సీమ కోటా గట్టిగానే ఉందండోయ్!
ఆ తర్వాత అల్లరి నరేష్ కూడా కామెడీ నేపథ్యంలో కొన్ని సీమ స్టోరీల్లో నటించాడు.
By: Tupaki Desk | 1 Feb 2025 1:30 AM GMTఒకప్పుడు రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఎక్కువగా సినిమాలొచ్చేవి. సీనియర్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ ఎక్కువగా సీమ స్టోరీలతో ఎన్నో బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. ఆ తర్వాత అల్లరి నరేష్ కూడా కామెడీ నేపథ్యంలో కొన్ని సీమ స్టోరీల్లో నటించాడు. అతడు మంచి విజయాలు అందుకున్నాడు. మహేష్ 'ఒక్కడు' కూడా సీమ నేపథ్యం తో ముడి పడి ఉంటుంది. అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా కొన్ని సినిమాల్లో సీమ పౌరుషాన్ని చూపించాడు.
ఇంకా మరికొంత మంది యంగ్ హీరోలు రాయలసీమ నేపథ్యాన్ని టచ్ చేస్తూ కొన్ని సినిమాలు చేసారు. అయితే కొంత కాలంగా సీమ నేపథ్యాన్ని చాలా మంది హీరోలు వదిలేసారు. అందులోనూ ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ మొదలవ్వడంతో సీమ వైపు ఏ హీరో చూడటం లేదు. పాన్ ఇండియా మార్కెట్ కి కనెక్ట్ అయ్యే స్టోరీలు...వైవిథ్యమైన చిత్రాలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ ఏడాది మాత్రం సీమ కోటా కాస్త గట్టిగానే కనిపిస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా రాహుల్ సంకృత్యాన్ని తెరకెక్కించబోయే చిత్రం రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో నే ఉంటుంది. ఇందులో సీమ బిడ్డగా విజయ్ కనిపించనున్నాడు. ఇదొక పీరియాడిక్ చిత్రం. బ్రిటీష్ కాలం నాటి సీమ స్టోరీని తెరపై చూపించబోతున్నారు. ఇప్పటి వరకూ ఇలాంటి నేపథ్యాన్ని ఏ డైరెక్టర్ టచ్ చేయలేదు. కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.
అలాగే మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ హీరోగా 'సంబరాల ఏటిగట్టు' తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రోహిత్ కెపీ తెరకెక్కిస్తోన్న ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ రాయలసీమ నేపథ్యంలోనే సాగుతుంది. రెండు భాగాలుగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' స్టోరీ కూడా రాయసీమ స్టోరీ అనే ప్రచారం లోఉంది. మురళి కిషోర్ సీమ లో ఓ యూనిక్ పాయింట్ తీసుకుని కథని సిద్దం చేసినట్లు సమాచారం.
ఇంకా మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతుంది. ఇది కూడా రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కించే హారర్ కామెడీ థ్రిల్లర్. ఈసారి వరుణ్ సీమ భాషలో అలరించనున్నాడు. అలాగే అప్సర రాణి, వరుణ్ సందేశ్, విజయ్ శంకర్ నటిస్తోన్న 'రాచరికం' కూడా రాయలసీమ నేపథ్యం ఆధారంగానే సురేష్ లంకలపల్లి తెరకెక్కించారు. ఈ సినిమాలన్నీ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.