యానిమల్ అబ్రార్‌కి అటువంటి సమస్య!
యానిమల్ లో అబ్రార్ గా క్రూరమైన పాత్రలో నటించాడు బాబి డియోల్.
By: Tupaki Desk | 6 Aug 2024 2:30 PM GMTయానిమల్ లో అబ్రార్ గా క్రూరమైన పాత్రలో నటించాడు బాబి డియోల్. భార్యపైనే అత్యాచారానికి పాల్పడే, రక్తపాతం సృష్టించే ప్రమాదకారిగా నటించాడు. ఒక మూగవాడు ఇంత క్రూరంగా చేస్తాడా? అనిపించేంతగా అబ్రార్ పాత్రలో లీనమైపోయాడు. అందుకే ఇప్పుడు బాబి డియోల్ పేరు ఉత్తరాదితో పాటు దక్షిణాదినా మార్మోగుతోంది. దశాబ్ధం పాటు సాగిన అతడి హిందీ సినీకెరీర్ ఇవ్వలేనిది ఒక్క `యానిమల్` ఇచ్చిందంటే అతిశయోక్తి కాదు.
ప్రస్తుతం సూర్య, నందమూరి బాలకృష్ణ సహా పలువురు టాప్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నాడు. బాబి కెరీర్ గ్రాఫ్ అమాంతం స్కైహైలోకి రీచ్ అయింది. అయితే డియోల్ తాజా ఇంటర్వ్యూలో తనకు అజీర్తి ఉందని దానికి కారణం ఏమిటో కనిపెట్టానని తెలిపాడు. తాను ప్రతిరోజూ 7-8 గ్లాసుల పాలు తాగేవాడినని బాబీ డియోల్ చెప్పాడు.. ``నాకు జీర్ణ సమస్యలు ఎందుకు ఉండేవో ఇప్పుడు అర్థమైంది!`` అని కూడా సరదాగా నవ్వేశాడు.
డియోల్ కుటుంబీకులు ఒరిజినల్ పంజాబీలు.. ఆహారంపై పంజాబీల అపారమైన ప్రేమ గురించి తెలిసినదే. వారు ఆహారప్రియులు. బాబీ డియోల్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రతిరోజూ 7-8 గ్లాసుల పాలు తాగేవాడిని అని తెలిపాడు. జీర్ణ సమస్యలను ప్రస్థావించాడు. అంతే కాదు, పాలు తాగడానికి తన వద్ద ప్రత్యేకమైన గ్లాసు కూడా ఉందని కూడా వెల్లడించాడు. నేను ఎప్పుడూ ఎక్కువ పాలు పొందాలని ఎప్పుడూ ఎత్తైన గ్లాసు కోసం వెతుకుతాను. మా నాన్న (ధర్మేంద్ర)కి బహుమతిగా ఇచ్చిన ఒక ప్రత్యేక గాజు గ్లాసు నా దగ్గర ఉంది. కాబట్టి ఇది నా గ్లాస్ అని పాలు వొంపేవాడిని``అని బాబి అన్నారు. అజీర్తికి కారణం తెలిసింది గనుక ఇప్పుడు అతడు ఒక గ్లాస్ పాలు తాగుతున్నాడట.
అతి సర్వత్రా వర్జేయత్:
అయితే మితిమీరి పాలు తాగితే ఏమవుతుంది? అంటే.. గురుగ్రామ్‌లోని పరాస్ హెల్త్‌లోని డైటెటిక్స్ విభాగం చీఫ్ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ నీలిమా బిష్ట్ మాట్లాడుతూ ``రోజూ 7-8 గ్లాసుల పాలు తీసుకోవడం వల్ల పిల్లలపై ఒకరకంగా.. పెద్దలపై మరో రకంగా ప్రభావం ఉంటుంది. పిల్లలకు, పాలు కాల్షియం, విటమిన్ డి , ప్రొటీన్ చాలా అవసరం. ఎముకల పెరుగుదల అభివృద్ధికి పాలు తోడ్పడతాయి. అయినప్పటికీ అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుట .. లాక్టోస్ అసహనం వంటి జీర్ణ సమస్యలకు దారితీయవచ్చు అని చెప్పారు.
ఎక్కువ పాలు తాగే పెద్దలు అధిక సంతృప్త కొవ్వు పదార్ధం కారణంగా గుండె జబ్బులు పెరిగే ప్రమాదాన్ని ఎదుర్కోవచ్చని వైద్యులు హెచ్చరించారు. మొత్తం పాలలో సంతృప్త కొవ్వు ఉంటుంది. ఇది మన ట్రైగ్లిజరైడ్ స్థాయిలను ప్రభావితం చేస్తుంది. కాలక్రమేణా ఎలివేటెడ్ ట్రైగ్లిజరైడ్ గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుందని డాక్టర్ వర్మ వివరించారు.