ప్రభాస్ 'స్పిరిట్' అప్‌డేట్స్ కంటిన్యూ..!
ఇన్ని రోజులు కథ, స్క్రిప్ట్, డైలాగ్ వర్షన్ అంటూ బిజీగా ఉన్న దర్శకుడు సందీప్ వంగ ఇప్పుడు నటీనటుల ఎంపిక విషయమై చర్చలు జరుపుతున్నాడట.
By: Tupaki Desk | 20 Jan 2025 8:30 AM GMTఅర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్ దర్శకుడిగా మారిన సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం 'స్పిరిట్' సినిమాను చేసేందుకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టాడు. యానిమల్ సినిమాతో దాదాపుగా వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం ప్రభాస్‌తో స్పిరిట్‌ను అంతకు మించి చేసేందుకు భారీ కసరత్తు చేస్తున్నాడు. ఇన్ని రోజులు కథ, స్క్రిప్ట్, డైలాగ్ వర్షన్ అంటూ బిజీగా ఉన్న దర్శకుడు సందీప్ వంగ ఇప్పుడు నటీనటుల ఎంపిక విషయమై చర్చలు జరుపుతున్నాడట. సినిమాలో ప్రభాస్ కాకుండా ఒక పది పన్నెండు అత్యంత కీలకమైన పాత్రలు ఉంటాయట. ఆ పాత్రల కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది.
హీరోయిన్ విషయంలో తుది నిర్ణయం జరగలేదు. కానీ ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం తన యానిమల్ సినిమాలో నటించిన బాబీ డియోల్‌ను స్పిరిట్ సినిమాలో నటింపజేసేందుకు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మొగ్గు చూపుతున్నారు. ఈ విషయం గురించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయి. కెరీర్ ఖతం అయ్యింది, ఇంటికే పరిమితం అనుకుంటున్న సమయంలో బాబీ డియోల్‌కి సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాలో అవకాశం ఇచ్చి పూర్వ వైభవం దక్కేలా చేశాడు. అందుకే సందీప్ వంగ అడిగితే బాబీ డియోల్ ఏ పాత్ర అయినా చేసేందుకు రెడీగా ఉంటాడు అనడంలో సందేహం లేదు.
బాబీ డియోల్ ప్రస్తుతం బాలీవుడ్‌లో వరుసగా సినిమాలు చేస్తున్నాడు. హీరోగానూ ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. పలు సినిమాల్లో నెగటివ్ రోల్స్ చేస్తున్న బాబీ డియోల్‌ను స్పిరిట్ సినిమాలో విలన్‌గా కాకుండా ఒక ముఖ్యమైన పాత్రకి తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ అండ్ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా బాబీ డియోల్‌ను దర్శకుడు సందీప్ వంగ ఊహించుకుంటున్నాడట. అందుకే ఈ సినిమాలో ఆయన కోసం పాత్రను డిజైన్ చేశాడని, ఆయనకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో ముందుగా అనుకున్నట్లు కాకుండా ఆ పాత్ర డెప్త్‌ను ఇంకాస్త పెంచి మరీ బాబీ డియోల్‌ను నటింపజేయాలని దర్శకుడు సందీప్ వంగ భావిస్తున్నాడు.
స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. పీరియాడిక్ కథతో రూపొందబోతున్న ఈ సినిమాలో బాబీ డియోల్ పాత్ర గురించి లీక్ ఇస్తూ అంచనాలు పెంచుతున్నారు. ఇటీవల డాకు మహారాజ్ సినిమాలో విలన్‌గా నటించి బాబీ డియోల్ ఆకట్టుకున్నాడు. స్టైలిష్ విలన్ గా పేరు దక్కించుకున్న బాబీ డియోల్‌కి ముందు ముందు ఎలాంటి పాత్రలు ఎలాంటి సినిమాలు దక్కుతాయి అనేది చూడాలి. స్పిరిట్ సినిమాలో ఆయన పోషించే పాజిటివ్ పాత్రకు మంచి స్పందన వస్తే కచ్చితంగా ముందు ముందు ఆయన నుంచి మరిన్ని పాజిటివ్ క్యారెక్టర్ రోల్స్‌ను ప్రేక్షకులు ఆశించవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.