ఏడాదిన్నర ఎదురు చూశాక తొలగిస్తాడని భయపడ్డా: బాబి డియోల్
సందీప్ వంగా తెరకెక్కించిన `యానిమల్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 10 Sep 2024 1:30 PM GMTసందీప్ వంగా తెరకెక్కించిన `యానిమల్` సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. పాన్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద దాదాపు 800కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. రణబీర్ కపూర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ సినిమాలో అబ్రార్ పాత్రలో నటించిన బాబి డియోల్ దశ తిరిగిపోయింది. అబ్రార్ హక్ పాత్రలో బాబీ నటనకు ప్రశంసలు కురిసాయి. నిజానికి ఈ పాత్ర చిత్రీకరణ కోసం బాబీ 1.5 సంవత్సరాలు వేచి చూసాడు. మొదట తనను తొలగిస్తారేమోనని ఆందోళన చెందినట్టు తెలిపాడు. సినిమా ఘన విజయం సాధించినా, విడుదలకు ముందే అతడి అత్తగారు మరణించడంతో సెలబ్రేట్ చేయలేకపోయానని అన్నాడు. రణబీర్ కపూర్ డౌన్ టు ఎర్త్ స్వభావం..తనతో బలమైన అనుబంధం గురించి కూడా బాబి డియోల్ వెల్లడించారు.
అబ్రార్ హక్ గా బాబి ఇప్పటికీ అభిమానుల హృదయాలలో ఉన్నాడు. అలాంటి బలమైన పాత్రను ఆఫర్ చేసినందుకు సందీప్ వంగాను అతడు ఎప్పటికీ మరువలేడు. దీని గురించి ఇప్పటికే చాలా వేదికలపై ఉబ్బితబ్బిబ్బయ్యాడు బాబి. సినిమా విజయంతో చాలా ఉద్వేగానికి గురయ్యానని, కానీ తన అత్తగారు మరణించిన కారణంగా దీనిని సెలబ్రేట్ చేసుకోలేకపోయానని తెలిపాడు. హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సందీప్ వంగాతో పరిచయం గురించి కూడా వెల్లడించాడు. నాకు వంగా నుండి ఒక మెసేజ్ వచ్చింది. తనను తాను పరిచయం చేసుకుని.. సినిమా కోసం నన్ను కలవాలనుకుంటున్నానని చెప్పారు. అసలు అతనేనా? అనుకుని ఫోన్ చేసి మీటింగ్ ఏర్పాటు చేశాను. అతడు నేను సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో పాల్గొన్నప్పటి నా ఫోటోను నాకు చూపించి `మీ ఎక్స్ ప్రెషన్ ని నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నా సినిమాలో నటింపజేయాలనుకుంటున్నాను అని చెప్పాడు. అయితే మూగవాడి పాత్రలో నటించడంపై ప్రారంభంలో నాకు అభ్యంతరాలు ఉన్నప్పటికీ సవాల్‌ను స్వీకరించానని అన్నారు. నా కంఫర్ట్ జోన్‌కి దూరంగా ఏదైనా చేయాలనుకున్నాను. నా పాత్ర మ్యూట్(మూగ)గా ఉంటుందని వారు చెప్పినప్పుడు ``నా వాయిస్ నా బలం కదా`` అనుకున్నాను. అయినా నేను ఆ పాత్రలో నటించాలనుకున్నాను అని తెలిపారు.
అయితే `యానిమల్` చిత్రీకరణకు ముందు సుదీర్ఘ నిరీక్షణ సమయంలో తనలోని అభద్రతాభావం గురించి బాబి మాట్లాడారు. నేను సినిమా షూటింగ్ కోసం 1.5 సంవత్సరాలు వేచి ఉన్నాను. ఈ చిత్రం 3.5 గంటల నిడివి ఉంది. కాబట్టి వారు చాలా కాలం పాటు రణబీర్‌తో షూటింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో వారు తమ మనసు మార్చుకోబోతున్నారా? అని నేను ఆలోచిస్తూనే ఉన్నాను. అకస్మాత్తుగా వారికి నా అవసరం లేదని చెప్పారు. కానీ సందీప్ గొప్పవ్యక్తి. అవకాశం ఇచ్చారు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. అయితే ఇది కల్ట్ హిట్ అవుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు.
సహనటుడు రణబీర్ కపూర్‌తో కలిసి పనిచేసిన అనుభవం గురించి చెబుతూ బాబీ ఇలా అన్నారు. రణబీర్ చాలా అద్భుతమైన స్టార్.. కానీ నేను అతడితో కలిసి 12 రోజులు షూట్ లో మాత్రమే పాల్గొన్నాను. చిన్నప్పటి నుండి అతడికి నేను తెలుసు. చివరకు సెట్‌లో ఇంటరాక్ట్ అయ్యాను. పరిశ్రమలో చాలా మంది గొప్ప నటులు ఉన్నారు కానీ నేను ఎప్పుడూ రణబీర్ - అలియాకు అభిమానిని అని డియోల్ అన్నారు.
యానిమల్ విజయం సాధించాక దానిని సెలబ్రేట్ చేయాలని నా సోదరుడు సన్నీ చెబుతూనే ఉన్నాడు కానీ ఆ సమయంలో మా అత్తగారు మరణించారు. నిజానికి ఆమె ఆశీర్వాదం నాకు ఈ రకమైన ప్రేమను తెచ్చిపెట్టింది. ఆమె నాకు ప్రత్యేకమైనది. ఈ సినిమా విడుదలకు మూడు నెలల ముందు నేను అత్తమ్మను కోల్పోయాను. కాబట్టి కలత చెందాను.. యానిమల్ విజయాన్ని సెలబ్రేట్ చేయలేకపోయాను! అని బాబి తెలిపాడు.