. ప్రకాష్ రాజ్‌ను 'మా' అసోసియేషన్ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్ చేశారు. హిందువులకు క్షమాపణలు చెప్పాలని నినాదాలు చేశారు. అనంతరం దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు.
అసలేం జరిగిందంటే?
తిరుమల లడ్డూ జంతువుల కొవ్వును వినియోగించడం అనేది భక్తుల మనోభావాలను దెబ్బతీసిందని, సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రీసెంట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు. ఆ తర్వాత ప్రకాష్ రాజ్.. తప్పు చేసింది ఎవరో కనిపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని, ప్రజల్లో భయాందోళనలు ఎందుకు పెంచుతున్నారని పోస్ట్ పెట్టారు. దీంతో సున్నితాంశాలపై ప్రకాష్ రాజ్ తెలుసుకుని మాట్లాడాలని పవన్ హితవు పలికారు.
సనాతన ధర్మంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని పవన్ వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత తాను విదేశాల్లో ఉన్నానని, ఇండియాకు వచ్చాక పవన్ ప్రశ్నలకు సమాధానమిస్తానని ప్రకాష్ రాజ్ అన్నారు. ఇంతలో వీలుంటే తన ట్వీట్‌ను మళ్లీ చదవండని కోరారు. కానీ ఆ తర్వాత నుంచి ప్రకాష్ రాజ్.. ఎవరి పేరును మెన్షన్ చేయకుండా తెలుగులో రోజుకో సోషల్ మీడియా పోస్ట్ పెడుతున్నారు. మరి ఈ విషయంలో చివరకు ఏం జరుగుతుందో వేచి చూడాలి.