Begin typing your search above and press return to search.

బ్ల‌డీ ఇష్క్ ట్రైల‌ర్: అవికాగోర్ ఫేట్ మారేనా?

ట్రైల‌ర్ ఆద్యంతం హార‌ర్ థ్రిల్స్ కి కొద‌వేమీ లేవు. కానీ అవికా గోర్ కోసం అప్ప‌టికే ఆడి వెళ్లిపోయిన పాత సినిమా ఫార్ములానే తిరిగి ఎందుకు బ‌య‌టికి తీసారు?

By:  Tupaki Desk   |   16 July 2024 3:39 PM GMT
బ్ల‌డీ ఇష్క్ ట్రైల‌ర్: అవికాగోర్ ఫేట్ మారేనా?
X

హర్రర్ చిత్రాల మాస్టర్ విక్రమ్ భట్ దర్శకత్వం వహించిన చిత్రం 'బ్లడీ ఇష్క్'. మహేష్ భట్ నిర్మాత‌. అవికా గోర్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించింది. ఈ చిత్రం 26 జూలై 2024న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్రత్యేకంగా విడుదల కానుంది. తాజాగా రిలీజ్ చేసిన‌ స్పైన్ చిల్లింగ్ ట్రైలర్‌లో అవికా న‌టన అబ్బుర‌ప‌రిచింది. చెడు మీ అన్ని భావోద్వేగాలను నియంత్రించడానికి సిద్ధ‌మైనప్పుడు.. ప్రేమ ప్రతిదీ ఓచోట చేర్చి, అన్ని భయాలు, ఆత్మలకు వ్యతిరేకంగా బలంగా నిలబడుతుందా? అనే థీమ్ లైన్ తో ఈ సినిమాని రూపొందించారు. 1920 సిరీస్‌లో వైఆర్ఎఫ్ నుంచి ఇది నాలుగో సినిమా. ట్రైల‌ర్ ఆద్యంతం హార‌ర్ థ్రిల్స్ కి కొద‌వేమీ లేవు. కానీ అవికా గోర్ కోసం అప్ప‌టికే ఆడి వెళ్లిపోయిన పాత సినిమా ఫార్ములానే తిరిగి ఎందుకు బ‌య‌టికి తీసారు? అన్న సందేహం క‌ల‌గ‌క మాన‌దు. హార‌ర్ జాన‌ర్ లో ఒక సినిమా రావ‌డం అంటే అందులో కొత్త‌ద‌నం, థీమ్ లో ఏదైనా ఆక‌ర్షించే అంశం ఉండాలి. కానీ అవేవీ ఈ ట్రైల‌ర్ లో క‌నిపించ‌లేదు. మ‌రో రెగ్యుల‌ర్ హారర్ థ్రిల్ల‌ర్ లో అవిక న‌టించింది.

త‌న సినిమా గురించి అవికా గోర్ మాట్లాడుతూ, ''విక్రమ్ సర్ (విక్రమ్ భట్) ఈ చిత్రాన్ని విజువ‌లైజ్ చేస్తున్నప్పుడు నా గురించి ఆలోచించడం, ఎంపిక చేయ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. హారర్ అనేది నేను ఒక జానర్‌గా ఆనందిస్తాను. ఈ పాత్రను పోషించడం ఆసక్తికరంగా , సవాలుగా ఉంది. ఇది 1920లో పాత్రల కంటే పూర్తిగా భిన్నమైనది. బలమైన ఉద్వేగభరితమైన స్త్రీ పాత్ర కోసం నన్ను పరిగణలోకి తీసుకున్నందుకు నేను నిజంగా కృతజ్ఞురాలిని.. భట్‌లతో కలిసి మళ్లీ పని చేయడానికి ఇది నాకు గొప్ప అవకాశం. ఈ పాత్ర (నేహా) న‌టిగా నా అంతర్గత సామర్థ్యాలను తెలుసుకోవ‌డంలో నాకు సహాయపడింది. నేను డిస్నీ+ హాట్‌స్టార్‌తో కలిసి పనిచేయడాన్ని పూర్తిగా ఆస్వాధించాను'' అని తెలిపారు.

ఈ చిత్రం గురించి దర్శకుడు విక్రమ్ భట్ మాట్లాడుతూ- ''నన్ను నమ్మడం కష్టంగా ఉండవచ్చు, కానీ హారర్ చిత్రాలను వీక్షకుల కోసం రూపొందించడాన్ని నేను పూర్తిగా ఆస్వాధిస్తాను కానీ వాటిని చూడాలంటే భయంగా ఉంటుంది. నేను చాలా కాలంగా హర్రర్ లవ్ స్టోరీని సినిమాగా తీయాలని అనుకుంటున్నాను. నేను దాని గురించి భట్ సాహబ్‌తో మాట్లాడినప్పుడు రెండవ ఆలోచన లేకుండా ఓకే చెప్పాడు. ఆపై 'బ్లడీ ఇష్క్' చిత్రీక‌ర‌ణ మొద‌లైంది. డార్క్ సెటప్, దెయ్యాలు, ఆత్మలు వంటి హార‌ర్ నేప‌థ్యం అంశాలను మంచి కథకు ట్విస్ట్‌లను జోడించి, ప్రేమకథ, సస్పెన్స్ అంశాల‌ మిశ్రమాన్ని అందించాలనుకున్నాను. అవికా గోర్ పరిశ్రమలోని అత్యంత ప్రతిభావంతురాలైన నటీమ‌ణుల్లో ఒకరు. 1920: హారర్స్ ఆఫ్ ది హార్ట్, బ్లడీ ఇష్క్‌లో అవిక న‌టించాల‌ని అనుకున్నాను.. త‌న‌ నటనతో తనను తాను అధిగమించింది. ఈ చిత్రం డిస్నీ+ హాట్‌స్టార్ ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుందని అనుకుంటున్నాను'' అన్నారు.

విక్రమ్‌తో కొత్త చిత్రాలను రూపొందించడం ఎల్లప్పుడూ గొప్ప విషయమ‌ని మ‌హేష్ భ‌ట్ అన్నారు. ప్రేక్షకులు చూడటానికి ఇష్టపడే వాటిని అందించే విషయంలో మేము ఎల్లప్పుడూ ఒకే పేజీలో ఉంటాము. బ్లడీ ఇష్క్ అనేది ఒక రకమైన గ్రిప్పింగ్ స్టోరీ.. సినిమా పూర్తయిన తర్వాత కూడా ప్రేక్షకులను ఆలోచించుకునేలా చేస్తుంది. మేము డిస్నీ+ హాట్‌స్టార్ నుండి నిరంతర మద్దతును పొందాము. వారితో క‌లిసి పని చేయడం ఆనందదాయకమైన అనుభవంగా మారింది. గ్రిప్పింగ్ స్టోరీలైన్, ఊహించని మలుపులు, భయానక సంఘటనలు నిరంతరం వెంటాడుతూ ఉంటాయి. బ్లడీ ఇష్క్‌లో ఇవన్నీ ఉన్నాయి. డిస్నీ + హాట్‌స్టార్ ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాను ఆస్వాదిస్తారని నేను విశ్వసిస్తున్నాను అని అన్నారు.