Begin typing your search above and press return to search.

సంక్రాంతికి వస్తున్నాం.. ఊరమాస్ పొంగల్ సౌండ్

బ్లాక్ బాస్టర్ పొంగల్ అంటూ సెలబ్రేషన్స్ లో వచ్చే ఈ పాటను హీరో వెంకటేష్ పాడడం విశేషం. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సునామీలా వచ్చే బీట్స్‌తో పాటను ఒక పండుగలా మార్చేశారు.

By:  Tupaki Desk   |   30 Dec 2024 11:58 AM GMT
సంక్రాంతికి వస్తున్నాం.. ఊరమాస్ పొంగల్ సౌండ్
X

సంక్రాంతికి ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవబోతున్న సినిమాలలో వెంకీ సినిమా ఒకటి. ఫ్యామిలీ ఆడియెన్స్ లో వెంకీకి ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక విక్టరీ వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రలలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాపై భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.

ఇక ఈ చిత్రాన్ని 2025 జనవరి 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. "ఎఫ్2", "ఎఫ్3" లాంటి హిట్ చిత్రాల తర్వాత వెంకటేశ్ - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో వస్తున్న ఈ చిత్రం హ్యాట్రిక్ బ్లాక్‌బస్టర్‌ని అందించబోతుందని చిత్రబృందం ఆశాభావంతో ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ ప్రారంభమైనప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తించాయి. ప్రత్యేకంగా విడుదల చేసిన "గోదారి గట్టు" పాట యూట్యూబ్‌లో 50 మిలియన్ వ్యూస్‌ను దాటడంతో సినిమాపై క్రేజ్ మరింత పెరిగింది. సీనియర్ హీరోల కేటగిరీలో ఇలాంటి రికార్డును సాధించిన పాటగా "గోదారి గట్టు" నిలిచింది. అలాగే మీను సాంగ్ కూడా బాగా వైరల్ అయ్యింది.

ఈ సినిమాకు భీమ్స్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా మరో ఊరమాస్ సాంగ్ ను విడుదల చేశారు. బ్లాక్ బాస్టర్ పొంగల్ అంటూ సెలబ్రేషన్స్ లో వచ్చే ఈ పాటను హీరో వెంకటేష్ పాడడం విశేషం. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో సునామీలా వచ్చే బీట్స్‌తో పాటను ఒక పండుగలా మార్చేశారు. వెంకటేశ్ తనదైన శైలిలో పాటను పాడడమే కాకుండా, తన నృత్యంతోనూ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఈ పాటలో ఆయన ఎనర్జీ ప్రేక్షకులను థియేటర్లలో సందడిగా ఉంచనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. పాటలో “సరస్వతిపుత్ర” రామజోగయ్య శాస్త్రి రాసిన సాహిత్యం సింప్లిసిటీతో, వినసొంపుగా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన “మీను” పాటతో పాటు తాజా “బ్లాక్‌బస్టర్ సంక్రాంతి పాట” సంక్రాంతి ఉత్సవాలకు మరింత వైబ్ తీసుకు వచ్చాయి.

ఈ పాటలు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని రూపొందించబడటంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. థియేటర్లలో ఈ పాటలు పెద్ద పండుగలా ప్రేక్షకులను ఊపేయబోతున్నాయి. దిల్ రాజు ఈ చిత్రానికి ప్రత్యేకంగా భారీ బడ్జెట్ కేటాయించి రూపొందిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమా దిల్ రాజు కెరీర్‌లో మరో ముఖ్యమైన సినిమా అవుతుందని భావిస్తున్నారు. ప్రొడ్యూసర్ శిరీష్ మాట్లాడుతూ, “సంక్రాంతికి మా సినిమాతో ప్రేక్షకులకు సరదా, కుటుంబ అనుబంధాలను అందించబోతున్నాం” అన్నారు.

సంక్రాంతి బరిలో ఇతర సినిమాలతో పోటీపడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం” సినిమా దానికి తగ్గట్టుగా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించేలా తెరకెక్కుతోంది. వెంకటేశ్ ఎనర్జీ, భీమ్స్ సంగీతం, అనిల్ రావిపూడి దర్శకత్వం కలిసి సంక్రాంతి బరిలో ఈ సినిమాను ముందుండేలా చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ సంక్రాంతికి ఈ సినిమా థియేటర్లలో సందడి పండగను తీసుకురానుందనడంలో ఎటువంటి సందేహం లేదు.